- ‘ప్రెస్’ ముసుగులో అక్రమ దందాలు
- వాహనాలకు మీడియా స్టిక్కర్లతో తప్పించుకోడానికి ఎత్తులు
- సాఫీగా కొనసాగిస్తున్న చట్ట వ్యతిరేక పనులు
నారాయణఖేడ్ :
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి సంబంధం లేని వారు యథేచ్ఛగా
‘ప్రెస్’ ముసుగేసుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకూ
పెరిగిపోతున్నాయి. చట్ట వ్యతిరేక పనుల బండారం బయటపడకుండా ఉండడం కోసం
అక్రమార్కులు తాము వినియోగించే వాహనాలకు ప్రెస్(మీడియా) స్టిక్కర్‌లు
వేసుకోని సాఫీగా దందాలు కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్
నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దుల్లో ఉండడంతో అంతరాష్ట్ర
కార్యకలాపాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకునేందుకు ప్రెస్‌కు
సంబంధం లేని వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులను
తప్పించుకోడానికి ఎత్తులు వేస్తున్నారు. మద్యం, సరుకుల అక్రమ రవాణాను
పోలీసుల కళ్లుగప్పి చేస్తున్నారు.
గత
వారంలో ఎక్సైజ్ అధికారులు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాల
వేలం నిర్వహించారు. అందులో ఒక ద్విచక్ర వాహనానికి ప్రెస్ స్టిక్కర్ ఉంది.
2014లో అక్రమ మద్యంను రవాణా చేసిన కేసులో ఈ వాహనాన్ని సీజ్ చేశారు.
ఫిబ్రవరిలో నారాయణఖేడ్‌లో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో పట్టుబడిన
నిందితుడి వద్ద కూడా ప్రెస్ గుర్తింపు కార్డు లభించింది. ఇది కర్ణాటక
రాష్ట్రానికి సంబంధించింది. దీంతో పోలీసులు కూడా అప్పట్లో అవాక్కయ్యారు.
ప్రయాణికులను చేరవేసే వాహనాలను కూడా అధికారులు ఎవ్వరూ పట్టుకోకుండా ఉండడం
కోసం ప్రెస్ స్టిక్కర్‌లను వేస్తున్నట్లు తెలిసింది. గతంలో కూడా
విచ్చలవిడిగా వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లను వేస్తున్న విషయాన్ని స్థానిక
విలేకర్లు పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్పట్లో నియంత్రణ
చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కానీ ఆచరణలో మాత్రం
పెట్టలేకపోయారు. ఇప్పటికైన పత్రికలకు, మీడియాకు సంబంధం లేని వారి వాహనాలకు
ప్రెస్ స్టిక్కర్లు ఉండకుండా అధికారులు చర్య తీసుకోవాలని జర్నలిస్టులు
కోరుతున్నారు. కాగా ఈ విషయమై స్థానిక సీఐ సైదాను వివరణ కోరగా ప్రింట్ ,
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులుగా పని చేస్తున్న వారు మాత్రమే ప్రెస్
స్టిక్కర్లు వాహనాలకు వేసుకోవాలని తెలిపారు. మీడియా రంగానికి సంబంధం
లేనివారు తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లను వేసుకుంటే వెంటనే
తొలగించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని
హెచ్చరించారు. తనిఖీలు నిర్వహించే సమయంలో వీటిపై ప్రత్యేక దృష్టి
సారిస్తామని చెప్పారు.
No comments:
Post a Comment