Monday, 30 May 2016

స్మార్ట్‌ఫోన్లపై మహిళలకే మోజెక్కువట!

వారే ఎక్కువగా బానిసలవుతున్నారట 
 సియోల్‌: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరి చేతివేళ్లు టచ్‌స్క్రీన్‌పైనే ఉంటున్నాయి. అవసరమున్నా లేకపోయినా.. మనలో చాలా మందికి పదేపదే ఫోన్‌ను చూసుకోవడం అలవాటు. ఇక గంటలు గంటలు ఆన్‌లైన్‌ సర్ఫింగ్‌ చేయడం సరేసరి. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తూ.. వాటికి బానిసైన వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణకొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ప్రొఫెసర్‌ చాంగ్‌ జే-యియోన్‌ ఆధ్వర్యంలో దక్షిణకొరియాలోని ఆరు కాలేజీలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. 52 శాతం మహిళలు తాము రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పురుషుల్లో ఈ సంఖ్య 29.4శాతంగా ఉంది.
అంతేగాక.. రోజుకు ఆరుగంటలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే మహిళలు 23శాతం ఉన్నారట. అయితే పురుషుల్లో 11 శాతం మాత్రమే 6గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. 37 శాతం మహిళలయితే.. వేరే వారితో మాట్లాడుతున్నా, నడుస్తున్నా పదేపదే ఫోన్‌ చూసుకోవడం అలవాటని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకపోతే అభద్రతాభావం వెంటాడుతుంటుందని 20శాతం మహిళలు చెప్పినట్లు సర్వేలో తేలింది. కాగా.. పురుషుల్లో ఈ సంఖ్య 8.9 శాతం. చాలా మంది మహిళలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌మీడియా కోసమే స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment