Wednesday, 1 June 2016

రాష్ట్రమంతా అతలాకుతలం.. ఆ సినిమా కోసం కృష్ణ సాహసం!


శ్రీ విజయకృష్ణా మూవీస్ బేనర్‌పై కృష్ణ హీరోగా ఆయన సమర్పణలోనే విజయనిర్మల నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’. కోరికలు తీరకుండానే చనిపోయిన వాళ్ల ఆత్మలు ఎలా పరిభ్రమిస్తుంటాయి? తీరని కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయి? అనే ఇతివృత్తంతో రూపొందించిన విభిన్న చిత్రం ఇది. ఈ తరహా చిత్రాలు తీయడానికి ఇప్పుడైతే గ్రాఫిక్స్ అందుబాటులో ఉన్నాయి కానీ, ఆరోజుల్లో లేవు. అయినా ఆత్మ అస్పష్టంగా కనిపించడానికి ఓ ప్రయోగం చేశారు. ఒక వ్యక్తికి పొడుగాటి తెల్లగౌను తొడిగి కెమెరా ముందు నిలబెట్టారు. పలుకలుగా ఉన్న గాజు గ్లాసును కెమెరా ముందు అటు ఇటు తిప్పితే, ఎదురుగుండా ఉన్న తెల్లగౌను వ్యక్తి గాల్లో తేలుతున్న ఎఫెక్ట్ వచ్చింది.
 
ఇంత కష్టపడి సినిమా తీస్తే.. విడుదల తేదీ సమీపించాక రాష్ట్రంలో పెద్ద తుఫాను. విపరీతమైన గాలి, వానకు రాష్ట్రమంతా అతలాకుతలం అయిపోయింది. వరదల దెబ్బకు రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. అలాంటి సమయంలో ఈ సినిమానే కాదు... ఏ సినిమా కూడా విడుదల కాలేని పరిస్థితి. అయినా సరే తన సినిమా విడుదల కావాల్సిందేనని కృష్ణ పట్టుబట్టారు. ఆ రోజుల్లో కృష్ణకు పొడవైన ఇంపాలా కారు ఉండేది. అందులో కొన్ని ప్రింట్లు వేసుకుని కృష్ణ, విజయనిర్మల బయలుదేరారు. డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన చిత్ర నిర్మాత రఘునాథ్ స్టీరింగ్ ముందు కూర్చున్నారు. కొన్ని ప్రింట్లు బస్సులో పంపించారు. దారి పొడవునా వానే. అయినా సరే ఆగకుండా ప్రింట్లు ఇస్తూ, మధ్యాహ్నానికి విజయవాడ చేరారు. దీనివల్ల ఒక రోజు ఆలస్యంగా 1976 నవంబర్ 27న సినిమా విడుదల అయింది. సినిమా విడుదలకు ఏ హీరో కూడా చేయలేని సాహసం సూపర్‌స్టార్ కృష్ణ చేశారు. ప్రస్తుతం కొందరు హీరోలు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడమే అరుదు. అలాంటిది ఒక హీరో తన సినిమా విడుదల కోసం.. అదీ భారీ వర్షంలో ప్రింట్లు పంపిణీ చేయడం విశేషమే.
 

No comments:

Post a Comment