Thursday, 16 June 2016

గ్యాంగ్‌స్టర్‌ షకీల్‌ మృతి

 నయీమ్‌కు కుడిభుజం  
 పలు హత్య కేసుల్లో నిందితుడు  
 పీడీ యాక్ట్‌తో 3 నెలలుగా అజ్ఞాతం  
 గుండెపోటుతో మరణించిన షకీల్‌ 
        నయీముద్దీన్‌ ముఠాలో కీలక సభ్యుడు, గ్యాంగ్‌స్టర్‌ ఎస్‌కే షకీల్‌(45) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ప్రాంతంలోని కేసారం పరిసరాల్లో అజ్ఞాతంలో ఉన్న షకీల్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యాడు. అతని వెంట ఉన్న భార్య.. షకీల్‌ను సమీపంలోని మేడ్చల్‌ మెడిసిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. మాజీ మావోయిస్టు నేత సాంబశివుడి సోదరుడు కొనపురి రాములు హత్యతోపాటు పలు హత్యలు, కిడ్నాప్‌ కేసుల్లో షకీల్‌ ప్రధాన నిందితుడు. షకీల్‌పై 150కి పైగా కేసులున్నాయి. నయీముద్దీన్‌ ముఠాలో కీలక సభ్యుడిగా బెదిరింపులతో బలవంతపు వసూళ్లు, భూకబ్జావంటి ఘటనలకు పాల్పడడంతో షకీల్‌తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. దీంతో మూడు నెలలుగా అతడు అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. సోమవారం రాత్రి షకీల్‌ గుండెపోటుతో మృతిచెందిన సమాచారం అందుకున్న ఆయన అనుచరులు, బంధువులు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్స్‌లో మృతదేహాన్ని భువనగిరికి తరలించారు. షకీల్‌ మృతదేహాన్ని మంగళవారం పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సందర్శించి సంతాపం తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య తదితరులు షకీల్‌ మృతదేహానికి నివాళులర్పించారు. కాగా మాజీ నక్సల్‌ నయీముద్దీన్‌కు ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందిన షకీల్‌.. భువనగిరితో పాటు హైదరాబాద్‌ ప్రాంతంలో జరిగిన పలు హత్యలు, కిడ్నాపులు, భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నయీమ్‌ గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించి తర్వాత.. భువనగిరి నుంచి మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై కొద్దిరోజులకే పదవికి రాజీనామా చేశాడు. 2014లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఏకగ్రీవ కౌన్సిలర్‌గా ఎన్నికైన అతని భార్య..అధికార టీఆర్‌ఎ్‌సలో చేరారు.
షకీల్‌ అని తెలియదు: మెడిసిటీ
మేడ్చల్‌: షకీల్‌.. నయీమ్‌ అనుచరుడని తమకు తెలియదని మేడ్చల్‌ మెడిసిటీ ఆర్‌ఎంఓ నర్సింగ్‌రావు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో షకీల్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని, గుండెపోటు వచ్చిందని బంధువులు చెప్పడంతో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని, తర్వాత మృతదేహాన్ని అతని బంధువులు తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. కాగా షకీల్‌ మృతికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, వరవరరావులే కారణమని అతని రెండో భార్య ఆరోపించారు. నయీంతో కలిసి తన భర్త నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడిన తన భర్తపై ఎమ్మెల్యే, వరవరరావు కేసులు పెట్టి వేధించడం వల్లే మరణించాడని తెలిపారు.

No comments:

Post a Comment