Monday, 19 September 2016

ఈ సినిమా విడుదలయ్యేది 2115లో...

కొన్ని సినిమాలు చిత్రీకరణ జరుగుతుండగా.. కొన్నింటికి చిత్రీకరణ పూర్తయ్యాక విడుదల తేదీని చిత్రబృందం ప్రకటిస్తుంది. హాలీవుడ్‌.. బాలీవుడ్‌ చిత్రాలైతే చిత్రం మొదలు కాకముందే.. ఏడాది రెండేళ్ల ముందుగానే విడుదల తేదీని ప్రకటిస్తుంటారు. కానీ ఓ భిన్నమైన హాలీవుడ్‌ చిత్రానికి మాత్రం రోజులు కాదు.. నెలలు కాదు.. 100 సంవత్సరాలు ముందుగానే విడుదల తేదీని ప్రకటించారు. ఆ సినిమా చూడాలంటే వందేళ్లు ఆగాల్సిందేనట.
హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే తెరకెక్కించిన ‘100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్‌ సీ’ చిత్రం 2115వ సంవత్సరం నవంబర్‌ 18న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే మద్యపాన తయారీ సంస్థ నిర్మాణ సారథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2115లోనే విడుదల చేస్తారట.

అలాగే ఈ మధ్య కాలంలో సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే సినిమాలు లీకై పైరసీగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందుకే ఈ కథ ఎంటో ఎవరికీ తెలియకుండా.. చూడకుండా సినిమా రీల్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. రీల్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌ లాకర్‌లో పెట్టి 18 నవంబర్‌ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్‌ చేశారు. ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానిస్తారట. గత ఏడాది నవంబర్‌లో సినిమాకు సంబంధించి ప్రకటన చేసి ట్రైలర్‌ కూడా విడుదల చేశారు.
మానవుడి సగటు ఆయుష్షే 80 ఏళ్లుగా ఉంది. కాబట్టి ఇప్పడున్న తరాలేవీ ఆ సినిమాని చూసే అవకాశం లేకపోవచ్చు. ఈ రోజు పుట్టిన బిడ్డ కూడా ఆ సినిమా చూడగలడో లేదో తెలియదు. అందుకే సినిమాకి ‘ద మూవీ యూ నెవర్‌ సీ’ అని ఉప శీర్షిక పెట్టి ఉంటారు.
విశేషమేమిటంటే.. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు. వీళ్లకే ఈ సినిమా చూసే అవకాశం లేదు. మరి ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తారో.. ఎవరు చూస్తారో తెలియాలంటే వందేళ్లు ఆగాల్సిందే.

No comments:

Post a Comment