ఠాగూర్
సినిమాలో శవాన్ని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తే కాపాడతామంటూ హడావుడి
చేసే డాక్టర్ల వైఖరి మీకు గుర్తుంది కదూ. సరిగ్గా అలాంటి ఘటనే
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన
గూటాల హేమలత (22)కు నెలలు నిండడంతో భర్త రమేష్, బంధువులు 29న కాన్పు కోసం
స్థానిక సీఈఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 30న ప్రసవం జరగగా మగబిడ్డను
ప్రసవించింది. వైద్య పరీక్షలనంతరం తల్లీబిడ్డ క్షేమమని వైద్యులు తెలిపారు.
రాత్రికి హేమలత ఆరోగ్యం బాగోలేదని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి
తీసుకువెళ్లమని ఆ వైద్యులు సూచించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరీక్షలు
చేసి ఆమె గంట క్రితమే మరణించిందని చెప్పడంతో భర్త, బంధువులు విస్మయం
చెందారు. హేమలత మృతదేహంతో సీఈఎం ఆసుపత్రి వద్ద బైఠాయించారు. ఆసుపత్రిలోనే
మరణించినా ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారని, వారి వైఫల్యాన్ని
కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటూ రమేష్ ఆరోపించారు.
ఆదివారం
మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. స్థానికులు, వివిధ పార్టీల నాయకులు
ఆసుపత్రి వద్దకు తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దక్షిణ మండల
డీఎస్పీ నారాయణరావు అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. పరిస్థితి
అదుపుతప్పకుండా పర్యవేక్షించారు. వైసీపీ నాయకులు గిరజాల బాబు, నక్కా
రాజబాబు, సీపీఎం, సీపీఐ నాయకులు కర్రి రామకృష్ణ, ఎస్‌ఎస్ మూర్తి,
ఎన్.భీమేశ్వరరావు, కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు,
బత్తిన ఏడుకొండలు తదితరులు బాధితుల తరపున యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు
జరిపారు. యాజమాన్యం రూ.2లక్షల నష్టపరిహారాన్ని బాధిత కుటుంబానికి
ఇవ్వడానికి అంగీకరించడంతో ఆందోళన విరమించారు.

No comments:
Post a Comment