Saturday, 17 September 2016

పగటి నిద్ర ఎక్కువైతే మధుమేహ ముప్పు!

పగటి పూట ఓ కునుకు తీస్తే ఆరోగ్యానికి మంచిదే! కానీ.. ఆ కునుకు సమయం పెరిగితే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట! సుమారు 3 లక్షల మందిపై జరిగిన 21 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించిన యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో శాస్త్రవేత్తలు ఈ విషయం గుర్తించారు. రోజూ పగటి సమయంలో గంట కంటే ఎక్కువ నిద్రపోయేవారికి టైప్‌-2 మధుమేహం (ఇన్సులిన్‌ హార్మోన్‌ను వినియోగించుకోవడంలో దేహం విఫలమవడం) ముప్పు 45 శాతం పెరుగుతుందని, 40 నిమిషాల కంటే తక్కువ కునుకు తీసేవారికి ఆ ప్రమాదం ఉండదని వారు వెల్లడించారు. గంటకన్నా ఎక్కువసేపు కునుకేస్తే గాఢనిద్రలోకి చేరుకుంటారని, కానీ ని ద్రవలయం పూర్తి కాకముందే మేలుకొంటారు కాబట్టి ఏకాగ్రత కోల్పోవడం, నిద్రమత్తు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పగటి నిద్ర పెరిగితే రాత్రిపూట నిద్రలేమి కూడా వస్తుందని, దానివల్ల గుండె జబ్బు లు, జీవక్రియపరమైన సమస్యలు, టైప్‌-2 మధుమేహ ప్రమాదం ఏర్పడుతుందన్నారు. మధుమేహానికి కారణమయ్యే సమస్యలు కూడా పగటి నిద్రను పెంచుతాయని, అందువల్ల దీనిని మధుమేహానికి ముందస్తు సూచనగా భావించవచ్చని పేర్కొన్నారు. కాగా, గర్భిణుల్లో కొందరికి గర్భధారణ సమయంలోనే తాత్కాలికంగా మధుమేహం సమస్య వస్తుంటుంది. అయితే వేసవి కాలంలోనే ఈ ముప్పు అధికమని స్వీడన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. 2003-05 మధ్యలో 11,538 మంది మహిళలపై వీరు పరిశోధించగా.. 487 మందికి(4.2 శాతం) తాత్కాలిక మధుమే హం వచ్చిందని, సీజన్‌ల వారీగా చూస్తే.. వేసవిలోనే ఎక్కువ మందికి సమస్య ఏర్పడిందని గుర్తించారు.

No comments:

Post a Comment