Friday, 30 September 2016

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల దసరా కానుక

పెండింగ్‌ జరిమానాల వసూలుకు ట్రాఫిక్‌పోలీస్‌ విభాగం లోక్‌అదాలత్ నిర్వహిస్తోంది. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో అక్టోబర్‌ 5, 6, 7 తేదీల్లో నిర్వహించే అదాలత్‌లో పెనాల్టీ సొమ్ములో సగం చెల్లించి కేసుల నుంచి బయటపడే అవకాశం కల్పించనుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఉల్లంఘనలను పాయింట్లు ద్వారా లెక్కించనున్నారు. వాటి ఆధారంగా లైసెన్స్‌ రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిగ్నల్‌ జంపింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌పార్కింగ్‌, మొబైల్‌ మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ వేలాదిమంది సీసీకెమెరాలకు చిక్కుతున్నారు. ఇలా పట్టుబడిన వందలమందికి ప్రతిరోజూ ఈ-చలానాలు పంపుతున్నారు. వాహనాల క్రయ, విక్రయాల్లో పెండింగ్‌ చలానాలు చాలా కీలకం. వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణాశాఖ విభాగంలో ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిందే. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పెండింగ్‌ పెనాల్టీ చెల్లించేందుకు ఇది మంచి అవకాశమని ట్రాఫిక్‌ ఏసీపీ ఎ.వి.రంగనాథ్‌ అన్నారు. పెద్ద మొత్తంలో బకాయి లుంటే రూ.1000 చెల్లిస్తే చాలని వివరించారు.

ఏటీఎం పిన్‌కోడ్ ఒకే రోజు మూడుసార్లు తప్పుగా ఎంటర్ చేస్తే...

ఒకే రోజు ఏటీఎం కార్డు పిన్‌కోడ్‌ను మూడుసార్లు తప్పుగా నమోదు చేస్తే దాని నుంచి తదుపరి లావాదేవీలు నిలిచిపోతాయి. వినియోగదారుల ప్రయోజనం కోసమే బ్యాంకులు దీన్ని అమలు చేస్తున్నాయి. కార్డు ఎవరికైనా దొరకడం లేదా ఎవరైనా చోరీ చేసి సొమ్మును కాజేసే ప్రయత్నాలు నివారించడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఖాతాదారుడు సంబంధిత బ్యాంకు టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా మరుసటి రోజుకు కార్డును సాధారణంగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసేటప్పుడు ఖాతాదారులు తప్పనిసరిగా పాస్‌పుస్తకం, ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. సేవలను పునరుద్ధరించేందకు సిబ్బంది అడిగిన వివరాలకు సంతృప్తికరమైన సమాచారాన్ని ఖాతాదారుడు చెప్పాల్సి ఉంటుంది. 

బ్యాంకుల టోల్‌ ఫ్రీ నెంబర్లు:-
     ఎస్‌బీఐ తమ ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు తమ ఖాతాలో నగదు నిల్వను తెలుసుకోవడానికి, మినీ స్టేట్‌మెంట్లు తీసుకోవడానికి వీలుగా క్విక్‌ పేరిట సేవలందిస్తుంది. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా తమ ఫోన్‌లో ఆర్‌ఈజీ అని టైప్‌చేసి స్పేస్‌ ఇచ్చి ఖాతా సంఖ్యను ఎంటర్‌ చేసిన తరువాత 09223488888కు మెసేజ్‌ పంపి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. తర్వాత నగదు బ్యాలెన్స్‌ కోసం 09223866666 నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇస్తే వివరాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయి.
 
    ఏటీఎం కార్డును బ్లాక్‌ చేయడానికి సీ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఏటీఎం కార్డు చివర ఉన్న నాలుగు అంకెలను టైప్‌ చేసి 5676కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే సరిపోతుంది. ఇదే తరహాలో టోల్‌ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్‌బీఐకు 18004253800 లేదా 1800112211కు చేయాలి. ఎస్‌బీహెచ్‌కు 18004254055 లేదా 18004251825కు చేయా లి. ఆంధ్రాబ్యాంక్‌కు 18004251615 లేదా 1800180235, కెనరా బ్యాంకుకు 18004250018 లేదా 18004256000, ఐడీబీఐ బ్యాంకుకు 1800226999 లేదా 1800 2001947కు, సిండికేట్‌ బ్యాంకుకు 18004256655కు, ఇండియన్‌ బ్యాంక్‌కు 18004250000 లేదా 1800425422కు, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్‌కు 18004259900కు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 18002001911 లేదా 1800221622కు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 1800221006 లేదా 1800224060కు, ఐసీఐసీఐ బ్యాంకుకు 18001088181 లేదా 1800228181కు ఫోన్‌ చేస్తే సరిపోతుంది.
 

ఆ విమర్శలకు సెహ్వాగే కారణం: గంగూలీ

వేగంగా పరుగులు చేసే సంస్కృతికి వీరూ, హెడేన్‌ ఆద్యులు
కోల్‌కతా: ఇప్పటి తరం టెస్ట్‌ క్రికెట్‌ ఓపెనర్లకు ఎదురవుతున్న విమర్శలన్నిటికీ భారత డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఒకప్పటి ఆసీస్‌ ఓపెనర్‌ మాథ్యూ హెడేన్‌ కారణమని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చమత్కరించాడు. ఈ ఇద్దరు ఓపెనర్లూ టెస్టుల్లో అత్యంత వేగంగా పరుగులు రాబడుతూ భారీ స్కోర్లు నమోదు చేసే సంస్కృతికి ఆద్యులని పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుత ఓపెనర్లు వేగంగా, భారీ స్కోర్లు నమోదు చేయకపోతే విమర్శల పాలవుతున్నారని వివరించాడు. ‘వేగంగా పరుగులు చేయలేక విమర్శల పాలవుతున్న ప్రస్తుత ఓపెనర్లను చూడండి. ఈ సంస్కృతిని మొదలు పెట్టింది వీరేంద్ర సెహ్వాగ్‌, మాథ్యూ హెడేన్‌. జస్టిన్‌ లాంగర్‌ సైతం ఇదే కోవలోకొస్తాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌ నిర్వచనం మార్చింది మాత్రం ఆ ఇద్దరేనని’ గంగూలీ చెప్పాడు. వీరూతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ముందు తాను కాస్త డిఫెండ్‌ చేస్తే భారీ స్కోరు వస్తుందని చెప్పేవాడినని అయితే ఆ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని దాదా చెప్పాడు. ఆటగాళ్లు వారికిష్టమైనట్లు ఆడడమే మంచిదని తెలుసుకున్నట్లు పేర్కొన్నాడు.
సెహ్వాగ్‌ స్పందిస్తూ విజయవంతమైన ఆటగాడి వెనక విజయవంతమైన కెప్టెన్‌ మద్దతుండాలని అభిప్రాయ పడ్డాడు. ‘నావెన్నంటే నా కెప్టెన్‌ (గంగూలీ) వుండటంతో నేనెప్పుడూ భయపడలేదు. రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎంఎస్‌ ధోనీ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌ నా వెనకాల వస్తారని తెలుసని’ సెహ్వాగ్‌ చెప్పాడు. ‘ఇంగ్లాండ్‌లో కఠిన పరిస్థితుల్లో గంగూలీ నా దగ్గరికి వచ్చి తాను నాతో ఉన్నాడని చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. కొంతమంది ఆటగాళ్లకు కొందరు సారథుల ప్రోత్సాహం వుండాలని’ వీరూ పేర్కొన్నాడు.

అక్టోబర్‌లో ‘బాహుబలి’ సందడే సందడి...

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇది తెలియాలంటే ఏప్రిల్‌ 28, 2017న విడుదలయ్యే ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’లో చూడాల్సిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రధాన పాత్రలు ప్రభాస్‌, రానాలు మాట్లాడారు.
ఈ చిత్రంలో నటించిన చాలా మందికి అక్టోబర్‌ నెల ప్రత్యేకమైందని అందుకే ఈ నెలలో చిత్రానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నట్లు రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి’ని మహా వృక్షంగా అభివర్ణించిన ఆయన సినిమా కేవలం ఒక కొమ్మ మాత్రమే అని పేర్కొన్నారు. బాహుబలికి సంబంధించిన కామిక్‌ బుక్స్‌, యానిమేటెడ్‌ సిరీస్‌, వర్చువల్‌ రియాల్టీ ఇలా చాలా ఉన్నాయని తెలిపారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
* అక్టోబర్‌ 1న బాహుబలి యానిమేటెడ్‌ టీజర్‌ విడుదల చేస్తాం.
* అక్టోబర్‌ 5న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కే కాదు, ప్రేక్షకులందరికీ ఓ గుడ్‌ న్యూస్‌ వెల్లడిస్తాం.
* అక్టోబర్‌ 22న ‘బాహుబలి-2’ ఫస్ట్‌లుక్‌, కామిక్‌బుక్‌ను విడుదల చేస్తాం.
* అక్టోబర్‌ 23న వర్చవల్‌ రియాల్టీ వీడియోను తీసుకొస్తాం.
* ‘బాహుబలి’ కథకు సంబంధించి దేనినైనా థియేటర్‌లోనే చూడటం ఉత్తమం.
* రెండో భాగంలో తమన్నాతో పాటలు లేవు. అనుష్కతో మాత్రం ఉంటాయి. తమన్నా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కన్పిస్తారు.

* ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’కు సంబంధించి క్లైమాక్స్‌ పూర్తయింది. సినిమాలో అన్నింటికన్నా ఇదే కష్టమైంది. ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా క్లైమాక్స్‌ పూర్తి చేశాం. ఈ విషయంలో నిర్మాత సహకారం కూడా చాలా గొప్పది. మొత్తం గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా పూర్తయింది. రెండు పాటలు.. ఒక యాక్షన్‌ పార్ట్‌ మాత్రమే చిత్రీకరించాలి.
* ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి డిసెంబర్‌ చివరి నాటికి యూనిట్‌ సభ్యులందరూ విడుదలవుతారు.
* బాహుబలి-3 ఏవిధంగా ఉంటుందనేది చెప్పలేను.
* జాతీయ స్థాయిలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే వర్చువల్‌ రియాల్టీ టెక్నాలజీ ముందుకు తీసుకువస్తున్నాం.
* నేను లేకపోయినా బాహుబలి కొనసాగాలి.

* థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడిని కచ్చితంగా బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తాం.
* ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆర్నెల్ల పాటు ఎవరికీ కన్పించను(నవ్వుతూ..)
* ఈ చిత్రం గురించి ఒత్తిడి, బాధ్యత రెండూ నాలో ఉన్నాయి.

* బాహుబలి తొలి భాగానికి టెన్షన్‌ ఉంది. కానీ రెండో భాగానికి కొంచెం కూడా టెన్షన్‌ పడలేదు.
* ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో ‘బాహుబలి’ చిత్రాన్ని విడుదల చేశాం. జపాన్‌, కొరియా మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
* ‘బాహుబలి ద: కన్‌క్లూజన్‌’లో ఇప్పటికే ఉన్న పాత్రలు తప్ప కొత్తగా ఎవరూ వచ్చి చేరలేదు.

విశ్రాంతి తీసుకుందామనే సినిమాలు చేయలేదు: ప్రభాస్‌
బాహుబలి చిత్రీకరణ సమయంలో మూడు నెలలకు పైగా ఖాళీ దొరికినా కేవలం విశ్రాంతి తీసుకుందామనే మరో చిత్రం చేయలేదని కథానాయకుడు ప్రభాస్‌ అన్నారు. మహా సముద్రం మధ్య చిన్న నదిని వదలడం భావ్యం కాదనిపించిందన్నారు. దర్శకుడు సుజిత్‌తో సహా రెండు, మూడు చిత్రాలు వరుసలో ఉన్నాయని తెలిపారు.

ఎం.ఎస్‌.ధోనీ : రివ్యూ


నటీనటులు:- సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. కైరా అడ్వాణీ.. దిశా పటానీ..అనుపమ్‌ ఖేర్‌.. భూమిక చావ్లా.. హెర్రీ ట్యాంగ్రీ.. శ్రేయస్‌ తల్పాడే.. తదితరులు...
దర్శకత్వం: నీరజ్‌ పాండే
స్క్రీన్‌ప్లే: నీరజ్‌ పాండే.. దిలీప్‌ ఝా
సంగీతం: అమాల్ మల్లిక్‌
నిర్మాణం: ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌
విడుదల తేదీ: 30-09-2016
ధోనీ.. ఈ పేరు వింటే క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద గుర్తొస్తుంది. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా ఆయన తిరగ రాసిన రికార్డులు కళ్లముందు కదలాడతాయి. టీమిండియా కూల్‌ కెప్టెన్‌గా ధోనీకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. భారత క్రికెట్‌ గర్వించే ఆటగాడిగా ధోనీ సాధించిన ఘనత అందరికీ తెలుసు. కానీ.. ఇంత గొప్ప స్థాయికి చేరడానికి ధోనీ చేసిన ప్రయాణమెలాంటిదో.. అందులోని మలుపులేంటో అంతగా తెలియదు.
ఆ విషయాలన్నీ ‘ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలో చూడొచ్చని స్వయంగా ధోనీనే చెప్పారు. భారీ బడ్జెట్‌.. తెరపై రియల్‌ ధోనీలా హావభావాలు పండించేందుకు సుశాంత్‌సింగ్‌ చేసిన కసరత్తులు.. ప్రచార కార్యక్రమాల్లోనూ ధోనీ పాల్గొనడం ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి.. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?:- ధోనీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అందరిలాంటి పిల్లాడు. ఫుట్‌బాల్‌.. బ్యాడ్మింటన్‌.. టెన్నిస్‌ ఆటలంటే ఆసక్తి. కానీ.. అతని గురువు (రాజేశ్‌శర్మ) ధోనిలో మంచి క్రికెటర్‌ దాగి ఉన్నాడని గుర్తించి ప్రోత్సహిస్తాడు. ధోని తండ్రి(అనుపమ్‌ ఖేర్‌)కి మాత్రం కుమారుడు క్రీడల్లో కంటే బాగా చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అతని తల్లి.. సోదరి(భూమికా చావ్లా).. స్నేహితులు మాత్రం ధోనీని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు. అయితే అతను విఫలమవుతూ.. తిరిగి ప్రయత్నాలు మొదలెడుతూ ఉంటాడు. మరి.. భారత్‌ తరఫున ఆడాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి అవరోధాలను అధిగమించాడు? అందుకోసం ఏం చేశాడు? రైల్వేలో ఉద్యోగం.. భారత క్రికెట్‌ టీంలో అవకాశం ఎలా వచ్చింది? ప్రేమ.. పెళ్లి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?:- ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లాడు.. దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనుకోవడం.. లక్ష్యాన్ని చేరుకునేందుకు పడిన కష్టాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినా ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ప్రథమార్ధంలో ధోనీ బాల్యానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. స్కూలు.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటం.. రైల్వే ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకు రాజీనామా చేయడం ఉంటుంది. ఇందులో కొత్తదనం లోపించినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ప్రియాంక (దిశా పటానీ)తో ప్రేమాయణం.. సాక్షితో పెళ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ విజయాలు ఉంటాయి. చిత్రంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సంబంధించిన ఫుటేజీలనే ఎక్కువగా చూపించారు.
చిత్రంలో ప్రధానంగా లోపించే అంశం.. కథ మొత్తం ధోనీ చుట్టూ తిప్పే ప్రయత్నంలో దర్శకుడు భారత క్రికెట్‌ దిగ్గజాలను పూర్తిగా పక్కన పెట్టేయటం పెద్ద కొరతగా చెప్పాలి. తెలియని విషయాల్ని చెబుతామని సినిమా ..
ఉపశీర్షికలో చెప్పినా :- అలాంటివేమీ సినిమాలో కనిపించకపోవటంతో సగటు ప్రేక్షకుడు అసంతృప్తికి గురి అవుతాడు. ప్రియాంకతో ప్రేమాయణం తప్ప.. దాదాపు అందరికీ తెలిసిన ధోనీ విషయాలనే తెరపై చూపించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల జోలికే వెళ్లలేదు. బెట్టింగుల లాంటి వివాదాస్పద అంశాలను ఎక్కడా టచ్‌ చేయలేదు.
బయోపిక్‌ అంటే:- దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటేనే ఆ చిత్రం బాగా రూపుదిద్దుకుంటుంది. కానీ.. ఇందులో అది లోపించిన వైనం ఇట్టే అర్థమవుతుంది. దర్శకుడు నీరజ్‌ పాండే పూర్తిగా ధోనీ చెప్పినట్లుగానే నడుచుకున్నట్లు చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా?:- ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ జీవించాడు. రియల్‌ ధోనీలా హావభావాలు పలికించేందుకు అతను చేసిన కసరత్తు ఆకట్టుకోవటం ఖాయం. ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక(దిశా పటానీ), రెండో ప్రేయసి.. భార్య సాక్షి(కైరా అడ్వాణీ)లను క్యూట్‌గా చూపించారు. ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. ధోనీకి తండ్రి పాత్రలో ‘అనుపమ్‌ఖేర్‌’ కనిపించరు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
బలాలు :-
+ నటీనటులు

బలహీనతలు:-
- కొత్త విషయాలేమీ లేకపోవటం
- నిడివి

చివరగా.. తెర మీదా తెలిసిన ‘ధోనీ’నే కనిపిస్తాడు.
 ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘బాహుబలి-2’ లోగో ఇదే!


          తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన చిత్రం ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి అందించిన విజువల్‌ ట్రీట్‌కు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఫిదా అయిపోయారు. బాహుబలి కొనసాగింపుగా ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘బాహుబలి-2’ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. బాహుబలి రెండో భాగం దాదాపు పూర్తయిందని తెలిపారు. కొన్ని సన్నివేశాలు, రెండు పాటలు డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. జనవరిలో బాహుబలి-2 ట్రైలర్‌ను విడుదల చేస్తామన్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 28, 2017 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాత స్పష్టం చేశారు.

హైపర్‌ : రివ్యూ

తారాగణం: రామ్‌.. రాశిఖన్నా.. సత్యరాజ్‌.. సీత.. రావు రమేష్‌.. మురళీ శర్మ.. సాయాజీ షిండే.. ప్రభాస్‌ శ్రీను.. బ్రహ్మాజీ తదితరులు
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
సంగీతం: జిబ్రాన్‌.. మణిశర్మ
నిర్మాతలు: రామ్‌ ఆచంట.. గోపి ఆచంట.. అనిల్‌ సుంకర
దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
విడుదల: 30-09-2016

మొదట్నుంచీ తెరపై హైపర్‌గానే కనిపించాడు రామ్‌. దర్శకులు కూడా ఆయనతో సినిమా అనగానే హుషారైన పాత్రల్నే డిజైన్‌ చేస్తుంటారు. అయితే ‘నేను శైలజ’తో కాస్త రూటు మార్చారు. అందులో ఓ కొత్త రామ్‌ కనిపించాడు. మళ్లీ మునుపటి రామ్‌ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సంతోష్‌ శ్రీనివాస్‌ ‘హైపర్‌’ తెరకెక్కించాడు. మరి ఆ ప్రయత్నం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: నిజాయతీ గల ఓ ప్రభుత్వాధికారి నారాయణమూర్తి (సత్యరాజ్‌). ఆయన కొడుకే సూర్య (రామ్‌). తండ్రి అంటే సూర్యకి ప్రేమే కాదు తండ్రి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.
దీంతో నారాయణమూర్తిపై కక్ష పెంచుకొన్న మంత్రి రాజప్ప సామదాన భేద దండోపాయాల్ని ప్రదర్శిస్తాడు. మంత్రి బెదిరింపులకు నారాయణ మూర్తి తన నిజాయతీని వదలుకున్నాడా? తన తండ్రిని మంత్రి టార్గెట్‌ చేశాడని తెలిశాక సూర్య ఏం చేశాడు? మంత్రికీ, సూర్యకీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది? సూర్యపై మనసుపడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు చిత్రసీమ కొత్తదనం వైపు పరుగులు పెడుతున్న సమయమిది. ప్రేక్షకుడు చూడని ఓ కొత్త విషయాన్ని చూపించాలనే ప్రయత్నం తరచూ జరుగుతోంది. కొత్త రకమైన సినిమాలు రావటం వెనక ప్రధాన కారణం అదే. అలాగని మనకు అలవాటైన కమర్షియల్‌ ఫార్ములా కథలు ఇంకా దూరం కావడం లేదు. ఆ తరహా చిత్రాలకి బీ.. సీ కేంద్రాల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ కథల్ని నమ్ముతూ తెరకెక్కిస్తున్నారు. ‘హైపర్‌’ కూడా ఆ కోవకి చెందినదే. ఇందులోని కథ.. కథనం కొత్తదనం లేకున్నా కమర్షియల్‌ అంశాలకు కొరత లేకుండా చూశారు. పాటలు.. ఫైట్లు.. రొమాన్స్‌.. వాటి మధ్య ఓ రివెంజ్‌ డ్రామా.. ఇలా మాస్‌ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే అన్ని అంశాల్ని పక్కాగా ఉండేలా చూశారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. తొలి సగం సరదా సన్నివేశాలతో తీర్చిదిద్దారు. రామ్‌.. రాశిఖన్నాల మధ్య వినోదం- రొమాన్స్‌.. కుటుంబ నేపథ్యంతోనే సాగిపోతుంది.
విరామానికి ముందే ఓ మలుపు వస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడు వూహించినట్టే సాగుతాయి. తన తండ్రిని కాపాడినందుకు రౌడీషీటర్‌ గజ (మురళీశర్మ)తో సూర్య ఫ్రెండ్‌షిప్‌ చేయడం.. మంత్రి రాజప్ప ఫోన్లో చెప్పినట్టుగా చేస్తూ సూర్య కార్లు మారుస్తూ వెళ్లిపోయే సీన్లలో పాత వాసన కనిపిస్తుంది. రామ్‌లోని హైపర్‌ యాక్టివ్‌నెస్‌ని అభిమానులకి చూపించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే?: చిత్రంలో రామ్‌.. రాశిఖన్నా.. రావు రమేష్‌ల పాత్రలే కీలకం. ముగ్గురూ బాగా నటించారు. ముఖ్యంగా రామ్‌ ఎప్పట్లాగే హుషారైన కుర్రాడిగా సందడి చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లు చక్కటి ఈజ్‌తో చేసేశాడు. రాశిఖన్నా అందంగా కనిపించింది. రావు రమేష్‌ మంత్రి రాజప్ప పాత్రలో ఒదిగిపోయారు. సత్యరాజ్‌ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. జిబ్రాన్‌ పాటలు.. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అబ్బూరి రవి కలం అక్కడక్కడా మెరిసింది. రిమోట్‌తో ముడిపెడుతూ అమ్మాయిల జీవితం గురించి రాసిన మాటలు బాగున్నాయి.
బలాలు
+ రామ్‌.. రావు రమేష్‌ల నటన
+ సాంకేతికత
+ కమర్షియల్‌ అంశాలు

బలహీనతలు
- కొత్తదనం లేని కథ
- సాగే ద్వితీయార్థం

చివరగా.. ఇది తెలిసిన ‘హైపర్‌’

Thursday, 29 September 2016

ఇదీ భార‌త‌దేశం అంటే... మాతో పెట్టుకోవ‌ద్దు!

నియంత్రణ రేఖ వద్ద పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసిన సంగతి తెలిసిందే. సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు అవసరం’
- వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి
‘దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. లక్షిత దాడుల ద్వారా ఉగ్రవాదంపై యావత్‌ దేశ నిర్ణయాన్ని తెలియజేసినట్లైంది’
- సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు
‘ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులు చేసిన భారత సైన్యానికి అభినందనలు. ఈ దాడులతో కొత్త భారతావని ఉదయించింది. క్రూర ఉగ్రవాద చర్యలను దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చెప్పడానికి ఇదే సరైన సంకేతం’
-అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
‘‘మన వీర జవాన్లపై, ప్రధాన, రక్షణ మంత్రిపై నాకు చాలా గర్వంగా ఉంది. జైహింద్‌’’ 
- లతా మంగేష్కర్‌
‘ఉగ్ర స్థావరాలపై కేంద్రాలపై దాడులు జరపాలన్న కేంద్ర ప్రభుత్వం, సైన్యం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం’
 - కేటీఆర్‌, తెలంగాణ మంత్రి
‘ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు నిర్ణయం తీసుకున్న భారత సైన్యానికి అభినందనలు’ 
- పియూష్‌గోయల్‌, కేంద్రమంత్రి
‘ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేయటంపై యావత్‌ దేశం గర్విస్తోంది. లక్షిత దాడుల ద్వారా పాక్‌కు పరోక్షంగా బుద్ధి చెప్పినట్లైంది’  
- ప్రకాశ్‌ జవడేకర్‌, కేంద్ర మంత్రి

