Sunday, 29 May 2016

హైదరాబాద్‌పై బెంగళూరు లక్ష్యం 209

అర్ధశతకం బాదిన వార్నర్‌
మెరిసిన యువరాజ్‌, బెన్‌ కటింగ్‌
తేలిపోయిన బెంగళూరు బౌలర్లు
బెంగళూరు: ఐపీఎల్‌-9లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (69: 38 బంతుల్లో 8×4, 3×6) మరోసారి మెరుపు అర్ధశతకం బాదేయగా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (28: 25 బంతుల్లో 3×4, 1×6) చక్కటి సహకారం అందించడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేయగలిగింది. ప్రమాదకరంగా మారిన ఈ ఓపెనింగ్‌ జోడిని ధావన్‌ను ఔట్‌ చేయడం ద్వారా స్పిన్నర్‌ చాహల్‌ విడదీశాడు. దీంతో 63 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ధావన్‌ ఔట్‌ అనంతరం వచ్చిన హెన్రిక్స్‌ (4) తడబడినా వార్నర్‌ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లు బాదేశాడు. అతనికి హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (38: 23 బంతుల్లో 4×4, 2×6) కూడా తోడవడంతో హైదరాబాద్‌ స్కోరు బోర్డు పరుగులెత్తింది. కానీ జట్టు స్కోరు 125 వద్ద కెప్టెన్‌ వార్నర్‌ ఔటవగా.. తర్వాత వచ్చిన దీపక్‌ హుడా (3), నమన్‌ ఓజా (7), బిపుల్‌ శర్మ (5) నిరాశపరచడంతో సన్‌రైజర్స్‌ తడబడినట్లు కనిపించింది. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన వాట్సన్‌ బౌలింగ్‌లో బెన్‌ కటింగ్‌ (39 నాటౌట్‌: 15 బంతుల్లో 3×4, 4×6) వరుస బౌండరీలు బాదేయడంతో హైదరాబాద్‌ 208 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌ జోర్దాన్‌ 3, శ్రీనాథ్‌ అరవింద్‌ 2, చాహల్‌ ఒక వికెట్‌ తీశారు.


No comments:

Post a Comment