Monday, 1 August 2016

ఓ యువతి... ఇద్దరు యువకుల జీవితంలో ఊహించని ఘటన !

ప్రేమ. ఈ రెండక్షరాల పదం పిచ్చివాళ్లను మంచివాళ్లుగా మారుస్తుంది. మంచివాళ్లను పిచ్చివాళ్లగా కూడా చేస్తుంది. అయితే ఈ ప్రేమపిచ్చి ముదిరితే ప్రేమికుడిని హంతకుడిగా కూడా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదేమో. ప్రేమించిన యువతి వేరే యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని ప్రియుడు భరించలేకపోయాడు. మాట్లాడొద్దని హెచ్చరించాడు. అతను తన స్నేహితుడని, తనతో మాట్లాడితే తప్పేంటని ఆమె వాగ్వాదానికి దిగింది. అతనెవరైనా సరే మాట్లాడటం తనకు నచ్చలేదని ఆమెకు చెప్పాడు. కానీ ఆమె మాత్రం నువ్వు వేరే, తను వేరే అంటూ ఆ స్నేహాన్ని కొనసాగించింది. ఇదే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్న ఆ యువకుడిపై ప్రియుడు పగ పెంచుకున్నాడు. ఆ యువకుడిని కిడ్నాప్ చేసి, ఐరన్ రాడ్‌తో కొట్టి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇలా ప్రేమోన్మాది క్షణికావేశం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఇంతకీ ఈ దారుణం ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది ?
 
బెంగళూరులోని జయనగర్‌లో యోగేష్ తన అక్కతో కలిసి నివాసముంటున్నాడు. యోగేష్ స్వస్థలం మగాదిలోని అత్తింజర్ గ్రామం. అయితే కొద్ది సంవత్సరాల క్రితం యోగేష్ బెంగళూరుకు వచ్చాడు. అక్క దగ్గర ఉంటూ బెంగళూరులోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అయితే రోజూలాగానే జూలై 19న యోగేష్ ఆఫీస్‌కు వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. రెండు రోజులుగా తమ్ముడి జాడ తెలియకపోవడంతో యోగేష్ అక్క పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. యోగేష్ కాల్‌డేటాను పరిశీలించారు. ఓ యువతి నంబర్‌కు ఎక్కువసార్లు ఫోన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ యువతిని పిలిపించి పోలీసులు విచారించారు. ఆ యువతి మరెవరో కాదు. యోగేష్ ఫేస్‌బుక్ ఫ్రెండ్. ఆమెది మైసూర్. యోగేష్ ఆమెతో చాలా చనువుగా ఉండేవాడు. ఆమెను కలిసేందుకు యోగేష్ మైసూర్ వెళ్లేవాడు. రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకునేవారు. అయితే వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం ఆమె ప్రియుడు ప్రతాప్‌ కంటపడింది. యోగేష్‌తో చనువుగా ఉండొద్దంటూ ఆమెకు చెప్పాడు.
 
కానీ యోగేష్ కేవలం స్నేహితుడు మాత్రమేనని, తప్పుగా భావించొద్దని చెప్పింది. అయినా ప్రతాప్ బుర్రను అనుమానం తొలిచేసింది. ఆ అనుమానం కాస్తా ఆవేశంగా మారి యోగేష్‌‌పై పగకు దారితీసింది. పక్కా ప్లానింగ్‌తో ఈనెల 19న సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న యోగేష్‌ను కిడ్నాప్ చేశారు. యోగేష్‌ను ఓ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లిన ప్రతాప్ ఇనుపరాడ్‌తో కొట్టి క్రూరంగా హతమార్చాడు. పోలీసు విచారణలో తేలిన వాస్తవమిది. అయితే ఈ హత్యలో యువతి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ప్రతాప్‌ను అదుపులోకి తీస్తున్నారు. అతనిని విచారిస్తున్న సమయంలో పోలీసులు వేరే పనిలో ఉండగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. ప్రతాప్ తండ్రి శివకుమార్ రాజ్య గోసంరక్షణ సమితి అధ్యక్షుడు కావడం గమనార్హం.

No comments:

Post a Comment