‘ప్రధాని మోదీ, భారత సైన్యం వేసిన ఈ ముందడుగును స్వాగతిస్తున్నాం
 - కల్‌రాజ్‌ మిశ్రా, కేంద్రమంత్రి
‘భారత సైన్యానికి అభినందనలు.. ఉగ్రవాదం ముసుగులో హాని తలపెట్టే వారికి భారత్‌ గట్టిగా బుద్ధి చెబుతుంది’ 
- సురేశ్‌ప్రభు, కేంద్ర రైల్వేమంత్రి
‘ఉగ్రవాదం విషయంలో ఇప్పటికైనా పాక్‌ తన వైఖరి మార్చుకోవాలి’ 
-రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, కేంద్రమంత్రి
‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనం’ 
- రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్రమంత్రి
‘ఈ నిర్ణయంపై దేశం యావత్తూ భారత సైన్యానికి అండగా నిలుస్తుంది.. భారత్‌ మాతాకీ జై’ 
- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి
‘‘సిగ్గు పడాల్సింది లేదు. గర్వపడాల్సింది లేదు. కానీ మనమేంటో నిరూపించుకోవాల్సి ఉంది. ఇదీ భారతదేశం అంటే. భారత్‌తో పెట్టుకోవద్దు’’
- చేతన్‌ భగత్‌
‘భారత సైన్యానికి సెల్యూట్‌.. మన సైనికులు బాగా ఆడారు’

- వీరేంద్ర సెహ్వాగ్‌, భారత జట్టు మాజీ క్రికెటర్‌ 
‘‘పాక్‌ను ఎదురుదెబ్బ తీసినందుకు భారత జవాన్లకు అభినందనలు. ఈ దాడిపై జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’- సోనాక్షి సిన్హా
‘‘జై హింద్‌ భారత్‌’’- దర్శకుడు క్రిష్‌
‘‘గర్వంగా ఉంది. ఇదేదో ముందే చేసుంటే బాగుండు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి ఇదే సరైన సమయం. ఇప్పటివరకు ఎన్నో భరించాం. ఇప్పుడు భారత్‌ అంటే ఎంటో చూపించాల్సిన సమయం వచ్చింది’’-జాన్‌అబ్రహం
‘‘ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పి దేశాన్ని కాపాడిన సైనికులకు సెల్యూట్‌’’- సన్నీ దేఓల్‌

యర్రకాలువలో దొరికిన నల్లత్రాచు...

జంగారెడ్డిగూడెం:- పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అయ్యవారి పోలవరం గ్రామ సమీపంలోని యర్రకాల్వ జలాశయంలో అరుదైన నల్లత్రాచు దొరికింది. యర్రకాలువలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో నల్లత్రాచు పాము పడింది. దీంతో కంగారుపడిన మత్స్యకారులు దానిని చంపకుండా గ్రామానికి తీసుకొచ్చారు. దాదాపు 9అడుగుల పొడవున్న పామును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దానిని యువకులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. అంతరించిపోతున్న పాములను రక్షించాలన్న ఉద్దేశంతో దానిని చంపకుండా జాగ్రత్తగా అడవిలో విడిచిపెట్టారు. వలలో బందీగా ఉన్నప్పుడు నల్లత్రాచు కొట్టిన బుసలను అందరూ ఆసక్తిగా తిలకించారు.

తొలిసారి పాక్‌పై భారత్ దాడి... ఆర్మీ అధికారిక ప్రకటన


న్యూఢిల్లీ: తొలిసారి పాక్‌పై భారత్ దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ విషయాన్ని ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రణ్‌బీర్ భారత విదేశాంగ రక్షణశాఖ సంయుక్త మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఉరీలో ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్ పట్ల భారత్ తన వైఖరి పూర్తిగా మార్చుకుంది.
 
పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై గత రాత్రి దాడి చేశామని, దాడిలో పలువురు ఉగ్రవాదులు చనిపోయారని ఆయన చెప్పారు. ఆ దాడుల్లో పాక్‌ సైనికులు కూడా చనిపోయారని, ప్రస్తుతానికి దాడులు ఆపేశామని, ఇప్పట్లో దాడులు చేసే ఉద్దేశం లేదని రణ్‌బీర్ ప్రకటించారు. దాడి తర్వాత పాకిస్తాన్‌కు సమాచారం అందించామని, కాకపోతే అటు వైపు ఏం జరుగుతోందో తమకు సమాచారం లేదని జనరల్ తెలిపారు.
 
‘‘పాక్‌ వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నాం. పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్రపన్నారు. యూరీ ఉగ్రవాదుల వేలిముద్రలు, సమాచారాన్ని పాక్‌కు పంపాం. మా అభ్యంతరాలను పాక్‌ జనరల్‌కు వివరించాం’’ అని రక్షణ శాఖ పేర్కొంది.

Wednesday, 28 September 2016

మీతో కోటి గెలిపించడానికి వస్తున్నదెవరు?

బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నాగార్జున బదులు చిరంజీవి వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంతోపాటు తన కుమారుల సినిమా పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. దీంతో నాలుగో సీజన్‌ను నిర్వాహకులు చిరంజీవితో చేయిస్తున్నారు. అయితే తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను విడుదల చేశారు. ‘మీ హృదయాన్ని కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించడానికి వస్తున్నాడు’ అంటూ ఈ వీడియోలో చిరంజీవిని ఆసక్తిగా చూపించారు.
మెగాస్టార్‌ ప్రస్తుతం వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ‘ఖైదీ నంబరు 150’ చిత్రంలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ చిత్రంలో కథానాయికగా పాత్రను పోషిస్తున్నారు.

ఐదేళ్లు సినిమాలే...!

సీనియర్ కథానాయికల పెళ్లి వార్తలు ప్రస్తుతం దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారాయి. సమంతా వచ్చే ఏడాది పెళ్లికి సిద్ధపడుతుండటంతో ఆమె సహనాయికల వివాహాల గురించి ఆరా తీయడం ఎక్కువైపోయింది. అనుష్క సైతం మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతోందనే వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇదిలా వుండగా మిల్కీబ్యూటీ తమన్నా తన పెళ్లి గురించి కుండబద్దలు కొట్టింది. మరో ఐదేళ్ల వరకు వివాహ ప్రస్తావన తన దగ్గర తీసుకురావొద్దని కోరింది. తన సహచర కథానాయికల పెళ్లి వార్తలు తన నిర్ణయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని పేర్కొంది. ప్రస్తుతం కెరీర్ సాఫీగా సాగిపోతోంది. ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. అందుకే పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదు అని తమన్నా చెప్పింది. పెళ్లి సరే మరి ఎవరి ప్రేమలోనైనా వున్నారా? అని ప్రశ్నించగా ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు. నేను ఒంటరిగానే వున్నాను. సినిమాల గురించి తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదు అని సమాధానమిచ్చింది. తమన్నా నటిస్తోన్న తాజా చిత్రం అభినేత్రి అక్టోబర్ 7న విడుదలకానుంది.

భార్య ఉన్న గదికి గడియపెట్టి.. పక్క రూమ్‌లో ఉన్న...

                  హైదరాబాద్/మదీన:- కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలాపత్తర్‌ తాడ్‌బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పదమూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. వీరికి ప్రస్తుతం 12 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులు ఇచ్చిన భార్య వద్దకు అతడు అప్పుడప్పుడు వెళుతుండేవాడు. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లి ఆమె ఉన్న గదికి బయట గడియపెట్టాడు. మరో గదిలో ఉన్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. విషయాన్ని బాలిక తల్లికి సోమవారం చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

రెండు బైక్‌ల ఢీ-ఇద్దరి మృతి

             మహబూబ్‌నగర్‌:- జిల్లాలో  రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిడుగుర్తికి చెందిన అంజప్ప, తిమ్మప్పలు కృష్ణ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాగనూర్‌ నుంచి చేగుంటకు వెళ్తున్న చంద్రశేఖర్‌, పవన్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టారు. అంజప్ప అక్కడికక్కడే మృతి చెందగా, తిమ్మప్పను మక్తల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూశాడు. చంద్రశేఖర్‌, పవన్‌లకు గాయాలు కాగా వీరిని రాయిచూర్‌లోని ప్రవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఏ పండు తింటే ఏం లాభాలున్నాయి ?


విష జ్వరాలు... విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వీటికి తోడు మధుమేహం, రక్తపోటు, జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులు... దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరినైనా పలకరించేవే. ఆధునిక ఆహారపు అలవాట్ల మోజులో పడి, పండ్లను నిర్లక్ష్యం చేయడం వల్లే రోగనిరోధక శక్తి తగ్గి, వ్యాధులు చుట్టుముడుతున్నాయని పౌష్టికాహార నిపుణులంటున్నారు. కాలానుగుణంగా పండే ఫలాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. రోజూ మనం చేసే దుబారా వ్యయంతో పోలిస్తే పండ్లకు పెట్టే ఖర్చు పెద్దదేం కాదు.
 
