Sunday, 11 September 2016

మారకపోతే సినిమాలు చూడరు!

తెలుగు తెరపై ప్రయోగాలకు పెట్టింది పేరు నాగార్జున. మూసధోరణి భిన్నంగా నవ్యమైన పంథాలో ప్రయాణించడమే ఆయన నమ్మిన సిద్ధాంతం.ప్రతి సినిమాలో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంటారాయన. ఈ ఏడాది సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలతో చక్కటి కమర్షియల్ విజయాల్ని సొంతం చేసుకున్న ఆయన త్వరలో నిర్మల కాన్వెంట్‌తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రను పోషించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా గురించి నాగార్జున చెప్పిన ముచ్చట్లివి...

నిర్మల కాన్వెంట్ నేపథ్యమేమిటి?

చదువు, తెలివితేటలకు ప్రేమ, పట్టుదల తోడైతే జీవితంలో ఏదైనా సాధించవొచ్చనే స్ఫూర్తివంతమైన కథాంశంతో తెరకెక్కించిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది.

సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?

హీరోతో సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపిస్తాను. ద్వితీయార్థం మొత్తం నా పాత్ర కనిపిస్తుంది. హీరోను రెచ్చగొట్టి అతడిని లక్ష్యం వైపు నడిపించే వ్యక్తిగా కనిపిస్తాను.

పాత్రల పరంగా మీ ప్రాధామ్యాలు మారినట్లు కనిపిస్తున్నాయి?

పాత్రపరంగా కొత్తదనానికే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రతి పాత్రలో ఆసక్తిని రేకెత్తించే అంశమేదో తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నాను. హీరోయిజం, ఇమేజ్ పట్టింపులను పక్కనపెట్టి మంచి పాత్రలను మాత్రమే చేస్తాను. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఊపిరి సినిమాను చేయడానికి ధైర్యం కావాలి. రెండు సక్సెస్‌ల తర్వాత ఓం నమో వెంకటేశాయ వంటి పౌరాణిక సినిమా చేయడం సాహసోపేతమైన నిర్ణయం. కొత్తదనాన్ని నమ్మే ఆ సినిమాల్ని ఎంచుకున్నాను.

మీ ధోరణిలో మార్పుకు ఎక్కడ అంకురార్పణ పడింది?

భాయ్, గ్రీకువీరుడు లాంటి సినిమాలు నా ఆలోచన ధోరణిలో మార్పుల్ని తీసుకొచ్చాయి. నేను మారకపోతే సినిమాలు చూడరనే విషయం అర్థమైంది. నటుడనేవాడు ఎప్పటికప్పుడూ మార్పును స్వీకరించాలి. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే పది, పదిహేనేళ్లకు తెరమరుగైపోకతప్పదు.

కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొపక్క ఉయ్యాల జంపాల, నిర్మల కాన్వెంట్ లాంటి చిన్న సినిమాల్లో భాగమవ్వడం ఎలాంటి అనుభూతిని కలిగిస్తోంది?

సినిమాల పరంగా నాకు చిన్నా, పెద్ద అనే తేడాలేవి లేవు. నా దృష్టిలో రెండూ ఒకటే. కథను బట్టే సినిమాలు చేయాలి. ఇటీవల విడుదలైన పెళ్లిచూపులు సినిమా చాలా బాగుంది. ఆ సినిమా చూస్తుంటే నా యవ్వనపు రోజుల గుర్తుకు వచ్చాయి. దర్శకుడు తరుణ్‌ను పిలిచి అదే విషయం చెప్పాను. కానీ కొంతమందికి మాత్రమే ఆ సినిమా చేరువైంది.

నిర్మల కాన్వెంట్‌లో రోషన్ తీసుకోవడానికి కారణమేంటి?

రోషన్ హీరో శ్రీకాంత్ తనయుడని మొదట మాకు తెలియదు. కథకు సరిపోయే అబ్బాయి కోసం వెతుకుతూ రోషన్ ఫొటోలు చూసి అతడిని తీసుకోవాలని అనుకున్నాం. శ్రీకాంత్‌ను కలిసి కథ వినిపించాం. కానీ తనకు ఈ కథను ఎందుకు చెబుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. విలన్ పాత్ర కోసం అడుగుతున్నారని మొదట భావించారు.ఆ తర్వాతే రోషన్ కోసం అని చెప్పగానే అంగీకరించారు.

ఈ సినిమా కోసం గాయకుడిగా అవతారమెత్తారెందుకని?

