- క్యాష్ వద్దు.. కార్డు రద్దు!
- ఆధార్ నంబర్ ఉంటే చాలు
- అన్ని లావాదేవీలూ చేయొచ్చు
- రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
- ఫోన్, ఆధార్, వేలి ముద్రే కీలకం
ఆధార్..
అన్నింటికీ ఆధారం. గుర్తింపు పత్రంగానే కాదు.. నగదు రహిత లావాదేవీల్లోనూ
కీలకంగా మారబోతోంది. క్రెడిట్, డెబిట్ కార్డున్నా ఆధార్ ఉంటేనే
లావాదేవీ!
నగదే కాదు..
కార్డులు కూడా త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్నాయి. దేశాన్ని నగదు రహిత
భారతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కొన్నాళ్లకు కార్డు
లావాదేవీలను కూడా రద్దు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కేవలం ఆధార్ నంబర్
ధారంగా లావాదేవీలు జరిగే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం
ఆధార్.. ఫోన్.. వేలి ముద్ర ఆధారంగా ఒక నెట్‌వర్క్‌ను అభివృద్ధి
చేస్తోంది. దీంతో మీరు ఆధార్ నంబరును చెప్పి.. మీ వేలి ముద్రను ఫోన్
ద్వారా స్కాన్ చేసి మీ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాలకు పంపవచ్చు. ఈ దిశగా
సాఫ్ట్‌వేర్‌ను, ఫోన్లను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి
సంబంధించి నీతి ఆయోగ్ ఒక పథకం రూపొందిస్తోంది. ఈ అంశంపై నీతి ఆయోగ్ సీఈవో
అమితాబ్ కాంత మాట్లాడుతూ.. ‘‘ఇకపైౖ దేశంలో ఉత్పత్తి చేసే ఫోన్లన్నీ వేలి
ముద్రల (ఫింగ్‌ప్రింట్) స్కానర్‌ను లేదా కనుపాప (ఐరిస్) స్కానర్‌ను కలిగి
ఉండేలా చూడాలని మొబైల్ తయారీదారులను కోరుతున్నాం. ఈ ఫోన్లు అందుబాటులోకి
వస్తే ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది.
అప్పుడు
కార్డు అవసరం కూడా తగ్గిపోతుంది.’’ అని వివరించారు. దీంతో మన 12 అంకెల
ఆధార్ నంబరే లావాదేవీలకు అత్యంత కీలకం కానుంది. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక
వ్యవహారాలకు ప్రస్తుతం ఆధార్ నంబరును తప్పనిసరి. అన్ని బ్యాంకు ఖాతాలూ
ఆధార్ కిందకు వచ్చేస్తాయి. దీంతో ఆధారిత లావాదేవీల నిర్వహణ సులభమవుతుందని
అధికారులు భావిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి కసరత్తు చేస్తున్న నీతి
ఆయోగ్ త్వరలోనే పక్కా ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచే వీలుంది. ఇదే
అంశంపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డైరెక్టర్ జనరల్
అజయ్ పాండే మాట్లాడుతూ.. ‘‘ఆధార్ ఆధారిత లావాదేవీలు నగదు, పిన్ రహితం
అవుతాయి. స్మార్ట్ ఫోన్లు వాడేవారు తమ ఆధార్ నంబరు, వేలి ముద్రలను ఆధారం
చేసుకుని లావాదేవీలు నిర్వహించవచ్చు.’’ అని వివరించారు.ఆధార్ ఆధారిత
లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం.. బ్యాంకులు, మొబైల్ తయారీ
సంస్థలు, వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మూడు వర్గాల
నుంచీ మద్దతు లభిస్తే ఆధార్ ఆధారిత లావాదేవీల ప్రయోగం విజయవంతమవుతుందని
అధికారులు చెబుతున్నారు.
నగదు రహిత
లావాదేవీలను విజయవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీలో
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత కూడా ఉన్నారు. ఈ కమిటీ ఏడాది పాటు
అధ్యయనం చేసి దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏం చేయాలో
వివరిస్తుంది. ఈ నేపథ్యంలో అమితాబ్ కాంత ఆధార్ ఆధారిత లావాదేవీల గురించి
వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వ్యాపారులందరినీ
ఈ-చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు కేంద్రం రూ.100
కోట్లు కేటాయించింది.
‘ఆధార్’ లావాదేవీ ఇలా ఉంటుంది!
- మీరు కిరాణా కొట్టుకు వెళ్తారు. కావాల్సిన సరకులు కొనుగోలు చేస్తారు.
- దుకాణాదారుడు ఆ సరకులకు ఎంత మొత్తం అయిందో లెక్కించి చెబుతాడు.
- ఆ డబ్బులు ఇవ్వమంటారు.
- మీరు చేతిలో డబ్బులు లేవు. ఆధార్ ఖాతా నుంచి తీసుకోండని చెబుతారు. ఆధార్ నంబరును వెల్లడిస్తారు.
- దుకాణదారుడు మీ ఆధార్ నంబరును, చెల్లించాల్సిన మొత్తాన్ని ఫోన్‌లో ఎంటర్ చేస్తాడు. మీ వేలిని ఫోన్‌లోని ఫింగర్ ప్రింట్ స్కానర్ వద్ద పెట్టమంటాడు. అక్కడ మీరు వేలిని పెట్టాక మీ ఆధార్ ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయి దుకాణాదారుని ఆధార్ ఖాతాలోకి వెళ్తాయి.

No comments:
Post a Comment