రక్తశుద్ధికి జామ :-
జీర్ణ క్రియ, రక్తశుద్ధికి జామ బాగా ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరానికి పోషకాలు అందుతాయి. అతి చౌకగా లభించే అమృత ఫలమిది.
 
ఫలాలు.. పోషకాహార ఖనులు :-
ఏ జాతి పురోగమనానికైనా ఆరోగ్యవంతమైన మానవ వనరులదే కీలకపాత్ర. ప్రకృతి ప్రసాదించిన ఫలాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందనేది నిపుణుల మాట. నోరూరించే పండ్లను చూస్తే ఎవరికి మాత్రం తినాలనిపించదు చెప్పండి. తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లను నిత్యం ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకుంటే చాలా రోగాలను దూరంగాఉంచొచ్చు. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్‌లు, లవణాలు, మూలకాలు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ పండ్ల ద్వారానే శరీరానికి అందుతాయి. నిత్యం ఏదో ఒక పండే తినే వారు సీజనల్‌ వ్యాధులకు దూరంగా ఉంటారనేది వాస్తవం.
 
రక్త హీనత నివారించే పుచ్చ :-
పుచ్చకాయలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు, ఖనిజాలు, లవణాలు, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ లభిస్తాయి. వేసవిలో దాహం తీరుఉంది. రక్తశుద్ధి చేస్తుంది. నిద్రలేమితో బాధ పడేవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చకాయ రసంతో జ్వర పీడితులు త్వరగా కోలుకోవచ్చు. మూత్ర సంబంధ వ్యాధులకు, డీహైడ్రేషన్‌ సమస్యలకు పుచ్చకాయ రసమే పరిష్కారం.
 
నులి పురుగుల నివారణకు సీతాఫలం :-
సీతాఫలాలు నులిపురుగులను బయటకు నెట్టివేస్తాయి. జ్వరం తగ్గించే గుణం ఉంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త విరేచనాల నుంచి విముక్తికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సీ, ఖనిజ, లవణాలు లభిస్తాయి.
 
టైఫాయిడ్‌, డిఫ్తీరియా నివారించే నిమ్మ :-
రోగ నిరోధక శక్తి ఇవ్వడంలో దీనికి ఇదే సాటి. టైఫాయిడ్‌, డిఫ్తీరియాలను కలిగించే క్రిములను నిమ్మ రసం చంపివేస్తుంది. విటమిన్‌ సీతో పాటు ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌లు నిమ్మలో ఉంటాయి.

గుండెకు మేలు చేసే కర్జూరం :- గుండెకు మేలు చేస్తుంది. క్షయ, కడుపుబ్బరం, వాంతులు, జ్వరం, విరేచనాలు దాహం, దగ్గు, ఉబ్బసం, మూర్ఛలను నివారిస్తుంది.
 
రక్త సంజీవని కమలా :- రోగ నిరోదక శక్తి పెంచుతుంది. తరచూ జ్వరం, జలుబు, దగ్గులతో బాధపడేవారికి కమలా దివ్యౌషధం. కమలా రసం తాగితే వెంటనే శక్తి వచ్చినట్లు ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్‌, బికాంప్లెక్స్‌ ఇస్తుంది.
 
జీర్ణకారిణి బొప్పాయి :-
మాంసకృత్తుల్ని జీర్ణం చేయడంలో బొప్పాయి ప్రధానపాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో ఉండే ప్రత్యేక ఎంజైమ్‌ మన శరీరంలో ఉండే పెప్సిన్‌ను పోలి ఉంటుందని పరిశోధనల్లో రుజువైంది. దీనిలోని ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు శరీర అవసరాలకు సరిపోతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది.
 
రక్తకణాలు పెంచే ద్రాక్ష:-
ఏడాది పొడవునా మార్కెట్‌లో లభించే ద్రాక్ష అజీర్ణం, మలబద్ధకం, ఆస్తమాల నుంచి దూరంగా ఉండటానికి దోహదం చేస్తుంది. రక్తకణాల వృద్ధికి ఉపకరిస్తుంది. మూత్రపిండ సమస్యల నివారిస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరిచే లక్షణం ద్రాక్షకు ఉంది. గుండెకు బలాన్నిస్తుంది.
 
విష జ్వరాల నివారణకు దానిమ్మ:-
విష జ్వరాలను నివారించడంలో దానిమ్మ కీలకపాత్ర పోషిస్తుంది. ఎంతటి జ్వరం ఉన్నా దానిమ్మ రసం తాగితే ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. హైపర్‌ ఎసిడిటీ, అల్సర్లను నివారిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. జీర్ణవ్యవస్థలో వచ్చే సమస్యలు దానిమ్మ వాడకంతో తగ్గిపోతాయి.
 
అరటితో యవ్వనం :-
పేదల అల్పాహారంగా పిలవబడే అరటి పండు సంవత్సరం పొడవునా దొరికుతుంది. దీనిలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన పోషకాహారంగా తీసుకోవచ్చు. పాలతో కలిపి అరిటిపండును తింటే రోజంతా దండిగా ఉంటుంది. అల్సర్ల నివారణ, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, అజీర్ణ వ్యాఽధులు దూరం చేయడంలో దీనికిదే సాటి. నిత్య యవ్వనం సొంతం కావాలంటే అరటిపండును మించిన ఔషధం మరొకటి లేదని వైద్య గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
 
రోజూ ఓ ఆపిల్‌ తింటే:-
రోజూ ఓ ఆపిల్‌ తింటే వైద్యుల వద్దకు వెళ్లే అవసరం ఉండదు అనే నానుడి తెల్సిందే. దీనిలో వ్యాధినిరోధక శక్తి పెంచే గుణం ఉంది. భోజనానికి ముందు తింటే ఆకలి పెరిగి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గుండె సమస్యలు, రక్తపోటు ఉన్న వారికి దీనిలోని పొటాషియం మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్‌, ఫాస్ఫరస్‌లు మెదడు, శరీరం చురుకుగా పనిచేసేలా చేస్తాయి. నోటి దుర్వాసన అరికట్టడంలో యాపిల్‌లో ఉండే ఆమ్లాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 
పండ్లతో సంపూర్ణ పోషకాలు:- చిన్నపిల్లల వైద్య నిపుణుడు
పండ్లు సంపూర్ణ పోషకాహారాన్ని ఇస్తాయి. ప్రస్తుతం జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. పండ్లు తింటే తీవ్రత తగ్గించవచ్చు. పిల్లల ఎదుగుదలకు ఆపిల్‌, అరటి, జామకాయలు దోహదం చేస్తాయి. దానిమ్మ గింజలు రోజూ తినిపిస్తే జ్వరాలు రాకుండా చూడవచ్చు.
 
చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవు :- చర్మ వ్యాధుల నిపుణురాలు
చర్మ సంబంధ వ్యాధుల నుంచి కాపాడంటంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటంతో చర్మానికి నిగారింపునిస్తుంది. శరీర కణజాలాలకు ఫాస్ఫరస్‌ అందేలా చూస్తాయి.
 
మేనికి మెరుపు:-
పండ్లతో రక్త శుద్ధి అవుతుంది. దీని వలన చర్మం మెరుపు వస్తుంది. మహిళల్లో రుతుస్రావ సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. ఆరోగ్యం, అందం, శరీర ధృడత్వానికి పండ్లు తోడ్పడతాయి.
 
రోజుకు 300 గ్రాములు పండ్లు తీసుకోవాలి :- డైటీషియన్‌
సీజనల్‌ పండ్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లు యాంటీబయాటిక్స్‌గా పనిచేస్తాయి. ఒబేసిటీ నివారణకు పండ్లు తినమనే సలహా ఇస్తాం. రోజుకు 300 గ్రాములు పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

Sunday, 25 September 2016

వాళ్ల సిగ్నల్స్‌కు స్పందించొద్దు...

