Sunday, 11 September 2016

స్టైల్‌ అదిరింది గురూ!

అందం అంటే సినిమా. సినిమా అంటేనే అందం... నటీనటులంతా నిత్యం గ్లామర్‌ మంత్రం జపిస్తుంటారంటే కారణం అదే! ఒక్కో తార ఒక్కో స్టైలిస్ట్‌గా మారిపోయిన వైనం. ఎవరికి వారు ఫ్యాషన్‌ గురూలే. ప్రతి సినిమానీ, ప్రతీ వేదికనీ ఓ అవకాశంగా భావిస్తూ వాళ్ల వాళ్ల ఫ్యాషన్‌ టాలెంట్‌ని ప్రదర్శిస్తున్నారు. కథానాయికలైతే... నటన వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు, స్టైల్‌ విషయంలో మాత్రం రాటుదేలాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు... గ్లామర్‌కి అంత డిమాండ్‌ ఉంది మరీ! తెరపైన కథానాయిక కనిపించగానే సినిమా హాల్‌లో కూర్చున్న ప్రేక్షకుడు కూడా ఓ డ్రీమ్‌ సాంగ్‌ వేసుకోవడానికి సిద్ధమైపోవాలి. గ్లామర్‌తో అంతగా మాయ చేయాలి. అప్పుడే వాళ్లకి అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు. ఆ కిటుకుని మన కథానాయికలు బాగానే పసిగట్టారు. ఒక పక్క నటనతో అదరగొడుతూనే.. మరోపక్క ఫ్యాషన్‌లోనూ ముందు వరుసలో ఉన్నారు. బాలీవుడ్‌కి దీటుగా కనిపిస్తున్నారు. వాళ్లు స్టైల్‌కి ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిది? ఫ్యాషన్‌ విషయంలో ఎలా రాటుదేలారో వాళ్ల మాటల్లోనే...

