Sunday, 29 May 2016

ఫైనల్‌ సవాల్‌లో గెలిచేదెవరు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ప్రత్యర్థి ఎవరైనా ఈ కెప్టెన్ల కళ్లలో ఇసుమంతైనా బెరుకు కనిపించదు.. జట్టును ముందుండి నడిపించాలనే కసి తప్ప. ఒకరు క్లాస్‌ బ్యాటింగ్‌తో ఫీల్డర్ల మధ్యలోంచి చాకచక్యంగా బంతిని బౌండరీకి తరలించగల నేర్పరి. మరొకరు విధ్వంసక బ్యాటింగ్‌తో అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపేయగల హిట్టర్‌. భిన్న ధ్రువాలుగా కనిపించే ఈ ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రస్తుతం ఒక్కటే.. తాజా ఐపీఎల్‌లో తమ జట్టును విజేతగా నిలపడం. కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌, వాట్సన్‌ తదితర హిట్టర్లతో తుదిపోరుకు కాలు దువ్వుతుండగా.. డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, హెన్రిక్స్‌లతో బెంగళూరును ఢీకొట్టబోతోంది. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో ఈ పోరుపై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా తొమ్మిదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఓ కొత్త విజేత అవతరించినట్లే..!
పరుగుల యంత్రంలా ‘కోహ్లీ’ సేన
తాజా ఐపీఎల్‌ ఆరంభం వరకూ విరాట్‌ కోహ్లీకి టీ20 శతకం అందని ద్రాక్షగా ఉండేది. కానీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన కోహ్లీ ఏకంగా నాలుగు శతకాలు, ఆరు అర్ధశతకాలు బాది మొత్తం 919 పరుగులతో టోర్నీలోనే టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ విధ్వంసంతోనే ప్లేఆఫ్‌ ఆశలు లేని దశ నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా ఫైనల్‌కు చేరింది. అతనితో పాటు జట్టులో క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియర్స్‌, షేన్‌ వాట్సన్‌ లాంటి అనుభవజ్ఞులైన హిట్టర్లుండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. కేఎల్‌ రాహుల్‌, సచిన్‌ బేబీ మధ్య ఓవర్లలో విలువైన ఇన్నింగ్స్‌ ఆడగలమని ఇప్పటికే నిరూపించుకున్నారు. బౌలింగ్‌లో క్రిస్‌ జోర్దాన్‌, వాట్సన్‌, చాహల్‌, అబ్దుల్లా, స్టువర్ట్‌ బిన్నీ సత్తా చాటుతున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియం అంటేనే భారీ స్కోర్లతో విరుచుకుపడే కోహ్లీ సేనను హైదరాబాద్‌ బౌలర్లు నిలువరించడంపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.
బ్యాటింగ్‌లో ‘వార్నర్‌’.. బౌలింగ్‌లో అందరూ
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ బలం, బలహీనత కెప్టెన్‌ డేవిడ్‌ వార్నరే అనడంలో అతిశయోక్తి కాదు! వార్నర్‌ ముందుండి నడిపించగలిగితే హైదరాబాద్‌ తిరుగులేని విజయాలను అందుకోగలదని ఇప్పటికే నిరూపితమైంది. 16 మ్యాచ్‌లాడిన వార్నర్‌ 779 పరుగులతో విరాట్‌ కోహ్లీ తర్వాత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. అతనికి తోడు శిఖర్‌ ధావన్‌, యువరాజ్‌ సింగ్‌, హెన్రిక్స్‌, దీపక్‌ హుడా, బిపుల్‌ శర్మ బ్యాట్‌ ఝళిపించగలిగితే హైదరాబాద్‌ అలవోకగా భారీ స్కోరు సాధించగలదు. కానీ వార్నర్‌ తొందరగా పెవిలియన్‌ చేరితే టాప్‌ ఆర్డర్‌ ఒత్తిడిలో పడే బలహీనతను ఫైనల్లోనైనా హైదరాబాద్‌ అధిగమించాల్సి ఉంది. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉందనే చెప్పవచ్చు. ముస్తాఫిజుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బరీందర్‌ శరణ్‌, బెన్‌ కటింగ్‌, హెన్రిక్స్‌తో పేస్‌ దళం అద్భుతంగా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ అనూహ్య విజయాలను అందుకుంటోంది. కోహ్లీ వదలడు.. ఇప్పుడు వార్నర్‌ కూడా
మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా క్రీజులో కుదురుకుంటే జట్టుకు విజయం అందించే వరకూ పట్టువదలని తత్వం విరాట్‌ కోహ్లీది. ప్రస్తుతం వార్నర్‌ కూడా ఇలాంటి స్థితికే చేరుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో వార్నర్‌ చివరి వరకూ పోరాట పటిమతో జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. దీంతో కెప్టెన్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసక పోరు తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌, వ్యూహాలు రచించడంలో ఇప్పటికే ఇద్దరూ ఆరితేరిపోవడంతో ఎవరిపై ఎవరు పైచేయి సాధించి విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది!

No comments:

Post a Comment