Friday, 5 August 2016

వేయి స్తంభాలు కాదు.. వేయి కిటికీల నగరం

బీరట్: వేయి స్తంభాల గుడి అనగానే ఠక్కున చారిత్రక నగరం వరంగల్ గుర్తొస్తుంది. ఆ వెంటనే కాకతీయులు గుర్తొస్తారు. వరంగల్‌లో వారు నిర్మించిన రుద్రేశ్వరస్వామి ఆలయంలోని వెయ్యి స్తంభాలు(థౌజండ్ పిల్లర్స్) జ్ఞప్తికి వస్తాయి. అలాగే సౌత్ సెంట్రల్ అల్బేనియాలోని బీరట్ నగరానికి కూడా ఇటువంటి ప్రత్యేకతే ఉంది. ఆ ప్రత్యేకతే బీరట్‌కు యునెస్కో గుర్తింపు తెచ్చిపెట్టింది. విలక్షణ శైలిలో కనిపించే ఇక్కడి ఇళ్లు పెద్ద పెద్ద కిటికీలతో దర్శనమిస్తాయి. ప్రతీ ఇంటికీ కనీసంగా6-10 కిటికీలు ఉంటాయి. అందుకే ఈ నగరం థౌజండ్ విండోస్(వేయి కిటికీల)నగరంగా ఖ్యాతికెక్కింది. ఒట్టామన్ శకంలో ఈ నగరం ముఖ్య పట్టణంగా విలసిల్లేది. ఇక్కడి ఇళ్ల నిర్మాణం ఆశ్చర్యపరుస్తుంది. నిర్మాణంలో అవలంబించిన ఆర్కిటెక్చర్ విధానం మంత్రముగ్ధులను చేస్తుంది.
 
13వ శతాబ్దం నాటి బీరట్ కోట ఉన్న కొండపై ఉన్న ఈ ఇళ్లన్నీ 18, 19వ శతాబ్దాల నాటివే. బాల్కన్ శైలిలో వీటిని నిర్మించారు. ప్రతీ ఇల్లు రెండంతస్తులు ఉంటుంది. రెండో అంతస్తుకు తప్పకుండా అందరూ తెల్లరంగునే వేయడం విశేషం. అలాగే పెద్దపెద్ద కిటికీలు ఉంటాయి. కొండ ప్రాంతం కావడం, ఇళ్ల నిర్మాణం దగ్గర ఉండడంతోనే ఈ కిటీల ఏర్పాటుకు ప్రధాన్యమిచ్చినట్టు చెబుతారు. ఎటు చూసినా అందంగా కనిపించే రెండంతస్తుల ఇళ్లు.. పెద్ద పెద్ద కిటీలు కనిపించడంతో ఈ నగరం కాస్తా.. ‘సిటీ ఆఫ్ థౌజండ్ విండోస్’(వేయి కిటికీల నగరం)గా ఫేమస్ అయిపోయింది.

No comments:

Post a Comment