Monday, 15 August 2016

అనంత పద్మనాభుని బంగారు కుండలు మాయం...విలువ రూ.186 కోట్లు


కేరళలోని తిరువనంతపురంలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పద్మనాభ స్వామి ఆలయ సంపదకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి చెందిన నిధుల్లో 769 బంగారు కుండల ఆచూకీ గల్లంతైంది. వీటి విలువ సుమారు రూ.186 కోట్లు ఉంటుంది. మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ సుప్రీంకోర్టుకు ఈ మేరకు ఒక నివేదిక సమర్పించారు. రెండు వాల్యూమ్స్, ఐదు పార్టులతో వెయ్యి పేజీలతో ఈ నివేదక ఉంది. నివేదికలోని పలు అంశాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. జూలై 2002 వరకు 1 నుంచి 1,000 సంఖ్యలు గల కుండలు ఉపయోగంలో ఉన్నాయి. అనంతరం ఆ తరవాత సంఖ్యలు గల కుండలను ఉపయోగించారు. 2011 ఏప్రిల్‌ 1న 1988వ సంఖ్య కలిగిన కుండ బయటపడినట్లు రాయ్‌ చెబుతున్నారు. ఆ ప్రకారం బంగారుకుండల సంఖ్య కనీసం 1988 ఉండాలి. వీటిలో 822 కుండలను ఆలయ అలంకరణకు బంగారం కోసం కరిగించగా...ఇంకా కనీసం 1,166 బంగారు కుండలు ఉండితీరాలని నివేదక పేర్కొంది. అయితే నిపుణుల కమిటీ దృష్టికి 397 వరకు సంఖ్యలు గల కుండలు మాత్రమే వచ్చాయి. ఆ ప్రకారం మరో 769 బంగారుకుండల ఆచూకీ తెలియడం లేదు. 2007 ఆగస్టులో ట్రస్టు నిధుల్లోని వస్తువులన్నిటినీ ఫొటోలు తీసి ఆల్బమ్‌ చేయించారని, ఇప్పుడా ఆల్బమ్‌, ఫొటోల ఆనవాళ్లు ఎక్కడా లేవని నివేదిక పేర్కొంది. దేవాలయం పాలక కమిటీ బలహీనంగా ఉందని, ఆ స్థానంలో ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఆధ్వర్యంలో కొత్త కమిటీని నియమించాలని కూడా వినోద్‌ రాయ్‌ తన నివేదికలో న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వినోద్‌రాయ్‌ నివేదికపై విచారణ జరపనుంది.

No comments:

Post a Comment