కోయంబత్తూరు:
వైద్య చరిత్రలో ఇదో అరుదైన సంఘటన. ఏడాది వయసున్న పాపలో 3.5 కేజీల బరువున్న
పిండాన్ని వైద్యులు కనుగొన్నారు. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.
చిన్నారి పొట్టలో ఉన్న ఈ పిండం ఆమె రక్తాన్ని, పోషకాలను గ్రహిస్తూ ఆమె
అవయవాలపై ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
మెట్టుపాళ్యంలోని
శ్రీ గణపతి కృష్ణ ఆస్పత్రి వైద్యుల కథనం ప్రకారం.. ఈరోడ్‌కు చెందిన రాజు,
సుమతి దంపతులకు నిషా ఏడాది క్రితం జన్మించింది. సాధారణ పిల్లలతో పోలిస్తే
ఆమె పొట్ట ఎత్తుగా ఉన్నా తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. ప్రసవానికి
ముందు వారు రెగ్యులర్ చెకప్‌లకు వెళ్లకపోవడంతో ఆమెకు ప్రసవం చేసిన ప్రైమరీ
హెల్త్ సెంటర్ వైద్యులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని వైద్యులు
పేర్కొన్నారు. అయితే ఆహారం తీసుకోవడం, ఊపిరి పీల్చడంలో చిన్నారి ఇబ్బందులు
ఎదుర్కొంటుండడం, పొట్ట పరిమాణం బాగా పెరగడంతో అనుమానం వచ్చిన
తల్లిదండ్రులు పాపను ఈరోడ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. వారు
మెట్టుపాళ్యంలోని ఆస్పత్రికి రెఫర్ చేశారు.
పాపను
పరీక్షించిన వైద్యుడు డాక్టర్ విజయగిరి పాప కడుపులో సిస్ట్ కానీ ట్యూమర్
కానీ ఉన్నట్టు అనుమానించారు. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఎముకలు
కనిపించడంతో లోపల ఉన్నది పిండం అని నిర్ధారించుకుని ఆపరేషన్ చేసి లోపల ఉన్న
3.5 కేజీల పిండాన్ని తొలగించారు. అది పిండమేనని, ఎముకలతోపాటు కొంత శరీర
నిర్మాణం కూడా ఉందని డాక్టర్ విజయగిరి తెలిపారు. బేబీ కిడ్నీ,
ప్యాంక్రియాస్, ప్లీహంలో కొంతభాగానికి పిండం దాదాపు అతుక్కుని ఉండడంతో
ఆపరేషన్ కొంత క్లిష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి
కోలుకుంటోందని వైద్యులు వివరించారు.

No comments:
Post a Comment