  స్టీఫెన్‌ హాకింగ్స్‌
అనంత విశ్వంలో మనం ఒంటరిగా వున్నామా? ఇతర గ్రహాల్లో లేదా సుదూర దూరంలోని ఇతర పాలపుంతల్లో జీవ సంచారం వుందా లేదా అన్న ప్రశ్నలు మానవుడిని వేల సంవత్సరాలుగా వేధిస్తున్నాయి. అయితే విశ్వంలో కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో గ్రహాంతరజీవులు వుండే అవకాశముందని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్స్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే వారు మన వునికిని గుర్తిస్తే భూగ్రహానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఏదో ఒక రోజు సిగ్నల్స్‌ రావచ్చు
‘స్టీఫెన్‌ హాకింగ్స్‌ ఫేవరెట్‌ ప్లేసస్‌’ అనే డాక్యుమెంటరీ ద్వారా ఆయన ఈ విశేషాలను వెల్లడించారు. మనకు 16 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక గ్రహం నుంచి ఎప్పటికయినా సిగ్నల్స్‌ రావచ్చని అయితే మనం తిరిగి స్పందించకూడదన్నారు. వారితో కలయిక మనకు నష్టాన్ని కలిగించవచ్చన్నారు. క్రిస్టఫర్‌ కొలంబస్‌ రాకకు పూర్వం అమెరికా అపూర్వమైన నాగరికత కలిగివున్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రహాంతర జీవులు అన్ని రకాలుగా మనకన్నా అభివృద్ధి చెందివుంటారని వారితో సాన్నిహిత్యం భూగ్రహంలో వారి వలసపాలనకు దారి తీస్తుందన్నారు. కొన్నేళ్ల క్రితం ‘బ్రేక్‌త్రూ లిజన్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించిన హాకింగ్స్‌ కనీసం ఒక మిలియన్‌ నక్షత్రాలను శోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నా పెళ్లి చేసినోళ్లకు కృతజ్ఞతలు!

ఉయ్యాల జంపాలతో వెండితెరకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ను లాస్య రహస్య వివాహం చేసుకుందని వస్తున్న పుకార్లు తెలిసిందే. అయితే.. దీనిపై ఆ యువకథానాయకుడు స్పందించాడు. ‘నా పెళ్లి చేసిన మిత్రులందరికీ కృతజజ్ఞతలు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అతడు ట్విట్టర్ వేదిక లాస్యతో పెళ్లి పుకారు గురించి పెదవి విప్పాడు. తాను లాస్యను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు. కుమారి 21ఎఫ్ సినిమా ఆడియో వేడుకలో మాత్రమే ఆమెను కలిశానని వెల్లడించాడు. ‘‘నా సంబంధం, నా ప్రమేయం లేకుండా కుమారి 21ఎఫ్ సినిమా ఆడియో వేడుకలో ఒకే ఒక్కసారి కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మిత్రులకు నా కృతజజ్ఞతలు’’ అని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చాడు రాజ్‌తరుణ్. ‘‘ఇలాంటి వింత, విచిత్రమైన హాస్యాస్పద పుకార్లకు ఎలా స్పందించాలో నాకు తెలియట్లేదు. మరో మూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకోను. ఇప్పటికైతే నాకు పెళ్లి ఆలోచనే లేదు. అంతకుమించి లేచిపోవాల్సిన అవసరమూ నాకు లేదు. నా పెళ్లి అయినప్పుడు అందరికీ నేనే చెబుతాను’’ అంటూ ట్వీట్ చేశాడు. మరి అతడి ట్వీట్‌తో ఈ పుకారుకు తెరపడినట్టే.

‘శాతకర్ణి’ టైటిల్ సాంగ్ ఇదేనా?

ఇటీవలి కాలంలో సినిమాలు విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో విడుదలైపోతున్నాయి. చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేయకపోయినా వాటికి సంబంధించిన ప్రచార చిత్రాలు, ప్రచార గీతాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా లీకై ఎంత హల్‌చల్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని సినిమాలదీ అదే పరిస్థితి. వీటి వల్ల సినిమాపై ఆసక్తి పెరిగినా.. సదరు సినిమా దర్శక నిర్మాతలు మాత్రం బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100వ చిత్రమది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై బాలయ్యబాబు కొంత అసహనం కూడా వ్యక్తం చేశాడన్న కథనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాతకర్ణికి సంబంధించిన మరో విషయం లీకైంది. ఈ సారి ఆ సినిమా ‘టైటిల్ సాంగ్’ అని చెబుతున్న ఆడియో విజువల్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ ఆడియో విజువల్‌లో బాలకృష్ణ గానీ, హీరోయిన్‌గానీ కనిపించకపోయినా.. ఆ సినిమా ప్రచార చిత్రాలతో ఈ టైటిల్ సాంగ్ సాగుతోంది. మరి ఆ పాట నిజంగా సినిమాలోనిదేనా లేకపోతే బయటవారెవరైనా చేశారా అనేది ప్రస్తుతానికి సందిగ్ధమే. అయితే కొందరు మాత్రం అది ఫ్యాన్‌మేడ్ సాంగ్ అని చెబుతున్నా ఆ పాట లిరిక్స్ వింటే మాత్రం అలా అనిపించట్లేదని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ పాట శాతకర్ణిదేనా? కాదా? అన్నది తేలాలంటే చిత్రం ఆడియో విడుదలవ్వాల్సిందే! అప్పటివరకు నందమూరి అభిమానులకు మాత్రం ఈ పాటతో పండుగే.

ముఖ్యమంత్రిగా రాజకుమారుడు?

దూకుడు సినిమాలో యంగ్ ఎమ్మల్యేగా కనిపించి అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించినా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడుగా మెరిసి భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత తనకు భారీ హిట్ ఇచ్చిన కొరటాలతో మూవీ చేయబోతున్నాడు ఈ టాలీవుడ్ ప్రిన్స్. దూకుడు సినిమాలో ఎమ్మెల్యే అయిన మహేశ్.. కొరటాల సినిమాలో ‘ముఖ్యమంత్రి’గా ప్రమోషన్ కొట్టేశాడని టాక్. గతంలో సీఎంగా కనిపించిన ‘ఒకేఒక్కడు’ అర్జున్. శంకర్ డైరెక్షన్‌లో ఒక్క రోజు ముఖ్యమంత్రి స్థాయి నుంచి పర్మనెంట్ సీఎం దాకా వెళ్లే పాత్రలో కనిపించాడు అర్జున్. ఆ తర్వాత లీడర్ రానా ముఖ్యమంత్రయ్యాడు. ఇప్పుడు కొరటాల సినిమాతో మహేశ్ కూడా సీఎంగా అసెంబ్లీ గడప తొక్కుతాడని సినీ జనాలు అంటున్నారు. ఇక, సామాజిక అంశాలను స్పృశిస్తూ కొరటాల సీఎం కేరెక్టర్‌ను సృష్టించాడట. మిర్చి నుంచి జనతాగ్యారేజ్ దాకా హిట్లు కొట్టిన అతడు.. అన్నింట్లోనూ సోషల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేసి టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మహేశ్‌తో చేసే సినిమాలోనూ సామాజిక అంశాలకు ఏ లోటు లేకుండా ముఖ్యమంత్రి పాత్రను తీర్చిదిద్దాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ నెట్‌లో హల్‌చల్ చేస్తుండడంతో మహేశ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎమ్మెల్యేగా కనిపించిన ప్రిన్స్.. ముఖ్యమంత్రిగా ఎదగడం చూడొచ్చన్నమాట!!

గిన్సిస్ రికార్డుల్లోకి జర్మనీ-స్విట్జర్లాండ్ విమానం!

ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరం ప్రయాణించే అంతర్జాతీయ విమానాన్ని నడిపి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ‘పీపుల్ వీనలైన్’ సిద్ధమైంది. స్విట్జర్లాండ్ లోని సెయింట్ గాలెన్ నుంచి జర్మనీలోని ఫ్రీడ్‌రిచ్‌షఫీన్‌కు ప్రయాణించనుంది. ఈ రెండు దేశాల్లోని నగరాల మధ్య దూరం 13 మైళ్లు మాత్రమే. మొత్తం ప్రయాణం 8 నిమిషాల్లో ముగియనుంది. ఈ ఏడాది నవంబరు 2 నుంచి ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 50 సీట్ల సామర్థ్యం కలిగిన విమానంతో రోజూ రెండు సర్వీసులు నిర్వహించనున్నారు. టికెట్ ధరలు కేవలం 45 డాలర్లు మాత్రమే. రెండు దేశాల్లోని ఈ రెండు నగరాలను కాన్‌స్టాన్స్ నది వేరు చేస్తోంది. ఆస్ట్రియన్ విమానయాన సంస్థ నిర్ణయించినట్టు నవంబరు నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే.. అతి తక్కువ దూరం ప్రయాణించే అంతర్జాతీయ విమానాలను నడిపే సంస్థగా ‘పీపుల్ వీనలైన్’ గిన్నిస్ రికార్డులకెక్కనుంది.

పండగల పూట.. ఈ-కామ్ ఆఫర్ల వరద...


