Tuesday, 9 August 2016

భయపెట్టడం..వినకపోతే..చంపడమే..నయీం క్రైమ్‌స్టైల్‌

భువనగిరి : బాయ్‌సాబ్‌ మాటంటే.. హడల్‌.. ఫోన్ చేస్తాడంటే వెన్నులో వణుకే.. ఆయన చెప్పింది వినాల్సిందే. ఎవరికి ఎందుకు పిలుపువస్తుందో తెలియదు. తాము చేసిన తప్పేమిటో తెలియదు.ఎందుకు చెల్లించాలో... అంతకంటే తెలియదు.. కాని ప్రాణాలపై తీపి, కుటుంబసభ్యులపై మమకారంతో.. లక్షలు, కోట్లు సమర్పించుకున్న వారు భువనగిరి, పరిసర పట్టణాల్లో వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుసుస్తోంది. సెటిల్‌మెంట్‌ అయినా లేక వసూళ్లు అయినా మొదట చెబుతాడు. వినకుంటే బెదిరింపులు, ఆపై చంపడమే... అందుకే గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్ నేర కార్యకలాపాల తీరు.. గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్ తన అనుచరగణంలో దాదాపు 20 ఏళ్లుగా భువనగిరి, హైదరాబాద్‌ శివారుల్లో బలవంతపు వసూళ్లు, భూదందాలు, సెటిల్‌మెంట్‌ వ్యవహారాలు సాగిస్తున్నాడు.
 
గ్యాంగ్‌స్టర్‌ నయీంకు ఇటీవల కాలంలో రూ.50లక్షలు సమర్పించుకున్న ఓ సాధారణ వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం... ఆయా ప్రాంతాల్లో వందల సంఖ్యలో గల నయీం అనుచరులు ఎవరు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అనేది కనిపెడుతుంటారు. వీరు స్థానికంగా గల ముఖ్య అనుచరులకు సమాచారం అందిస్తే అక్కడి నుంచి సదరు వ్యక్తికి బాయి రమ్మంటున్నాడని పిలుపువస్తుంది. ఎందుకు ఏమిటీ అంటే నీ వద్ద ఇన్ని లక్షలు తీసుకురమ్మన్నాడు అనే డిమండ్‌ వినిపిస్తుంది.. నా దగ్గర అంత మొత్తం లేదంటే అయితే బాయి దగ్గర మాట్లాడు అంటారు. రెండు మూడు రోజుల తర్వాత సదరు వ్యక్తి ఇంటికి అనుచరులు వచ్చి బయలుదేరమనే హుకుం జారీ అవుతుంది. స్థానిక అనుచరులతో హైదరాబాద్‌ నగర శివారుకు బయలుదేరిన వెంటనే మరో వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి నగరంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు, శివారు ప్రాంతాల్లోనే రెండు, మూడు గంటలు ప్రయాణం సాగించిన తర్వాత గుర్తుతెలియని ప్రదేశంలో నయీం ముందు ప్రవేశపెడుతారు. అత్యాధునిక ఏకే 47 తుపాకులు ధరించిన లేడీ బాడీగార్డుల మధ్యన చేతిలో తుపాకీతో ఉండే గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మొదట మంచిగా మాట్లాడినట్లే మాట్లాడి మా అవసరాలకు సొమ్ముకావాలని డిమాండ్‌ వినిపిస్తుంది. అంతలేదు.. నేను ఏం పాపం చేశాను.. ఎందుకు ఇవ్వాలంటే బెదిరింపులు ప్రారంభమైతాయి.. నీ ఆస్తిపాస్తులు ఇవి.. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు.. ఏమేమి చేస్తున్నారో తెలుసు అంటూ.. ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని బెదిరిస్తాడు.. అంత ఇచ్చుకోలేము.. అంతో కొంతో ఇస్తామంటే మరింత రెచ్చిపోతాడు. ఒక్కో సందర్భంలో చేయి కూడా చేసుకుంటాడు. దీంతో భయందోళనలకు గురై.. అడిగిన కాడికి ఇస్తామని ఒప్పుకుని వస్తారు.. వాయిదా ప్రకారం అనుచరులు ఇంటికి వస్తారు.. డబ్బు ఇచ్చామని చెప్పడానికి మళ్లీ రెండు.. మూడు గంటలు కారు ప్రయాణం చేసిన తర్వాత లైన్‌లోకి వస్తాడు.. అప్పుడు ఆయన సరే అని చెబుతేనే సదరు వ్యక్తి గుండెల నిండా ఊరిపి పీల్చుకుంటారు.. లేదంటే.. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అర్ధం కాక దినదినదిన గండంగా గడప వల్సిందేనని నయీమొద్దీన భాదితుడి తన అనుభవాన్ని వివరించారు.

No comments:

Post a Comment