ఆవిర్భావ వేడుకలకు
ప్రత్యేక ఆకర్షణ
ముస్తాబైన సంజీవయ్య పార్కు
హైదరాబాద్,
న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా దాదాపు
300 అడుగుల ఎత్తులో నిర్మించిన స్తూపం (టవర్)పై భారీ జాతీయ పతాకాన్ని నేడు
ఆవిష్కరించనున్నారు. నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కులో జరిగే
ఈ కార్యక్రమం ఆవిర్భావ వేడుకలకే తలమానికం కానుంది. ఇందుకోసం పార్కు,
హుస్సేన్‌సాగర్ పరిసరాలను సుందరీకరించారు. పార్కు గేటు నుంచి
పతాకావిష్కరణ చేసే టవర్ వరకూ నూతనంగా తారు రోడ్డు నిర్మించారు.
టవర్ సుమారు 303 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే
విమానయాన శాఖ అధికారుల సూచన మేరకు సుమారు 290 అడుగుల ఎత్తుకు
పరిమితం కావాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నుంచి
వచ్చిన నిపుణులు, కార్మికులు 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో
టవర్ పునాది నిర్మించారు. 100 టన్నుల బరువున్న విడిభాగాలు పూర్తిగా జోడించిన
అనంతరం ప్రత్యేకంగా రెండు క్రేన్ల ద్వారా టవర్‌ను దిమ్మెపైకి తీసుకొచ్చి
బోల్టులతో బిగించారు.ముస్తాబైన సంజీవయ్య పార్కు
భారీ జాతీయ జెండా సిద్ధం: ఈ స్తూపంపై ఆవిష్కరించేందుకు 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో భారీ జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన గొల్లమందల విజయ్‌కుమార్, కంభంపాటి సంజీవరావు, బొజ్జ పద్మావతిల పర్యవేక్షణలో 10 రోజులపాటు పదిమంది కార్మికులు దీనిని రూపొందించారు. అశోకచక్రం ముద్రించడానికే మూడు రోజులు పట్టినట్లు తయారీదారులు వివరించారు.
చుట్టూ నక్షత్ర వలయం: పతాకావిష్కరణ జరిగే స్తూపం చుట్టూ భారీ విస్తీర్ణంలో సుమారు 27 నక్షత్ర ఆకారాలను మొక్కల సహాయంతో తీర్చిదిద్దారు. ఇందులో 12 రాశులతోపాటు ప్రత్యేక మొక్కలను ఏర్పాటు చేశారు. స్తూపానికి పడమర వైపు ఉదయిస్తున్న సూర్యుడి విగ్రహం ఉంటుంది. పతాకావిష్కరణ జరగనున్న సంజీవయ్య పార్కును పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


No comments:
Post a Comment