Sunday, 14 August 2016

సెల్‌ఫోన్ గురించి మీకు తెలియని ఐదు నిజాలు!


సెల్‌ఫోన్.. ఒక రకంగా చెప్పాలంటే ఇదో విప్లవం. అతి తక్కువ కాలంలో ప్రజలను పూర్తిగా ఆక్రమించుకున్న ఈ చిన్నపాటి పరికరం ప్రస్తుతం మనుషుల నిత్య జీవితంతో పెనవేసుకుపోయింది. చాలామంది సెల్‌ఫోన్‌ను తింటూ, సెల్‌ఫోన్‌ను తాగుతూ, సెల్‌ఫోన్‌ను చూస్తూ బతికేస్తున్నారు. జేబులో పట్టే ఈ చిన్న పరికరం ప్రపంచాన్ని చాలా చిన్నది చేసేసింది. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. అయితే సెల్‌ఫోన్ ఎంత ప్రయోజనకారో అంత ప్రమాదకారి అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాల్లో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం...
 
టాయిలెట్లో కంటే పదిశాతం క్రిములు :-
సైంటిఫిక్ డేటా ప్రకారం.. టాయిలెట్‌ సీటుపై కంటే తరచూ వాడే మొబైల్‌పై పదిశాతం అధికంగా క్రిములు ఉంటున్నట్టు తేలింది. దీనికి కారణం మొబైల్‌ను ఉపయోగించడం తప్ప క్లీన్ చేయాలనే ధ్యాస లేకపోవడమే. అలాగే వంటచేస్తున్నప్పుడు, ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు కూడా సెల్‌ను ఉపయోగించడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ పనులు చేస్తూ చేతులను శుభ్రం చేసుకోకుండా మొబైల్‌ను ముట్టుకోవడం వల్ల ఇకోలి అనే బ్యాక్టీరియా ఫోన్లపైకి చేరుతుంది. దీనివల్ల జ్వరం, వాంతులు, అతిసారం వచ్చే ప్రమాదముంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే సెల్‌ఫోన్‌ను పట్టుకునేముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
 
ఫెర్‌ఫెక్ట్ షాట్ కోసమని :-
సెల్‌ఫోన్లు వచ్చాక సెల్ఫీల పిచ్చి ప్రజల్లో విపరీతంగా పెరిగింది. సెల్ఫీల కోసం సరదాపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి గురించి తరచూ వార్తులు వస్తున్నాయి. ఇటీవల జర్మనీ టూరిస్ట్ ఒకరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మచుపిచులో సెల్ఫీ తీసుకునేందుకు ప్రమాదకర ప్రదేశానికి చేరుకుని పట్టుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోని గోక్టా వాటర్‌ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ అందులో పడి కొట్టుకుపోయింది. ఇటీవల తాజ్‌మహల్ వద్ద ఓ జపాన్ పర్యాటకుడు కూడా ఇలాగే మృతి చెందాడు. చెన్నైలో రైలు పట్టాలపై రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకోవాలనుకున్న నలుగురు యువకులు మృతి చెందారు. పెర్‌ఫెక్ట్ షాట్ కోసం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారే వీరంతా.
 
కాంట్రాక్ట్ కేన్సర్ :-
సెల్‌ఫోన్లు కేన్సర్ కారకమవుతున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది కొట్టిపడేయాల్సిన విషయం కాదు. ఇందులోని ఎలక్ట్రానిక్ తరంగాలు శరీరానికి హాని తలపెట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెదడుపై ఇవి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఇవి విడుదల చేసే రేడియో తరంగాల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. కాబట్టి సెల్‌ఫోన్‌ను అవసరం మేరకు ఉపయోగించడమే మేలు.
 
డ్రైవింగ్‌లో ఉండగా మాట్లాడడం :-
సెల్‌ఫోన్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో రోడ్డు యాక్సిడెంట్లే అధికం. ఫోనొచ్చినప్పుడు డ్రైవ్ చేస్తూనే మాట్లాడడం, టెక్స్ట్ మెసేజ్‌లు పంపడాన్ని చాలామంది ఏమాత్రం భయం లేకుండా చేస్తుంటారు. ఈ కారణంగా ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి 16 లక్షల రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్ల కారణంగానే సంభవిస్తున్నాయి. ఆరువేల మంది చనిపోతున్నారు. మరెందరో గాయాలపాలవుతున్నారు. కాబట్టి హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ప్రాణాలను నిలబెడుతుంది.
 
దెబ్బతినే కంటిచూపు :-
వైద్యులు, ముఖ్యంగా నేత్రవైద్య నిపుణులు ఇటీవల కాలంలో మొబైల్ వినియోగదారుల్లో గుర్తించిన ప్రధాన సమస్య కంటిచూపు. సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల, టెలివిజన్‌ను అధికంగా వీక్షించేవారి కంటిచూపు మందగిస్తున్నట్టు కనుగొన్నారు. మూడొంతుల మంది పైన పేర్కొన్న ఎలక్ట్రానిక్ ‌పరికరాలను రోజులో ఆరు గంటలకు పైగా వినియోగిస్తున్నట్టు తేలింది. ఫలితంగా కళ్లు ఎర్రబారడం, ఇరిటేషన్, పొడిబారడం, చూపు మందగించడం, నడుంనొప్పి, మెడనొప్పి, తలనొప్పి తదితర వాటి బారినపడుతున్నట్టు నేత్రవైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరం మేరకే వాడడం ఎంతోమేలంటూ సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment