Sunday, 30 April 2017

EPF గుడ్ న్యూస్: ఖాతా నుంచి నేరుగా డబ్బుతీసుకోవచ్చు...

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారులకు మరో వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదురయినప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ సమర్పించి పీఎఫ్‌ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆస్పత్రుల బిల్లులు చెల్లించాలంటే డాక్టర్లు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలుగానీ, కార్మిక బీమా కింద వైద్య సేవలు పొందడం లేదంటూ యజమాని ఇచ్చే డాక్యుమెంట్స్ అవసరమయ్యేవి. మూడు రకాల ఫారాలను నింపాల్సి వచ్చేది. ఇప్పుడు వాటి అవసరం లేకుండా నేరుగా అడ్వాన్సు తీసుకొనే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆరు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతా నుంచి తీసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్‌ సంస్థ రూపొందించిన ఉమ్మడి క్లెయిమ్‌ ఫారాన్ని నింపితే సరిపోతుంది. పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, కుష్టు, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, గుండెకు సంబంధించిన వ్యాదులోతో బాధపడుతున్నా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అవసరమైన పరికరాల కొనుగోలు కోసం దివ్యాంగులు కూడా ఎటువంటి పత్రాలు సమర్పించకుండానే సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు. కర్మాగారం మూతపడినా, వివాహాలు, పిల్లల చదువులు కోసం కూడా ఎలాంటి ఆధారాలు జత చేయకుండానే సొమ్ము తీసుకునే అవకాశాన్ని ఈ ఉత్తర్వుల ద్వారా కల్పించింది కేంద్ర సర్కారు.
ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 2016-17 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిని చందాదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

Monday, 6 March 2017

ఏయే బ్యాంక్.. ఎంతెంత బాదుడు.. తప్పక తెలుసుకోండి...

బ్యాంకు లావాదేవీల‌పై సేవా రుసుం విధించాల‌ని ఎస్‌బీఐతో పాటు దేశంలోని ప్ర‌ధాన బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ,యాక్సిస్ బ్యాంకులు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ దారిలోనే మ‌రికొన్ని బ్యాంకులు స‌ర్వీస్ ఛార్జీల పేరుతో క‌స్ట‌మ‌ర్‌పై భారం మోపేందుకు స‌న్నాహాలు ప్రారంభించాయి. లావాదేవీలు నేరుగా బ్యాంకుల‌నుంచి కాకుండా ఆన్‌లైన్‌లోనే జ‌ర‌పాల‌న్న ఉద్దేశంతోనే ఈ నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్లు ఆయా బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఒక‌వేళ ఈ కింద ఉన్న బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉంటే మీ లావాదేవీల‌పై ఎంత సేవా రుసుము విధిస్తారో తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో నేరుగా డ‌బ్బును మూడుసార్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. మూడు సార్లు డిపాజిట్ చేసిన త‌ర్వాత అంటే నాలుగో సారినుంచి ప్ర‌తి లావాదేవీల‌పై రూ.50 స‌ర్వీస్ ఛార్జ్ వ‌సూలు చేస్తారు
మీది క‌రెంట్ అకౌంట్ అయితే రూ.10వేల వ‌ర‌కు స‌ర్వీస్ ఛార్జీలు విధించ‌బ‌డుతాయి
ఎస్‌బీఐ ఖాతాదారులు మీ అకౌంట్ల‌లో క‌నీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి లేదంటే జ‌రిమానా త‌ప్ప‌దు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాతాదారుల‌కు ఆ జ‌రిమానా కాస్త త‌క్కువ‌గా ఉంటుంది.

మెట్రో పాలిట‌న్ ప్రాంతాల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ రూ.5000 ఉండాలి. అయితే రూ.5వేల‌కు 75 శాతానికి త‌క్కువ‌గా బ్యాలెన్స్ ఉన్న‌ట్ల‌యితే రూ.100 జరిమానా విధిస్తారు. అదే 50 శాతానికి మించి త‌క్కువ‌గా ఉంటే రూ.50 వ‌ర‌కు పెనాల్టీ ఉంటుంది.
ఇక ఏటీఎంల విష‌యానికొస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జీ విధిస్తారు.ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జీ ఉంటుంది.

