అమలాపురం : వృద్ధాప్యంలో
ఉన్న తల్లిని ఆదరించలేకపోవడమే కాకుండా శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఓ
తనయుడి ఉదంతమిది. 72ఏళ్ల వరకు ఎవరిపైనా ఆధార పడకుండా ఓ పూరిపాకలో జీవనం
సాగించి, ఇక బతకడం కష్టం కావడంతో కొడుకును ఆశ్రయించింది. అక్కున
చేర్చుకున్న 24 గంటలు తిరక్కుండానే అమ్మను శ్మశానవాటికలో వదిలేసి తనదారి
తను చూసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని మున్సిపల్
కాలనీని ఆనుకుని ఉన్న శ్మశానవాటికలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి
పోలీసులకు సమాచారం అందించడంతో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆమెకు ఒక కొడుకు
మాత్రమే ఉన్నాడు. అయితే ఆ స్థల యజమానులు విధిలేని పరిస్థితిలో ఇళ్లు ఖాళీ
చేయమని సూచించారు. దాంతో ఆమె రాజమహేంద్రవరంలో నివాసముంటున్న కొడుకు
హనుమంతరావుకు ఫోనులో సమాచారం అందించింది. అక్కడి నుంచి వచ్చిన కుమారుడు
తల్లిని తీసుకుని బుధవారం రాజమహేంద్రవరం వెళ్లాడు. అయితే కుటుంబ సభ్యులు
సత్యవతిని ఇంట్లోకి అనుమతించేది లేదని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో
కుమారుడు తిరిగి అమలాపురం చేరుకున్నాడు. వృద్ధాశ్రమాల కోసం వెతికాడు. అవి
లేకపోవడంతో రాత్రి 9 గంటల వరకు ఆమెను పట్టణ పరిసరాల్లో ఆటోలో తిప్పి చివరకు
శ్మశానవాటికలో వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి ఆమెను
రాత్రికి ఆదరించారు. గురువారం ఉదయమే పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు
సమాచారం అందించారు. సీఐ అక్కడికి వెళ్లి సత్యవతి పరిస్థితిని అడిగి
తెలుసుకుని కొత్త దుస్తులు ఇచ్చి ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
నిర్వహించిన అనంతరం కరక్కాయపేటలోని వృద్ధాశ్రమంలో ఆమెకు తాత్కాలిక వసతి
కల్పించారు. కన్నతల్లనే మమకారం కూడా చూడకుండా బతికుండగానే శ్మశానవాటికలో
వదిలివెళ్లిన కొడుకు హనుమంతరావుపై సెక్షన్-24 ఆఫ్ ది మెయింట్‌నెన్స్,
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం-2007 కింద కేసు నమోదు చేసి విచారణ
చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

No comments:
Post a Comment