కొత్త కొత్త భాష పాటను ఈ సినిమాలో ఏ.ఆర్.రెహమాన్ అబ్బాయి అమీన్ పాడాడు. ఆ పాటను నేను పాడుతున్నప్పుడు విన్న సంగీత దర్శకుడు రోషన్ సాలూరి మీ గళం బాగుంది. ఈ పాటనుప్రమోషన్‌సాంగ్‌గా మీరే పాడాలి అని కోరడంతో అంగీకరించాను. నా తొలి సినిమా విక్రమ్ తర్వాత వాయిస్ పీలగా ఉందని, బాగాలేదని చాలా మంది విమర్శించారు. పత్రికల్లో, దర్శకనిర్మాతలు ప్రతిఒక్కరూ ఇదే మాట చెప్పడంతో అభద్రతా భావానికి లోనయ్యాను. అలాంటిది తొలిసారి ఓ సంగీత దర్శకుడు వచ్చి మీ వాయిస్ బాగుంటుందని చెప్పడంతో ఈ పాట పాడాను. పాటకంటే నా వాయిస్ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది.

రికార్డింగ్ రూమ్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?

పాట పాడుతున్నప్పడు పక్కవాళ్లు నవ్వుతున్నారేమోనని రికార్డిస్ట్‌తో పాటు అందరి ముఖాలను గమనించాను(నవ్వుతూ). కానీ అందరూ బాగుందని అన్నారు. భవిష్యత్‌లో గాయకుడిగా కొనసాగుతాను. నా సినిమాలతో పాటు నా కుమారుల సినిమాలో పాడటానికి సిద్ధమే.

మీరు పాడిన పాట విని అమల ఏమన్నారు?

చాలా సంతోష పడింది. మీ వాయిస్ ఇంత బాగుంటుందనుకోలేదు అని మెచ్చుకుంది.

అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయకు కథాంశాల పరంగా ఎలాంటి తేడాలున్నాయి?

అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై 32వేలకు పైగా కీర్తనలు రాశారు. కానీ హథీరామ్‌బాబా మాత్రం వెంకటేశ్వర స్వామి పిలుపు మేరకు అన్ని బంధాలను వదులుకొని స్వామికే తన జీవితాన్ని అంకితం చేశాడు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రతిరోజు వెంకటేశ్వరస్వామి.... హథీరామ్‌బాబాతో పాచికలు ఆడేవారు. ఇప్పటికీ ఆ ఘట్టానికి సంబంధించి వ్రాత ప్రతులు తిరుపతిలో ఉన్నాయి. ఆ అంశాలకు నాటకీయతను మేళవించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. ప్రభాతసేవ, శ్రీనివాసకళ్యాణంతో పాటు తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న అన్ని సేవల్ని పద్దతి ప్రకారం జరిగేలా ఆయనే రూపకల్పన చేశారు. హథీరామ్‌బాబా కథను రాఘవేంద్రరావు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పతాక ఘట్టాలు, పాటలు బాగుంటాయి.

మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పు కోవడానికి కారణమేమిటి?

మూడవ సీజన్ పూర్తి కాకముందే నాలుగవ సీజన్ చేయనని ముందే చెప్పాను. అంతే కాకుండా నాగచైతన్య, అఖిల్‌తో సినిమాలు చేస్తానని మాటిచ్చాను. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది. అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకున్నాను. నాలుగవ సీజన్‌లో చిరంజీవిగారు హోస్ట్‌గా వ్యవహరిస్తారు. త్వరలో దీనికి సంబంధించిన చిత్రీకరణ మొదలౌతుంది. ఈ కార్యక్రమంలో ఎపిసోడ్‌లో చిరంజీవితో కలిసి హాట్ సీట్‌లో అతిథిగా నేనూ కనిపిస్తాను.

గత కొంత కాలంగా వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతినాయక పాత్రల్లో నటించాలనే ఆలోచన ఏదైనా వుందా?

ప్రతినాయకుడి పాత్రల్లోనూ ఓ అందం వుంటుంది. అలాంటి పాత్రలు చేయాలంటే బలమైన కారణం వుండాలి. రావణాసురుడినే చూడండి. ఆయన్ని కొంత మంది మంచివాడని వాదిస్తే కొంత మంది చెడ్డవాడని వాదిస్తుంటారు. రోటీన్‌కు భిన్నంగా హంగామా లేని అర్థవంతమైన ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించడానికి నేనూ సిద్ధమే.

No comments:

Post a Comment