మీ అకౌంట్‌లో రూ.25వేలకు మించి ఉంటే ఎస్బీఐ ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా స‌రే ఎలాంటి రుసుం లేకుండా ఎస్బీఐ డెబిట్ కార్డుతో డ‌బ్బు డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ మీ అకౌంట్‌లో రూ.1 ల‌క్ష అంత‌కుమించి ఉంటే ఇత‌ర బ్యాంకు ఏటీఎంల‌నుంచి కూడా ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఎన్నిసార్లు అయినా డ‌బ్బును డ్రా చేసుకోవ‌చ్చు
ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై మూడునెలకు రూ.15 ఛార్జీలు వ‌సూలు చేస్తారు.రూ.1000 వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు.
యాక్సిస్ బ్యాంక్‌
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు నెల‌కు 5 లావాదేవీలు ఎలాంటి రుసుము లేకుండా జ‌ర‌పొచ్చు. ఆపైన ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిపితే ఒక్క లావాదేవీకి రూ.95 వ‌సూలు చేస్తారు

నాన్ హోమ్ బ్రాంచ్ ట్రాన్సాక్ష‌న్స్ ఐదు సార్లు జ‌రిపితే ఎలాంటి ఛార్జ‌లు ఉండ‌వు అయితే క‌నీస లావాదేవీలు రోజుకు రూ.50వేల‌కు తక్కువ‌గా ఉండ‌కూడ‌దు. ఆరో ట్రాన్సాక్ష‌న్ నుంచి ప్ర‌తి రూ.1000కి రూ.2.50 ఛార్జ్ చేస్తారు లేదా రూ.95 ఛార్జ్ చేస్తారు. రెండిట్లో ఏది ఎక్కువ‌గా ఉంటే దాన్ని బట్టి ఛార్జీలు విధిస్తారు.
HDFC బ్యాంక్
HDFC ఖాతాదారులు నెల‌కు డిపాజిట్స్ కానీ విత్‌డ్రాయ‌ల్స్ కానీ నాలుగు సార్లు మాత్ర‌మే చేసుకోవ‌చ్చు. ఆపైన ట్రాన్సాక్ష‌న్స్‌కు రూ.150 వ‌సూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్‌తో పాటు శాల‌రీ అకౌంట్ల‌కు కూడా వ‌ర్తిస్తాయి.

హోమ్ బ్రాంచ్ లో అయితే రోజుకు రూ. 2 ల‌క్ష‌లు డిపాజిట్ లేదా విత్‌డ్రాయ‌ల్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. అయితే రూ.2 ల‌క్ష‌లు ట్రాన్సాక్ష‌న్ ఒకేసారి నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఆపైన ప్ర‌తి రూ.1000కి రూ.5 వ‌సూలు చేస్తారు లేదా రూ.150 వ‌సూలు చేస్తారు.
నాన్‌-హోమ్ బ్రాంచ్‌ల‌లో రూ.25వేల‌కు మించి డిపాజిట్ చేసినా విత్‌డ్రాచేసిన ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 వ‌సూలు చేస్తారు
ICICI బ్యాంక్
హోం బ్రాంచ్‌లో నెల‌లో జ‌రిపే మొద‌టి నాలుగు లావాదేవీల‌కు ఎలాంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌రు. ఆపై ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు

థ‌ర్డ్ పార్టీ ద్వారా జ‌రిపే డిపాజిట్స్ రోజుకు రూ.50వేలు

నాన్ హోమ్ బ్రాంచ్‌ల‌లో నెల‌లో తొలిసారిగా జ‌రిపే క్యాష్ విత్‌డ్రాయ‌ల్స్‌పై ఎలాంటి రుసుము ఉండ‌దు. ఆ త‌ర్వాత జ‌రిపే లావాదేవీల‌పై ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు.

క్యాష్ డిపాజిట్ మెషీన్ల‌లో న‌గ‌దు డిపాజిట్ చేస్తే మొద‌టిసారి ఎలాంటి రుసుము విధించ‌రు. ఆ తర్వాత డిపాజిట్ చేస్తే ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు

భయం భయం.. చేపల వేటలో వింతప్రాణులు...