పండగల సీజన్‌ దగ్గర పడుతోంది. దేశంలో పెద్ద పండగలైన దసరా, దీపావళి ఈసారి అక్టోబర్‌ నెలలోనే వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇ-కామర్స్‌ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పకడ్బందీ ఆఫర్లతో సిద్ధమయ్యాయి. సంవత్సర కాల స్తబ్దత తీరేలా ఇదే నెలలో పెద్ద ఎత్తున అమ్మకాలను పెంచుకోవాలన్నది ఇ-కామ్‌ దిగ్గజాల ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తమ ప్రత్యేక సేల్‌ గురించి కంపెనీలు ప్రచారం మొదలుపెట్టాయి...
 
ఇ-కామ్‌ రంగంలో ప్రధాన కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలు అక్టోబర్‌లో పెద్ద ఎత్తున ఆఫర్లను ఇవ్వనున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరుతో అమ్మకాల ను నిర్వహించనుంది.

ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ఆఫర్‌ చేయడంతోపాటు వేగవంతంగా డెలివరీ చేయనున్నట్టు సం స్థ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్స్‌, పీసీలు, మ్యూజికల్‌ ఇన్‌స్ర్టూమెంట్లు, స్టేషనరీ ఉత్పత్తులు, పుస్తకాలు, బేబీ కేర్‌ ఉత్పత్తులు, బొమ్మలు, దుస్తులు, యాక్సెసరీలు, షూస్‌, బ్యూటీ ఉత్పత్తులు వంటి వాటిపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఉత్పత్తులను తొందరగా డెలివరీ చేయడానికి ఉపయోగపడే 24 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఈ సంస్థకు ఉన్నాయి. డిసెంబర్‌ లోపే మరో 3 సెంటర్లను కూడా ప్రారంభించడానికి అమెజాన్‌ సన్నద్ధమవుతోంది. వీటి ద్వారా త్వరగా ఉత్పత్తులను డెలివరీ చేసే అవకాశం ఏర్పడుతుంది. పండగల సీజన్‌లో పోటీ కంపెనీల మార్కెట్‌ వాటాను కూడా హస్తగతం చేసుకోవాలనుకుంటోంది.
 
ఇక ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహించనుంది. కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, భారీ అప్లయెన్సె్‌సపై ఎలాంటి అదనపు భారం లేని ఈఎంఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ‘బిగ్‌ బిలియన్‌ డే’ సేల్‌ సందర్భంగా అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు తప్పనిసరి పరిస్థితిగా మారిపోయింది. కొత్త కస్టమర్లను ఆకర్షించి విక్రయాలను పెంచుకుంటే కంపెనీ మరిన్ని నిధులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడనుంది. మరో ఇ-కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ ‘అన్‌బాక్స్‌ దీవాళి సేల్‌’ పేరుతో అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమ్మకాలను నిర్వహించనుంది. హోమ్‌ అప్లయెన్సెస్‌, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్స్‌, హోమ్‌ ఫర్నీషింగ్‌, ఫర్నీచర్‌, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలను ఈ సంస్థ ఆఫర్‌ చేయనుంది. వివిధ ఉత్పత్తులపై గంటల వారీగా అమ్మకాలను సంస్థ నిర్వహించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేయనుంది.
 
అమ్మకాలపై ప్రభావం.. 

 పెద్ద ఎత్తున ఆఫర్లుంటాయని ఇ-కామర్స్‌ సంస్థలు చెబుతున్నప్పటికీ ఈసారి అమ్మకాలపై ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వరాదన్న పారిశ్రామిక విధానం, ప్రమోషన్‌ విభాగం (డిఐపిపి) మార్గదర్శకాల నేపథ్యంలో ఆఫర్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయినప్పటికీ పండగల సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయన్న ఆశతో డెలివరీ, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలు పెంచుకోవడానికి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు క్షీణించడంతో ఇ-కామ్‌ కంపెనీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీల విక్రయాలు 19 శాతం మేర తగ్గ గా.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు 5-10 శాతం క్షీణించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పండగల సీజన్‌పైనే కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ ఇదే!

బ్రసీలియా:  ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండ బ్రెజిల్‌లో బయటపడింది. బ్రెజిల్‌లోని ఉత్తరప్రాంతంలో అల్టామిరా వద్ద బెలో మాంటె డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా పేలుడు జరిపినప్పుడు ఈ అనకొండ బయటపడింది. 33 అడుగుల పొడవున్న ఈ పాము 400 కేజీల బరువుంది. పాము వెడల్పు మీటరు‌కు పైగా ఉంది. అతిపెద్దదైన ఈ పామును చూడగానే కార్మికులు తొలుత షాకయ్యారు. తర్వాత పాము పేలుడులో చనిపోయిందని తెలుసుకుని భారీ క్రేన్‌తో ఎత్తి పక్కకు పెట్టేశారు. అయితే పాము పేలుడులో చనిపోయిందా లేక చంపేశారా అనే విషయంపై సోషల్ మీడియాలో బిగ్‌ఫైట్ నడుస్తోంది. పాపం పామును చంపేస్తారా అంటూ కొందరు జంతు ప్రేమికులు విరుచుకుపడ్డారు. మరోవైపు గిన్నీస్ బుక్ రికార్డుల ప్రకారం అమెరికాలోని కన్సాస్ నగరంలో 25 అడుగుల రెండు అంగుళాలున్న అనకొండయే అతి పెద్ద పాముగా రికార్డులకెక్కింది.

వరంగల్‌లో దెయ్యం చేప...

వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలోగల రంగసముద్రం చెరువు మత్తడి వద్ద చేపల వేటకు వెళ్లిన శనివారం స్థానికులకు అరుదైన చేప లభ్యమైంది. ఆ చేపను చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ చేప శరీరమంతా మచ్చలు, ముళ్లు కలిగి వింత ఆకారంలో ఉంది. చేప ఏడువందల యాభై గ్రాముల బరువు ఉంది. ఈ చేపను మత్య్సకారులు దెయ్యం చేపగా పిలుస్తారని వారు చెబుతున్నారు. అధికారులు దానిని సక్కర్‌ ఫిష్‌ జాతికి చెందిన విషపు చేప అంటున్నారు. ఆ చేప నీటిలో ఉన్న చిన్నచేపలను తింటుందని వారు తెలిపారు. నక్కర్ జాతికి చెందిన చేపను తినకూడదని, తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

అక్టోబర్ నెలలో ఎన్నో విశిష్టతలున్నాయి.. అవేంటో తెలుసా?

వచ్చే అక్టోబరు నెల ఎన్నో విశిష్టతలను, విశేషాలను సంతరించుకుంది. 2, 9, 16, 23, 30 తేదీల్లో మొత్తం ఐదు ఆదివారాలు, 3, 10, 17, 24, 31 తేదీల్లో ఐదు సోమవారాలు, 1, 8, 15, 22, 29 తేదీల్లో ఐదు శనివారాలు వస్తున్నాయి. ఇలా ఒకే నెలలో ఐదు చొప్పున ఆది, సోమ, శనివారాలు రావడం చాలా అరుదు. మరో విశేషం ఏమిటంటే ఈ మాసంలోనే వరుసగా బతుకమ్మ, దసరా, దీపావళి, పీర్లపండుగలు వస్తున్నాయి. 11న దసరా, 12న పీర్లపండుగ , 30న దీపావళి పండుగ పర్వదినాలు ఉన్నాయి. సాధారణంగా ఈ పండుగలు ఒకే నెలలో రావు. మరో విశేషం ఏమిటంటే ఒక నెలలో ఒకే వారం (ఆదివారం) పౌర్ణమి(16న), అమావాస్య (30న) రానుండడం కూడా విశేషం. అలాగే ఐదు ఆదివారాలు, మూడు పండుగలు,ఓ రెండో శనివారం కలిపి తొమ్మిది రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇంకా విద్యార్థులకైతే సెప్టెంబరు 30నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.అక్టోబరు 15 వరకు ఈ సెలవులు ఇవ్వడంతో సగం నెల విద్యార్థులకు ఆటపాటలతో సందడిగా గడిచిపోనుంది.

Wednesday, 21 September 2016

ఆధార్ కార్డులో మార్పులు స్వయంగా మనమే సరిచేసుకోవడం చాలా సులభం

ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది… లేదా చిరునామా మారింది.  పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం…
ముందుగా


https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం.


ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్… వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.


కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.
ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.
రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే
ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.
చిరునామాలు


Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India.
Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India.
కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

Monday, 19 September 2016

బస్సులకు ప్రత్యేకం

నగరంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇక సుఖమయం..వేగవంతం కానుంది. సిటీలోని రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దారులను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు ప్రగతి రథ చక్రాలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం అహ్మదాబాద్ నగరంలో విజయవంతంగా నడుస్తోంది. అక్కడ ఆర్టీసీ కోసం ఏర్పాటు చేసిన బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (బీఆర్‌టీఎస్)ను గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి అందించడానికి సిద్ధమవుతున్నారు.ప్రయాణికులను నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేర్చాలంటే ఈ విధానం తప్పనిసరని చెబుతున్నారు.

నగర రహదారులు నిత్యం ట్రాఫిక్‌మయంగా మారుతున్నాయి. దీంతో అరగంటలో గమ్యాన్ని చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒక్కోసారి గంటలతరబడి బస్సులోనే గడపాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు నగర రహదారులపై బస్సులకు ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అహ్మదాబాద్ నగరంలో ఆర్టీసీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (బీఆర్‌టీఎస్)ను పోలిన విధంగా గ్రేటర్‌లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతుంది.

సంస్థను బలోపేతం చేసేందుకు..
నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులను సమయానికి గమ్యానికి చేర్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. తద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, సంస్థను బలోపేతం చేసుకోవాలనే ధ్యేయంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులను నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేర్చాలంటే ఈ విధానం తప్పనిసరని భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తుండడంతో గమ్యస్థానాలకు చేరాలంటే ఆర్టీసీ బస్సులకు నిత్యం గగనమవుతోంది. దీంతో బస్సుల్లో ప్రయాణించే వారు సరైన సమయంలో చేరలేక నానా అవస్థలు పడుతున్నారు. నిర్ణీత సమయానికి చేరకపోవడంతో ఉద్యోగులతోపాటు ఇతర పనులమీద బస్సులను ఆశ్రయిస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

వర్షం వస్తే అంతే..
వర్షం కురిస్తే సమస్యలు రెట్టింపవుతున్నాయి. నగరంలోని ఒకచోటు నుంచి మరోచోటుకు చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉంటున్నది. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఆలస్యమవుతోంది. దీంతో ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయించకుండా క్యాబ్‌లు, ఆటోలతోపాటు ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. వీటి నుంచి బయట పడేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తున్నది. వాస్తవానికి అహ్మదాబాద్ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలని అధికారులు ఎప్పుడో భావించినా.. ఎందుకో ఈ నిర్ణయం అటకెక్కింది. జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ప్రయోగాత్మకంగా చేపట్టాలని మొదట భావించినా ఎందుకో అమలు కాలేదు.

ఇతర వాహనాలకు నో ఛాన్స్..
రహదారులపై ఆర్టీసీ బస్సులకు కేటాయించిన మార్గంలో కేవలం ఆర్టీసీ బస్సుల రాకపోకలనే అనుమతిస్తారు. ఇతర వాహనాలు వేరే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం ఖాళీగా ఉన్నా.. ఇతర వాహనాలు చొరబడితే జరిమానా విధిస్తారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు సజావు గా సాగిపోతాయి. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ఆలోచన.. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అమల్లోకి రానుంది. ప్రతీరోజు నగరంలో 3,850 సర్వీసులు నడుస్తున్నా కేటాయించిన ట్రిప్పులు పూర్తి కావడం లేదు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. దీనివల్ల కేఎంపీఎల్ కూడా దెబ్బతింటోంది. ప్రత్యేక ట్రాక్(బీఆర్‌టీఎస్) విధానం అమల్లోకి వస్తే ప్రయాణికుల అభిమానాన్ని చూరగొని తద్వారా ఆదాయాన్ని సముపార్జించుకోవాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా వెల్లడించడంతో ఇక ఈ నిర్ణయం అతి త్వరలోనే రోడ్డెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దసరా తర్వాతే త్రైమాసిక పరీక్షలు...

-అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3
              దసరా పం డు గ తర్వాత త్రైమాసిక పరీక్షలు నిర్వహిం చేం దుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యా శాఖ వర్గాలు ఈ మేరకు షెడ్యూ ల్‌ను సైతం ఖరారు చేశారు. దసరాతర్వాతే పరీక్షలు నిర్వ హించడం పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే అరు దుగా చెప్పవచ్చు. వాస్తవికంగా సెప్టెంబర్ మా సంలో పరీక్షలు నిర్వహించి, దసరా సెలవులి వ్వడం అనవాయితీగా వస్తోంది. కాని ఈ సారి షెడ్యూల్‌లో మార్పులు చేసి సెలవుల తర్వాతే పరీక్షలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించేం దుకు విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గల విద్యా ర్థులకు షెడ్యూల్ ప్రకారం త్రైమాసిక పరీక్షలను నిర్వ హిస్తామని డీఈఓ ఎం. సోమిరెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు. 27-9-16 మొదటి పరీక్ష , 28-9-16 రెండో పరీక్ష ,29-9-16 మూడో పరీక్ష ,31-9-16 నాలుగో పరీక్ష,1-10- 16 ఐదో పరీక్ష ,2-10-16 ఆరవ పరీక్ష ,3-10-16 ఏడో పరీక్ష

ఐటెంసాంగ్స్‌కు నో!

తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకుంది కాజల్ అగర్వాల్. దక్షిణాదిలో స్టార్ హీరోలందరి సరసన నటించిందామె. కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఇటీవలే విడుదలైన జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ పాటతో ప్రత్యేక గీతాల భామగా అవతారమెత్తింది కాజల్ అగర్వాల్. ఈ పాటలో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్న ఆమెకు ఐటెంసాంగ్స్ అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. ప్రత్యేక గీతాల్లో నటించాల్సిందిగా పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. భారీ పారితోషికాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, అయితే ఈ ప్రత్యేక గీతాల్లో నటించడానికి కాజల్ అగర్వాల్ నిరాకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐటెంసాంగ్స్‌పై దృష్టిసారిస్తే హీరోయిన్‌గా కొనసాగడం కష్టమనే ఆలోచనతోనే ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150తో పాటు తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది కాజల్ అగర్వాల్.

డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి..నివారణకు చర్యలేంటి..?

డెంగీ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగీకి ప్రత్యేకమైన మందులు లేవని, లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని అల్లోపతి వైద్యులు పేర్కొంటున్నారు. ఏ వైద్య విధానంలోనైనా డెంగీకి పెద్ద చికిత్స లేదని, దీనికి కూడా సాధారణ జ్వరంలాగా నే వైద్యం చేయాలంటున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు సరైన సమయంలో చికిత్స అందించాలి...
 
డెంగీ లక్షణాలు...
  • జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 ఫారెన్‌హీట్‌.
  • తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు
  • కళ్లలో విపరీతమైన నొప్పి
  • శరీరంపై దద్దర్లు
  • వాంతులు కావడం, కడుపునొప్పి
  • నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం
  • కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
 
ఏం చేయాలి...?
  • చలితో విపరీతమైన జ్వరం వచ్చిన వెంటనే అనుభవం ఉన్న వైద్యులను కలవాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ యాస్ర్పిన్‌, బ్రూఫిన్‌ మాత్రలు వాడకూడదు.
  • జూప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టి పని ఆగిపోతుంది. అందుకే డెంగీ జ్వరం ఉన్నప్పుడు నొప్పుల నివారణ కోసం ఎన్‌ఎస్‌ఏఐడీ ఉన్న మాత్రలు వాడకూడదు.
  • పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రో‌లైట్స్‌ అధికంగా ఉన్న ద్రవాలను మాత్రమే తీసుకోవాలి.
  • ప్లేట్‌లెట్స్‌ జీవిత కాలం ఒక్కరోజే. అది శరీరంలో నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. డెంగీ జ్వరం ఉన్నప్పుడు శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. అలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు అవసరం అయితేనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి.
  • జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి. చల్లని ప్రదేశంలో రోగిని పడుకోబెట్టాలి. పారాసెట్మాల్‌ మాత్రను వెంటనే ఇప్పించాలి. శరీర ఉష్ణోగత్ర తగ్గేందుకు చేయాల్సిన అన్ని చర్యలు చేయాలి.
  • దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్‌, లిక్విడ్‌ లాంటివి వాడాలి. దోమకాటు లేకుండా దోమ తెరలు వాడాలి.
 
డెంగీ నివారణకు నెటిజన్ల సూచనలు
         డెంగీ నివారణకు నెటిజన్లు తమదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నా రు. ఫేస్‌బుక్‌, వాట్స్‌అ్‌పలో డెంగీ, దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన గృహ చిట్కాలను అందరికీ చేరవేస్తున్నారు. 
 
అందులో కొన్ని...
  • నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 10-15 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.
  • బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాపిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి.
  • క్యారెట్‌ జ్యూస్‌, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది.
  • కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది.