Sunday, 18 September 2016

ఉద్యోగుల విభజన పూర్తి

-కొత్త జిల్లాలపై సన్నాహాలు ముమ్మరం
-పూర్తి కావచ్చిన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎంపిక
-యాదాద్రి, సూర్యాపేటలో భవనాలు పరిశీలించిన సీఎస్
-జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్షలు 


             కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. వర్క్‌టు సర్వ్ కింద తాత్కాలికంగా కేటాయింపులు జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఈ మేరకు కసరత్తు పూర్తిచేయటంతోపాటు ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చాయి. కేటాయింపులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటమే మిగిలింది. కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ మరో 22 రోజుల్లో ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన ఏర్పాట్లు కూడా వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు, నివాసాలకు కూడా భవనాల ఎంపిక పూర్తయింది. వాటికి అద్దెలు నిర్ణయించాల్సి ఉంది. ఇక డ్రాప్ట్ నోటిఫికేషన్‌లో ప్రజల అభ్యంతరాలు, సలహాలకోసం ఇచ్చిన వ్యవధి మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటిదాకా 70వేల అభ్యంతరాలు, వినతులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో రాజకీయ స్వభావం కలిగినవే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజల కోరిక మేరకు అదనంగా 70 మండలాల ఏర్పాటుతో పాటు మరిన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రజలనుంచి వచ్చే విజ్ఞప్తులతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెప్పించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  

భవనాలు పరిశీలించిన సీఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రతిపాదిత యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాలను శనివారం స్వయంగా పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులను వాకబు చేసి భవనాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో అధికారులు, సిబ్బంది సీటింగ్ కోసం చేస్తున్న పనులు ఎలా ఉండాలన్నదానిపై సూచనలు చేశారు. కాగా దాదాపు అన్ని ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు ఇతర శాఖల జిల్లా కార్యాలయాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. అయితే లీజుకు తీసుకున్న ఈ భవనాలకు ఇంకా అద్దె ఖరారు కాలేదు. అద్దె ఖరారైన వెంటనే ఎంపిక చేసిన ఈ భవనాలకు అగ్రిమెంట్లు చేసుకోవడమే మిగిలిందని సమాచారం. భవనాల అద్దె నిర్ణయించడానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ వద్ద ఉంది. అక్కడినుంచి సీఎం వద్దకు వెళుతుంది. సీఎం సంతకం కాగానే భవనాలకు అద్దె నిర్ణయించడానికి జాయింట్ కలెక్టర్లు, రోడ్లు భవనాలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్‌తోపాటు మరో అధికారితో కలిపి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ అద్దెలు నిర్ణయించి అగ్రిమెంట్లు చేస్తుంది. మల్కాజిగిరి,శంషాబాద్ జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఉద్యోగుల కేటాయింపులు పూర్తి

ప్రతిపాదిత జిల్లాలకు వర్క్ టూ సర్వ్ కింద ఒకటి రెండు మినహా దాదాపు అన్ని శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆయా శాఖలు తిరిగి ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అక్టోబర్ 11వ తేదీన లాంఛనంగా కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయి. ఆరోజు నాటికి కొత్త జిల్లాల్లో సిబ్బంది ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ముందుగానే కసరత్తు పూర్తి చేశారు. ఉద్యోగుల కేటాయింపులపై ఫైనల్ ఆర్డర్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉన్నదని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఉద్యోగుల కేటాయింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నేరుగా మంత్రివర్గ ఉపసంఘం,ఆ తరువాత సీఎస్ కూడా సమావేశాలు నిర్వహించారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు కేటాయింపులు చేపట్టారు. మెజార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం మేరకు జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు.

జిల్లాల ఏర్పాటుపై సీఎం ప్రత్యేక దృష్టి..

జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు రోజూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ఇప్పటిదాకా 71,700 పైచిలుకు అభ్యంతరాలు వచ్చాయి. వనపర్తి, హన్మకొండ, యాదాద్రి జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల్లో అధికంగా రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజల అభ్యంతరాల మేరకు వరంగల్ కార్పొరేషన్‌ను రెండు జిల్లాలుగా మార్చే ప్రతిపాదన ఉపసంహరించారు. మరోవైపు డ్రాప్ట్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన నూతన మండలాలకు అదనంగా మరో 40 మండలాలు వచ్చే అవకాశం ఉన్నది. సీఎం ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని తెప్పించి ప్రజాభిప్రాయం మేరకు జిల్లాలు, డివిజన్లు, మండలాలపై నిర్ణయం తీసుకుంటున్నారు.ఇప్పటికే మెయినాబాద్ మండలాన్ని శంషాబాద్‌లో కలుపాలని నిర్ణయించిన సీఎం శంకర్‌పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్‌లో కలుపాలని, కొడంగల్ తదితర మండలాలను రంగారెడ్డిలో కలపాలని నిర్ణయించారని తెలిసింది.

No comments:

Post a Comment