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన చేపలు పట్టే ఓ వ్యక్తి వలకు వింత ప్రాణులు దొరికాయి. నార్తర్న్ టెరిటొరి వాటర్స్‌ ప్రాంతంలో దాదాపు 30 మీటర్ల లోతులోని ఓ రహస్యప్రదేశంలో ఈ జీవులు లభించాయి. పెద్దకళ్లు, ఎరుపు రంగు, శరీరంపై ముల్లులు, ముందు రెండు కొమ్ములు ఉన్న ఈ జీవులను చూసి చేపలు పట్టే వ్యక్తి భయభ్రాంతులకు గురయ్యాడట. సముద్రజీవులపై అవగాహన ఉన్న నిపుణులు వీటిని పరిశీలించారు. మొదటిసారిగా ఈ ప్రాణులను చూస్తున్నామని, కొన్ని జాతుల చేపలు సముద్రంలో చాలాలోతులో ఉంటాయని, ఇవి ఏ జాతికి చెందిన చేపలో లేదా మరేదైనా ప్రాణులో త్వరలోనే తేల్చనున్నామని నిపుణులు తెలిపారు.

Friday, 3 March 2017

గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి...

ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే కుప్ప కూలిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని నారాయణగూడ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. BVRIT  కాలేజీ బస్సు నారాయణగూడ మీదుగా వెళ్తుండగా.. బస్సులో డీజిల్‌ అయిపోవడంతో డ్రైవర్‌ రసూల్‌ రోడ్డులో పక్కకు ఆపాడు. ఇంతలోనే అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా స్టీరింగ్‌పైన ఒరిగిపోయి ప్రాణాలు వదిలాడు. విద్యార్థులు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరిక్షించిన డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించారు.

లేడీస్ స్పెషల్: 8న లైసెన్స్ మేళా...

అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండాలనే లక్ష్యంతో రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఈ నెల 8న  ప్రత్యేకంగా  లైసెన్స్ మేళా నిర్వహంచేందుకు శ్రీకారం చుట్టింది. వాహనాలు నడుపుతున్నా చాలా మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లు లేవు. దీంతో ఇతరులపైనే ఆధార పడుతున్నారు. లైసెన్స్ లు తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట్,బహదూర్ పురా, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 20 లక్షల మందికి పైగా మగవారు డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉంటే… లక్ష మంది మహిళలకే లైసెన్స్ లు  ఉన్నాయట.  సొంతంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకునేందుకు మహిళలు పెద్దగా ఇంట్రెస్టు చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రవాణ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగ నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్స్ లు అందజేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్.
మార్చి 8న సికింద్రాబాద్,ఖైరతాబాద్, మలక్ పేట్,మెహదీపట్నం,బహదూర్ పురా ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్స్ తీసుకునేలా స్లాట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ సెంటర్లలో మహిళా ఎంవీఐలు, మహిళా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్స్ లకు హాజరయ్యే మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్, కూకట్ పల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్ అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్స్ తో పాటు…వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు.

జియో బ్యాంకుకు RBI అనుమతి...

రిలయన్స్ జియో మరో ఘనత ను సాధించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) భాగస్వామ్యంతో ఏర్పాటైన జియో పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు RBI అనుమతిని పొందింది. చెల్లింపు బ్యాంక్ సేవలను  ఈ నెల  చివరి కల్లా ప్రాంభించాలని సంస్థ భావిస్తోంది.
ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్‌లు పేమెంట్ బ్యాంకులుగా కార్య కలాపాలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతి పొందాయి. ఆన్‌లైన్ లావా దేవీలు పెరిగిన క్రమంలో సంప్రదాయ బ్యాంకులకు దీటుగా వివిధ పేమెంట్ బ్యాంకులకు RBI  అనుమతులు ఇస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి రిలయన్స్ జియో వచ్చి చేరింది. జియో సేవలను ప్రారంభించిన ఆరు నెలల్లోనే 10 కోట్లకు పైగా యూజర్లతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. త్వరగా పేమెంట్స్ బ్యాంక్‌ను ప్రారంభించడం ద్వారా లాభాలను ఆర్జించాలని, ఇందుకు పేమెంట్స్ బ్యాంకు సహకరిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. దీంతో అటు మొబైల్ ఫోన్ వినియోగం, ఇటు డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి గట్టి పోటీ ఎదురుకానుంది.

