Monday, 31 October 2016

చలికాలం మిరపకాయ బజ్జీలు తింటున్నారా? పేపర్‌తో జాగ్రత్త!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటే దేన్నైనా సాధించవచ్చంటారు. మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? మన నిర్లక్ష్యంతో పాడు చేసుకుంటున్నామా? కొన్ని సార్లు కొన్ని విషయాలు తెలియక జాగ్రత్తలు తీసుకోలేము. మరికొన్ని సార్లు మనం తీసుకునే జాగ్రత్తలే ఇంకో రూపంలో హాని చేస్తాయి. అందులో న్యూస్‌పేపర్‌లు వాడడం కూడా ఒకటి. పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం న్యూస్ పేపర్‌‌ను వాడటం మాత్రం హానికరమే!
 
ఎందుకంటే నూనె వంటకాలను పేపర్‌ మీద వేయగానే దాంట్లోని న్యూస్‌ ప్రింట్‌ ఇంక్‌ కరగటం మొదలుపెడుతుంది. ఈ ప్రింట్‌ ఇంక్‌లోని గ్రాఫైట్‌ మనం తినే పదార్థాల్లోకి చేరి నేరుగా శరీరంలోకి చేరుతుంది. గ్రాఫైట్‌ వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలం పెరుగుదల దెబ్బతింటాయి. సాధారణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది. కానీ గ్రాఫైట్‌ అలా కాదు. అది శరీరంలో నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్‌ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించండి. అలాగే చేతులు తుడుచుకోవటానికి కూడా! న్యూస్‌ పేపర్‌ తడవనంతవరకూ దాంట్లోని గ్రాఫైట్‌తో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ తడి లేదా నూనె వల్ల న్యూస్‌ పేపర్‌ తడిస్తే ఇంక్‌ప్రింట్‌లోని గ్రాఫైట్‌ కరగటం మొదలుపెడుతుంది. కాబట్టి న్యూస్‌ పేపర్‌ను చదవటానికే తప్ప పదార్థాల నిల్వకు, చేతులు తుడుచుకోవటానికి, అదనపు నూనె పీల్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం వస్తోంది. చాలా మంది మిరపకాయ బజ్జీలు తినడానికి ఇష్టపడతారు. ఏ బడ్డీకొట్టు దగ్గరికి వెళ్లినా న్యూస్ పేపర్ మీదే వేసిస్తారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా  ఉండండి. న్యూస్  పేపర్‌లో కాకుండా పేపర్ ప్లేట్‌లో తీసుకుని తింటే మంచిది.

No comments:

Post a Comment