Friday, 7 October 2016

మన వూరి రామాయణం : రివ్యూ

నటీనటులు: ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, పృథ్వీ, సత్య తదితరులు
సంగీతం: ఇళయరాజా
మాటలు: గోపిశెట్టి రమణ, ప్రకాష్‌రాజ్‌
ఛాయాగ్రహణం: ముఖేష్‌
నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌
విడుదల: 07 –10-2016

నటుడిగా ప్రకాష్‌ రాజ్‌ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. జాతీయ అవార్డుల్ని అందుకొన్న నటుడాయన. దర్శకుడిగానూ తనలో ఉన్న కోణాన్ని బయటపెట్టాలనుకొన్నారాయన.  అందుకే ‘ధోని’ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. ‘ఉలవచారు బిర్యానీ’ రుచి చూపించారు. అయితే.. ఈ రెండు సినిమాలూ అంతంత మాత్రంగానే ఆడాయి. ఇప్పుడు ‘మన వూరి రామాయణం’ అంటూ మరో కథ చూపించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ చిత్రం ‘షట్టర్‌’కి రీమేక్‌ ఇది. మరి ఆయన ప్రయత్నం ఎలా సాగింది?  ప్రకాష్‌రాజ్‌లోని దర్శకుడు ఎంతవరకు బయటకొచ్చాడు? ఇంతకీ ఈ సినిమా కథేంటి? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే: అదో పల్లెటూరు. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ వూర్లో భుజంగం (ప్రకాష్‌రాజ్‌) పెద్ద మనిషి. అందరూ సలాం కొడుతుంటారు. ఇంట్లో పెళ్లీడొచ్చిన కూతురు ఉంటుంది. తనకో  సంబంధం తీసుకొస్తాడు. ‘నేనప్పుడే పెళ్లి చేసుకోను’ అంటుందా అమ్మాయి. ఇంట్లోవాళ్లు తన మాట వినడం లేదని అసహనంతో రగిలిపోతుంటాడు భుజంగం. శివ (సత్య) ఓ ఆటో డ్రైవర్‌. తనకు భుజంగం వీసా ఇప్పిస్తే దుబాయ్‌ వెళ్లిపోవాలని.. అతని చుట్టూ తిరుగుతుంటాడు. తెల్లారితే  శ్రీరామనవమి అనగా ఆ రోజు రాత్రి చిత్తుగా తాగుతాడు భుజంగం. ఆ మత్తులో ఓ వేశ్య (ప్రియమణి)ని చూసి మనసు పారేసుకొంటాడు.
ఎలాగైనా సరే.. తనని అనుభవించాలనుకొంటాడు. సత్య సాయంతో బేరమాడి ఆ వేశ్యని తన ఇంటి ముందున్న షెడ్డులోకి తీసుకొస్తాడు. కానీ ఎందుకో మనసొప్పదు. ఈ వ్యవహారం బయటి జనానికి తెలిస్తే  పరువు పోతుందని కంగారు పడుతుంటాడు. అనుకోకుండా ఆ షెడ్డుకి తాళం వేసి వెళ్లిపోతాడు సత్య. గంటలో వస్తాడనుకొంటే ఓ చోట ఇరుక్కుపోతాడు. మరి.. ఆ గదిలోంచి వీరిద్దరూ బయటపడ్డారా?  భుజంగం భాగోతం వూరి జనానికి తెలిసిపోయిందా? ఆ ఒక్క సంఘటన వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న విషయాలు వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: సన్నటి దారం పోగులాంటి కథాంశం ఇది. అసలు ఇలాంటి పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా? అనిపిస్తుంది. మలయాళంలో ఆ ప్రయత్నం చేసిన దర్శకుడ్ని అభినందించాలి. దాన్నే తెలుగులో అనువదించే ప్రయత్నం చేశారు ప్రకాష్‌రాజ్‌. ఈ కథంతా నాలుగు పాత్రల చుట్టూనే నడుస్తుంది. వివిధ సందర్భాల్లో వాళ్ల భావోద్వేగాలు, సంఘర్షణ, జీవితాన్ని చూసే కోణం వీటి మధ్య సన్నివేశాల్ని అల్లుకొన్నారు. చిన్న గదిలో దాదాపు సగం సినిమా నడుస్తుంది. ప్రియమణి..  ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేవేశాలు కట్టిపడేస్తాయి. తొలిసగం సమయం తెలీకుండానే గడిచిపోతుంది. మలి సగం మాత్రం కాస్త సాగుతున్నట్లు అనిపించినా.. ఆ అసంతృప్తి కొంత మేరే.  వాస్తవానికి ఇలాంటి కథల్లో వినోదాన్ని ఆశించలేం. కానీ తెలివిగా గరుడ అనే దర్శకుడి పాత్రని ప్రవేశ పెట్టాడు. కథలోనే  వీలైనంత వినోదం పండించే ప్రయత్నం జరిగింది. ఎలా చేశారంటే: ప్రియమణి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. చాలాకాలం తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది. మంచి పాత్రలు దొరికితే తాను పోటీలోనే ఉన్నానని చెప్పేస్తుందీ సినిమా. ఆమెకీ సినిమా తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రకాష్‌రాజ్‌కు నల్లేరు మీద నడకలాంటి ప్రయాణమే. పృథ్వీ పాత్ర కొత్తగా కనిపిస్తుంది. చాలా సెటిల్డ్‌గా నటించాడు. సత్య నటన కూడా ఆకట్టుకొంటుంది.
ఇళయరాజా  అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. సన్నివేశాల్లోని తీవ్రత.. గాఢత చెప్పడంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. దర్శకుడిగా తన గత చిత్రాలకంటే మెరుగైన పనితనమే  కనబరిచారు ప్రకాష్‌రాజ్‌. మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే, సినిమాపై ఇష్టంతో కూర్చుంటే మాత్రం ఫలితం కనిపిస్తుంది. రోటీన్ సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ఈ సినిమా కొత్త తరహా అనుభవమే.
బలాలు
+  కథా నేపథ్యం
+  ప్రియమణి.. పృథ్వీ
+  నేపథ్య సంగీతం

బలహీనత
-ద్వితీయార్ధంలో సాగతీత

చివరిగా: ‘మన వూరి రామాయణం’.. ఇది మన‘లోని’ రామాయణం

No comments:

Post a Comment