Friday, 10 June 2016

ఎయిరిండియా ఓ ఐరావతం.. కొనే నాథుడెవరు?

న్యూఢిల్లీ : ‘ఎయిరిండియాను విక్రయించాలని ప్రయత్నించినా ఎవరూ కొనేందుకు ముందుకు రానంత దారుణంగా ఆ సంస్థ పరిస్థితి దిగజారిపోయింది’. పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు స్వయంగా ఈ విషయం చెప్పారు. 50 వేల కోట్ల రూపాయల మేరకు నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల విక్రయానికి అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం అమ్మాలనుకున్నా దాని కొనే నాథుడెవరు అని ఆయన ప్రశ్నించారు. అలాగని ఆ సంస్థను ఆదుకునేందుకు ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ఇవ్వలేమని ఆయన అన్నారు. ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ 2007 సంవత్సరంలో విలీనం అయిన నాటి నుంచి సంస్థ రుణాల ఊబిలో కూరుకుపోయింది. యుపిఏ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన 30 వేల కోట్ల రూపాయల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై మనుగడ సాగిస్తోంది. ఈ దుస్థితికి అందరి వలె తాను ఎయిరిండియాను దుయ్యబట్టాలనుకోవడంలేదని, కానీ టర్న్‌ ఎరౌండ్‌ లక్ష్యాలు సాధించాలంటే మరింత సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని రాజు అన్నారు. ‘ఎయిరిండియా చక్కని సంస్థ, నేను సంస్థను చాలా ఇష్టపడతాను... అయినా ప్రజల సొమ్ము మాత్రం ధారాదత్తం చేయలేను’ అని ఆయన తేల్చి చెప్పారు. ఎయిరిండియా సిబ్బంది అందరూ ఒక టీమ్‌గా శ్రమించి పని చేసే ధోరణి పెరగాలని ఆయన అన్నారు. వారు టీమ్‌స్పిరిట్‌తో పని చేసిన చోట్ల చక్కని ఫలితాలు సాధించారు... అది కొరవడిన ప్రదేశాల్లో బోర్లా పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది ఎయిరిండియా నిర్వహణాపరమైన లాభాలు ఆర్జించినా దానిపై అధికార ప్రకటన ఏదీ లేదు. కాని ఆర్థిక స్థితి మెరుగుపడడంతో దేశీయ విమానయాన రంగంలోని భారీ అవకాశాలు చేజిక్కించుకునే లక్ష్యంతో రానున్న నాలుగేళ్ళలో కొత్తగా 100 విమానాలు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. అయితే నిర్వహణాపరమైన నష్టాలు రాకపోవడం ఎయిరిండియాకు వస్తున్న ఆదాయాలకు సాక్ష్యమని రాజు అన్నారు. అత్యున్నతమైన ఎత్తులకు దూసుకుపోయే సామర్థ్యం సంస్థకున్నదని తాను విశ్వసిస్తున్నానంటూ తాను ప్రభుత్వ రంగానికి వ్యతిరేకం కాదని, అలా ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నా ప్రభుత్వరంగానికే అండగా నిలవాలని భావించబోనని ఆయన స్పష్టం చేశారు. డిజిసిఏ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎయిరిండియా దేశీయంగా ఏప్రిల్‌ నెలలో 15.1 శాతం మార్కెట్‌ వాటాతో 11.98 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
 
విమాన చార్జీలను నియంత్రించలేం
విమానయాన సంస్థలు ఏకపక్షంగా చార్జీలను పెంచేస్తున్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నంత మాత్రాన విమానయాన చార్జీలను ప్రభుత్వం నియంత్రించబోదని రాజు స్పష్టం చేశారు. చార్జీలు ఎలా ఉండాలన్నది ఎయిర్‌లైన్స్‌ మధ్య పోటీయే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. విమానయాన చార్జీలను నియంత్రించడం వల్ల ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment