Friday, 10 June 2016

దర్శకేంద్రుడిపై దాడికి యత్నం!

దర్శకేంద్రుడు కె. రాఘ వేంద్రరావుపై ఓ వ్యక్తి దాడికి యత్నిం చాడు. ఫిలింనగర్‌ వెంచర్‌-3లోని రాఘ వేంద్రరావు ఇంటివద్ద వీరంగం సృష్టించాడు. దర్శకుడిని దూషించి, దాడికి యత్నించడమే కాకుండా, ఆయన లగ్జరీ కార్లను ధ్వంసం చేశాడు. ‘‘శ్రీరామదాసు’ సినిమా కథ నాదే.....నన్ను గుర్తించకుండా అన్యాయం చేశావు....తీవ్రంగా నష్టపరిచావు’ అంటూ రాఘవేంద్రరావును దుర్భాషలాడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన పీ రవీంద్ర(28) గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఫిలింనగర్ వెంచర్‌-3లో నివసించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నివాసానికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వెళ్తుండగా రవీంద్ర కారును అడ్డగించి ఆయనను దుర్భాషలాడుతూ డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. దీంతో అక్కడున్న వాచ్‌మెన్  అడ్డుకున్నాడు. వాచ్‌మెన్‌ను కిందకు తోసేసి మళ్లీ రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు లాగేందుకు యత్నించాడు.
 
రాఘవేంద్రరావు కారు అద్దాలు దించి.. ‘ఎవరు నువ్వు.. ప్రాబ్లం ఏంటి’ అని ప్రశ్నించాడు. 2006లో తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి మీకు పంపించానని, అయితే సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టలేదంటూ.. ఎందుకలా చేశారని రాఘవేంద్రరావును రవీంద్ర నిలదీశాడు. ఆ సినిమా కథ జేకే భరవిదని, నీది కాదని రాఘవేంద్రరావు చెప్తుండగానే రవీంద్ర ఆయనను దూషిస్తూ.. ‘సినిమా కథ నాదైతే ఆయన పేరు ఎలా పెడతావ’ని ప్రశ్నించాడు. ఈ విషయంలో తనకు తీవ్ర అన్యాయం చేశావని ఆరోపిస్తుండగానే రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.
 
ఆ తర్వాత రవీంద్ర రాఘవేంద్రరావు నివాసంలోకి చొచ్చుకెళ్లాడు. అక్కడ ఉన్న ఆడి, బెంజి, సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై దాడి చేశాడు. ఇళ్లంతా భీభత్సం సృష్టిస్తున్న సమయంలో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావు బయటకు వచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు. ఆయనపై కూడా దాడి చేయడానికి యత్నిస్తున్న సమయంలో వాచ్‌మెన్ బాబు వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ప్రకాశ్‌రావు కూడా రవీంద్రను పట్టుకొని సెక్యూరిటీ గదిలో వేసి పోలీసులకు సమాచారం అందించారు.
 
బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు రవీంద్ర బుధవారం సాయంత్రమే రాఘవేంద్రరావు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన రాఘవేంద్రరావును భయభ్రాంతులకు గురి చేసింది.

No comments:

Post a Comment