Thursday, 25 August 2016

సింగ‌పూర్‌లో డ్రైవ‌ర్ లేని ట్యాక్సీలు

ప‌్ర‌పంచంలోనే తొలిసారిగా డ‌్రైవ‌ర్ లేని ట్యాక్సీలు సింగపూర్ రోడ్ల‌పై ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. బుధ‌వారం వీటిని విజ‌యవంతంగా టెస్ట్ డ్రైవ్ చేసిన నిర్వాహ‌కులు.. గురువారం నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను రైడ్‌కు తీసుకెళ్తున్నాయి. నుటొనోమి అనే కంపెనీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను ఆప‌రేట్ చేస్తోంది. ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ కారు ఫ్రీరైడ్‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే గూగుల్‌, వోల్వోలాంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను రోడ్ల‌పై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తున్నా.. ప‌బ్లిక్ రైడ్ ఆఫ‌ర్ చేసిన తొలి కంపెనీ త‌మ‌దేన‌ని నుటొనోమి చెబుతోంది. 
ప్ర‌స్తుతానికి ఆరు చిన్న కార్ల‌ను సింగ‌పూర్ రోడ్ల‌పై ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ఏడాది చివ‌రినాటికి వాటిని 12కు పెంచ‌నున్నారు. 2018 క‌ల్లా సింగ‌పూర్ మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఉండాల‌న్న‌ది ఈ కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌పంచంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాలు కూడా త‌మ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను ఎంపిక చేసుకుంటాయ‌ని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ప్ర‌స్తుతానికి సింగ‌పూర్‌లో 6.5 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప్రాంతంలో మాత్ర‌మే ఈ కార్లు తిర‌గ‌నున్నాయి. నుటొనోమి కంపెనీ నుంచి ఆహ్వానం పొందిన ప్ర‌యాణికుల‌కే ఈ స‌ర్వీస్ ఉంటుంది. ఇప్ప‌టికే వంద‌ల మంది ఫ్రీరైడ్ కోసం అప్లై చేసుకున్నార‌ని కంపెనీ చెప్పింది. 

ఈ కార్ల‌లో రాడార్‌లా ప‌నిచేసే ఆరు సెట్ల లిడార్ల‌ను అమ‌ర్చారు. ఇవి కారుకు అన్నివైపులా రోడ్ల‌పై ఉన్న ప‌రిస్థితుల‌ను లేజ‌ర్ సాయంతో గుర్తిస్తాయి. ఇందులో ఒక‌టి కారు పైభాగంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. డాష్‌బోర్డులో రెండు కెమెరాలు అమ‌ర్చారు. ముందు వ‌చ్చే అడ్డంకులు, సిగ్న‌ళ్ల‌లో మార్పుల‌ను ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ప్ర‌స్తుతానికి ఫ్రీరైడ్ అందిస్తున్నా.. త‌ర్వాత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. నుటొనోమీ కంపెనీ సీవోవో మాట్లాడుతూ.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు సింగ‌పూర్‌లో మొత్తం కార్ల సంఖ్య‌ను 9 ల‌క్ష‌ల నుంచి 3 ల‌క్ష‌ల‌కు త‌గ్గిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు.

No comments:

Post a Comment