Friday, 24 June 2016

91 ఏళ్ల భారతీయుడి కోరికను పాక్ మన్నించింది

మీరట్ : పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్‌ మధ్య రాజకీయ సంబంధాలు అంత సజావుగా లేకున్నా తాజాగా ఒక భారతతీయుడి చిరకాల కోరిక పట్ల పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. 91 ఏళ్ల క్రిష్ణ ఖన్నా పాకిస్థాన్‌లోని తన పూర్వీకుల ఇంటిని సందర్శించాలని పదేళ్లుగా తపిస్తున్నాడు. అతను చేసిన విజ్ఞప్తికి ఎట్టకేలకు పాక్ స్పందించింది. ఆయనను పాక్‌లోని ఉథోక్, షేక్‌పురలో పర్యటించేందుకు అనుమతించింది. ఆయనకు తోడుగా మరో ముగ్గురు వచ్చేందుకు కూడా అంగీకరించింది. 1930 నాటికి ఐదేళ్ల ప్రాయంలో ఉన్న క్రిష్ణా కన్నా ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటికీ పదిలంగా ఉంచుకున్నారు. పాకిస్థాన్‌లోని ఉథోక్‌లో తన తాతగారింట్లో ఆడిపాడిన సంఘటనలు ఆయన స్మృతిపథంలో మిగిలిపోయారు. 1947లో విభజనకు ముందు జరిగిన అల్లర్లలో ఆయన కుటుంబం ఉథోక్ నుంచి సురక్షితంగా ఉంటున్నందుకున్న షేక్‌పురకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. అప్పటి అల్లర్లో తన కుటుంబసభ్యులు ఒక దర్గాలో తలదాచుకోవడం, నాటి నరమేథంలో పైశాచిక మూకల నుంచి ఆర్మీ తమను కాపాడిన వైనం ఆయనకు ఇప్పటికీ గుర్తుంది. 'రెండూ బాధిత దేశాలే. మరోసారి పాకిస్థాన్‌లోని మా పూర్వీకుల నివాసాన్ని చూడాలనుకుంటున్నాను. ఇది నా చివరి కోరిక' అని ఖన్నా పేర్కొన్నారు. పదేళ్లుగా ఆయన వీసా కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు పాక్ నుంచి ఆయనకు శుభవార్త అందింది. దీంతో ఖన్నా సంతోషానికి అవధుల్లేవు. 80 ఏళ్ల వయస్సులో ఉన్న తన సోదరుడు జగదీష్‌తో కలిసి త్వరలోనే ఆయన పాక్‌లో తన పూర్వీకుల ఇంటిని సందర్శించనున్నారు. 'సానుకూలంగా ఉండాలన్నదే మా అభిమతం. సీనీయర్ సిటిజన్ (ఖన్నా) చేసుకున్న విన్నపాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వీసా మంజూరు చేస్తున్నాం' అని పాక్ హైకమిషన్ ప్రెస్ మినిస్టర్ మన్జూర్ అలి మెమన్ తెలిపారు.

No comments:

Post a Comment