5రూపాయల భోజన కేంద్రాలకు మూడేళ్లు...

హైదరాబాద్ లో 5 రూపాయల భోజన కేంద్రాలు ప్రారంభించి మూడేళ్లవుతుంది. 2014, మార్చి 2న జీహెచ్ఎంసీ మొదట 5 కేంద్రాలను ప్రారంభించింది. డిమాండ్ పెరగడంతో వీటి సంఖ్య పెంచుతూ వస్తోంది. 5 రూపాయల మీల్స్ తో ప్రతిరోజు 30 వేల మంది కడుపు నింపుకుంటున్నారు. ఒక్క ప్లేట్ మీల్స్ కు 24 రూపాయల వరకు ఖర్చవుతుంటే..19 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది. మిగితా 5 రూపాయలు  లభ్దిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. నిర్వహణ అంతా హరేకృష్ణా స్వచ్చంధ సంస్థ చూసుకుంటోంది.
సిటీలో ఇప్పటి వరకు 5 రూపాయల భోజన సెంటర్లు 108 ఉన్నాయి. పబ్లిక్ ప్లేస్ లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్స్, రైల్వేస్టేషన్, మేయిన్ సెంటర్లలో ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రాలు రోగులతో పాటు వారి బంధువులకు ఆసరా అవుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేసిన సెంటర్ల దగ్గర భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కండుపు నింపుతున్నాయి.
సిటీ లైబ్రరీ దగ్గర పెట్టిన సెంటర్ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు.. వండుకునే సమయం వెస్ట్ కాకుండా 5 రూపాయల భోజనం ఉపయోగపడుతోంది.
5 రూపాయల భోజన కేంద్రాలు చాలా ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కార్మికులకు, నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు ఆసరా అవుతున్నాయని అంటున్నారు. స్వచ్చంధంగా ఇచ్చే విరాళాలతో కూడా మీల్స్ అందిస్తున్నారు. రానున్న రోజుల్లో భోజన సెంటర్ల సంఖ్య 150 వరకు పెంచాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

ఆధార్ ఉంటేనే ఆన్ లైన్ లో బుకింగ్...

రైల్వే ఆన్ లైన్‌ టికెట్ల కొనుగోలులో మోసాలను అరికట్టేందుకు ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఐఆర్‌సీటీసీ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆధార్‌ను తప్పనిసరి చేయనుంది. దీనివల్ల బల్క్‌ టికెట్ల బుకింగ్‌లను అరికట్టడంతోపాటు మరొకరి పేరుతో టికెట్‌ బుకింగ్‌ చేయడాన్ని కూడా అడ్డుకోవచ్చు.
సీనియర్‌ సిటిజన్లు రైల్వే టికెట్లలో రాయితీ పొందేందుకు ఏప్రిల్‌ 1 నుంచి ఆధార్‌ తప్పక సమర్పించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఆదేశిం చింది. దీన్ని మూడు నెలల పాటు ప్రయోగా త్మకంగా అమలు చేయనుంది. రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు రైల్వేశాఖ 2017–18 కొత్త బిజినెస్‌ ప్లాన్ ను గురువారం ప్రవేశపెట్టారు. ఇందులో ఆధార్‌ తప్పనిసరి చేయడంతోపాటు నగదు రహిత టికెట్ల కొనుగోలు లక్ష్యంగా అడుగులు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఆరు వేల పీవోఎస్‌ మెషీన్లను, వెయ్యి ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టికెటింగ్‌ యాప్‌ను కూడా రైల్వేశాఖ మేలో ఆవిష్కరించనుంది. అంతేకాదు ఐఆర్‌సీటీసీలో నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేసేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది.