ముచ్చటగా 30 జిల్లాలు
కొత్త జిల్లాలపై
కార్యశాలలో కలెక్టర్ల నివేదనలు
సీసీఎల్‌ఏ అధ్యక్షతన
8 గంటలపాటు సమావేశం
నేడు సీఎం
సమక్షంలో సమావేశం
తెలంగాణలో
ప్రజా సౌలభ్యం, చేరువగా పరిపాలన అందించేందుకు వీలుగా 30 జిల్లాల వరకు
ఏర్పాటు చేయవచ్చని జిల్లాల కలెక్టర్లు సూచించారు. ప్రజల నుంచి వస్తున్న
డిమాండ్లు, భౌగోళిక స్వరూపాలు ఇతర అంశాల ప్రాతిపదికన ఈ మేరకు నివేదికలను
అందించారని తెలిసింది. కొత్త జిల్లాలపై మంగళవారం మర్రి చెన్నారెడ్డి
మానవ వనరుల సంస్థ (ఎంసీహెచ్‌ఆర్డీ)లో కార్యశాల మొదలైంది. తొలిరోజు
దాదాపు ఎనిమిది గంటల పాటు సమావేశం జరిగింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్
రేమండ్ పీటర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్‌మీనా, సీఎం కార్యాలయ
ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితర
అధికారులు, పది జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. కొత్త జిల్లాలు,
కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై చర్చించారు. సమావేశానికి అధ్యక్షత
వహించిన రేమండ్‌పీటర్ ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడించారు. అనంతరం
కలెక్టర్లు తమ జిల్లాలోని ప్రస్తుత జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త
ప్రతిపాదనలపై నివేదికలిచ్చారు. వాటిపై దృశ్యరూపక వివరణలిచ్చారు.
ప్రతిపాదనలపై మ్యాప్‌లను అందజేశారు. తమ జిల్లాల్లో విభజన అవసరాలు,
ప్రజల డిమాండ్లు, వారికి సౌలభ్యాల ప్రాతిపదికన కొత్త జిల్లాల గురించి కలెక్టర్లు
వివరించినట్లు తెలిసింది.
కొత్త ప్రతిపాదనలతో
పెరిగిన సంఖ్య
ప్రభుత్వం
మొత్తం జిల్లాలు 24 లేదా 25 వరకు ఉండాలని ప్రతిపాదించినా కలెక్టర్లు ఇచ్చిన
నివేదికల్లో మాత్రం ఆ సంఖ్య 30 వరకు ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో
కొత్తగా ఒకే జిల్లా (జగిత్యాల)ను మొదట్లో ప్రతిపాదించినా తాజాగా కలెక్టర్
సిరిసిల్లను కలిపి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో
కొత్తగా వనపర్తి, నాగర్‌కర్నూలుతో పాటు గద్వాల, నారాయణపేటల్లో ఒకటి
జిల్లాకు అనుకూలమని ఆ జిల్లా యంత్రాంగం పేర్కొన్నట్లు తెలిసింది. రంగారెడ్డి,
హైదరాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త జిల్లాలకు తోడు శివారు ప్రాంతాల్లో మరో
జిల్లా గురించి చర్చించారు. నల్గొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో
రెండేసి కొత్త జిల్లాలు అనుకూలమని పేర్కొన్నట్లు తెలిసింది. నిజామాబాద్,
ఖమ్మం జిల్లాల్లో అదనంగా ఒక్కొక్క జిల్లాను సూచించారు. వెరసి మొత్తంగా 30
జిల్లాలపై చర్చ జరిగింది. సీఎం నిర్దేశించిన ప్రకారం 24 నుంచి 25కి వరకు ఉంటాయని,
ఈ మేరకు ప్రతిపాదనలను కుదించి బుధవారం సీఎంకు అందజేయాలని నిర్ణయించారు.
జిల్లా కేంద్రం
70 కిమీ దూరంలో..: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో
మండలాలు, నియోజకవర్గాలు ఏ జిల్లాలో ఉండాలి? అనే అంశంపై సమీక్షించారు.
శాస్త్రీయ పద్ధతిలో పకడ్బందీ కసరత్తు జరుగుతోంది. కొత్త మండలాలు,
కొత్త డివిజన్ల ఆధారంగా జిల్లాల్లో చేర్చే అంశంపై కసరత్తు జరిగింది. కలెక్టర్లు
తీసుకువచ్చిన మ్యాపుల ఆధారంగా వివిధ సమీకరణలపై చర్చించారు.
ఒక నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లాలో ఉండేలా చూడాలనే అంశంపై చర్చించారు.
ప్రతి మండలానికి 70 కిమీ దూరంలో జిల్లా కేంద్రం ఉండేలా కసరత్తు జరుగుతోంది.
ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లాలో ఉండేలా చూస్తున్నారు. ఈ
సమీకరణ మేరకు కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి
జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కొంత ఇబ్బందికరంగా మారింది. కొన్నిచోట్ల
ఒక నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.
నేడు స్పష్టత
: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రెండోరోజు
జరిగే సమావేశాలకు హాజరు కానున్నారు. ఆయన రాకకంటే ముందే ఉదయం
తొమ్మిది గంటలకు సీఎస్ రాజీవ్‌శర్మ.. కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో
భేటీ అయి తుది నివేదికలను రూపొందిస్తారు. కొలిక్కివచ్చిన అంశాలను ఆయన
దృష్టికి తీసుకెళ్తారు.
గూగుల్‌మ్యాప్
ఆధారంగా సీఎం కసరత్తు: ముఖ్యమంత్రి
కేసీఆర్ కొత్త జిల్లాలపై మంగళవారం తన నివాసంలో కసరత్తు చేశారు.
వ్యవసాయక్షేత్రం నుంచి నివాసానికి చేరుకున్న ఆయన ఈ అంశంపై దృష్టి
సారించినట్లు తెలిసింది. గూగుల్‌మ్యాప్ ఆధారంగా కొత్త జిల్లాలు ఎలా ఉండాలి?
అనే అంశాన్ని పరిశీలించినట్లు సమాచారం.
No comments:
Post a Comment