సౌకర్యంలోనే స్టైల్‌ :-
‘‘నా దృష్టిలో స్టైల్‌గా కనిపించడమంటే మార్కెట్లోకొచ్చిన ట్రెండీ దుస్తుల్ని ధరించడం మాత్రమే కాదు. సౌకర్యంగా ఉండటంలోనే ఓ స్టైల్‌ ఉంటుందని నమ్ముతా. అందుకే నాకు ఏ దుస్తులైతే సౌకర్యంగా అనిపిస్తాయో వాటినే ధరిస్తుంటా. ఆ దుస్తులు, నేను కనిపించే విధానం నేటి తరాన్ని ప్రతిబింబించేలా ఉండాలనుకొంటా. అదే నా స్టైల్‌ మంత్ర. తెరపైన కూడా ఆ సూత్రం ప్రకారమే కనిపించాలనుకొంటా. నా దర్శకులు కూడా అలాగే బాగుంటానని అంటుంటారు. అందుకే ఫ్యాషన్‌ని పెద్దగా అనుసరించను. ఈమధ్య నా స్టైల్‌ బాగుంటుందనే అభినందనలొస్తుంటాయి. సంప్రదాయమైన దుస్తులు ధరిస్తూనే అలాంటి ప్రశంసలు పొందుతుండడం సంతృప్తినిస్తోంది’’
- రాశిఖన్నా
ప్రయోగాలు చేస్తా:- 
‘‘మోడలింగ్‌ రంగం నుంచి వచ్చినదాన్ని. ఫ్యాషన్‌, స్టైల్‌లాంటి విషయాలపై ఆసక్తి కాస్త ఎక్కువ. ఎంత తీరిక లేకుండా పనిచేస్తున్నప్పటికీ అటువైపు ఓ కన్నుంటుంది. మారుతున్న ట్రెండ్‌ని నిశితంగా గమనిస్తుంటా. అప్పుడప్పుడు ఫ్యాషన్‌పరంగా ప్రయోగాలు చేస్తుంటా. కథానాయికలకి ఫ్యాషన్‌ మెలకువలు తెలిస్తే కలిగే ప్రయోజనాలే వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని దుస్తుల్ని నా ఆలోచనలకి తగ్గట్టుగానే డిజైన్‌ చేయిస్తుంటా. నాకు ఫ్యాషన్‌ మెలకువలు తెలుసు కదా అని సినిమాపై మాత్రం రుద్దను. ఆయా కథలకి, పాత్రలకి తగ్గట్టుగా కనిపించడానికే ప్రాధాన్యమిస్తా. మోతాదుకి మించి స్టైల్‌ని మాత్రం పాత్రలపై ప్రయోగించను’’
- రకుల్‌ప్రీత్‌ సింగ్‌
బాలీవుడ్‌కి వెళ్లాకే...  
‘‘చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చా. దీంతో తొలినాళ్లల్లో ఫ్యాషన్‌ గురించి అంతగా తెలిసేది కాదు. నాకు బాగా గుర్తు. అప్పట్లో ఒక సినిమాకి సంబంధించి స్టైల్‌ విషయంలో అనుష్క సాయం చేసింది. తోటి కథానాయిక అయినప్పటికీ తను నన్ను పోటీగా భావించకుండా సాయపడింది. ఆ తర్వాత నుంచి ఫ్యాషన్‌పై గురిపెట్టా. కొంతకాలానికే తెలుగు తెరపై స్టైల్‌గా కనిపించే కథానాయికల్లో నేనూ ఒకరిని అనే పేరు సంపాదించా. మేగజైన్లు, అంతర్జాలంలో చూస్తూ అప్‌డేట్‌ అయ్యేదాన్ని. కానీ బాలీవుడ్‌కి వెళ్లాక తెలిసిందేంటంటే... ఫ్యాషన్‌ గురించి నాకేమీ తెలియదని. అలాగని నేనేమీ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎవ్వరూ పుట్టుకతో అన్నీ నేర్చుకోలేరు కదా! అందుకే నేనూ లోతుగా ఫ్యాషన్‌ గురించి, స్టైల్‌గా కనిపించడం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. బాలీవుడ్‌ వాతావరణానికి తగ్గట్టుగా మారిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘హిమ్మత్‌ వాలా’తోనే నేను హిందీ జనాల్ని ఆకట్టుకొన్నా. వింటేజ్‌ స్టైల్‌ డ్రెస్సెస్‌, క్రాప్‌ టాప్స్‌, పాలెజ్జో ప్యాంట్స్‌, శారీ గౌన్స్‌, ప్యాంట్‌ సూట్స్‌... ఇలా అన్నీ వాడా. సినిమా కోసమే కాదు, బయట వేడుకలకి హాజరైనప్పుడు, సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కూడా స్టైల్‌కి ప్రాధాన్యమిస్తుంటా. అయితే వృత్తిపరంగా ఫ్యాషన్‌కి నేనెంత ప్రాధాన్యమిచ్చినా, ఇంట్లో మాత్రం మేకప్‌ లేకుండా, ట్రాక్‌ప్యాంట్లు, టీషర్టుతో సాదాసీదాగా గడుపుతుంటా’’
- తమన్నా
స్టైల్‌తోనే ఆనందం:-
‘‘తెరపైన నన్ను చూసి ‘సమంత బాగా కనిపించింది, బాగా నటించింది’ అనే మాటలు ఎంత కిక్కిస్తుంటాయో... స్టైల్‌ పరంగా నన్నెవరైనా మెచ్చుకొన్నా అంతే ఆనందం కలుగుతుంది. నాకూ మొదట్లో ఫ్యాషన్‌ గురించి అంతగా తెలిసేది కాదు. కానీ ఎక్కువ సినిమాలు చేసే అవకాశం, ఎక్కువ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడంతో ఫ్యాషన్‌ ఆవశ్యకత బాగా తెలిసొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలంటే స్టైల్‌ విషయంలో రాటుదేలాల్సిందే అని నమ్మా. తక్కువ మేకప్‌, హంగామా లేని దుస్తులు ధరిస్తూనే స్టైలిష్‌గా కనిపించడమంటేనే ఇష్టం. ప్రతి సినిమాకీ స్టైలిస్ట్‌లు, డిజైనర్లు పనిచేస్తుంటారు. అయినా వ్యక్తిగతంగా కూడా నేను ఆ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటా’’ 
- సమంత
పాత్రల స్టైలే నాది :-
‘‘వ్యక్తిగతంగా ఫ్యాషన్‌పై పెద్దగా మోజు లేదు. ఇంట్లోనూ, బయట జరిగే వేడుకలకీ సంప్రదాయ దుస్తుల్ని ధరించి వెళతా. సాధారణంగానే కనిపించాలనుకొంటా. అయితే సినిమా విషయానికొచ్చేసరికి ఆ ఆలోచనలు మారిపోతాయి. పాత్ర ఎలా డిమాండ్‌ చేస్తే అలాంటి దుస్తుల్ని ధరించాలనుకొంటా. ఆ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అయితే వ్యక్తిగతంగా నేనెలా ఉన్నప్పటికీ, ఫ్యాషన్‌ సంగతుల్ని మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉంటా. ట్రెండ్‌ ఎలా ఉందో గమనిస్తుంటా. సినిమాల్లో నటించేటప్పుడు మాత్రం ఫ్యాషన్‌ పరంగా స్టైలిస్ట్‌పైనే ఆధారపడుతుంటా. నాకు ఎలాంటి దుస్తులైతే బాగుంటాయో నేనూ నా అభిప్రాయాన్ని పంచుకొంటుంటా’’
- అనుష్క 

No comments:

Post a Comment