Sunday, 8 May 2016

ఉద్యోగం టీ టేస్టర్‌...

    పూర్వం ఖాళీ  సమయాల్లో చేసే పనులకు అంటే హాబీగా చేసే వాటికి.. వ్యాపార, వృత్తులకు మధ్య సన్నటి గీత ఉండేది. కాని ఇప్పుడా గీత పూర్తిగా చెరిగిపోయింది. అందుకే కాబోలు ఆరామ్‌సే.. ఆడుతూపాడుతూ చేసే పనులను కెరీర్‌లుగా ఎన్నుకుంటున్నారు నేటి తరం. ఉదాహరణకి తినడం, నిద్రపోవడం, టీ, కాఫీల వంటి వాటిని రుచి చూడడం వంటివి కూడా డబ్బు సంపాదించుకునే వాటిలోకి చేరిపోయాయి. అలాంటి ఒక కెరీరే ‘టీటేస్టర్‌’.        
  టీ టేస్టర్లు కేవలం టీ రుచిని చెప్పడమే కాకుండా టీల మధ్య ఉండే తేడాను గుర్తిస్తారు. ఏ స్థాయి వరకు మరిగిస్తే టీకి కరెక్ట్‌ రుచి వస్తుంది అనేది కూడా చూస్తారు. టీ నాణ్యతను పెంచడంలో టేస్టర్లది కీలక పాత్ర. మీక్కూడా తేనీటి సేవనం ఇష్టమా..? అయితే మీరు కూడా ఇందులో కెరీర్‌ను మొదలుపెట్టొచ్చు. మంచి వేతనాలు అందుకోవచ్చు. టీ టేస్టింగ్‌ అనేది ఒక కళ. కాకపోతే దీనికి సైన్సుతో కూడిన సపోర్టు అవసరం. సంప్రదాయ టీ టేస్టర్లు అనుభవంతో పనిచేస్తే... ఆధునిక టీ టేస్టర్లు సైంటిఫిక్‌ మెథడాలజీతో పయనిస్తున్నారు.
కొన్ని టీలు శరీరాన్ని, మెదడుని చురుకుగా ఉంచితే, మరికొన్ని టీలు ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉంచుతాయి. మెడిటేషన్‌ ప్రభావాన్ని ఒక కప్పు టీతో అందిస్తాయన్నమాట. ఒక్క టీ ఇన్ని పనులు చేస్తుంది కాబట్టే టీ టేస్టర్ల మీద బోలెడు బాధ్యత ఉంటుంది.
రుచిమొగ్గలు ముఖ్యం
         టీ టేస్టర్‌గా చేయాలంటే బాటనీ, ఫుడ్‌ సైన్సెస్‌, హార్టికల్చర్‌ వంటి రంగాల్లో గ్రాడ్యుయేషన్‌ ఉండాలి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కూడా అవసరం.
  • టీ శాంపిల్స్‌ని సరిగా అంచనా వేసేందుకు టీ టేస్టర్ల రుచిమొగ్గలు చురుకుగా పనిచేయాలి. అదెంతగా అంటే టీకి రుచినిచ్చే ఆల్కలాయిడ్స్‌ని అలా రుచి చూడగానే ఇలా పట్టేట్టుగా. ఘ్రాణనాడులు చురుకుగా ఉంటేనే టీ వాసన సరిగా చెప్పగలుగుతారు.
  • అలాగే టీ ప్లాంటేషన్‌లో మొక్కల పెంపకం, ఉత్పత్తి, ప్రాసెస్‌, రకాలు, గ్రేడ్స్‌ వంటి వాటి గురించి కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి.
  • పొగతాగడం, మద్యపాన సేవనం, ఘాటైన మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను తినే అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
  • తోటల్లో పనిచేసేవారితో పనిచేయించాలి కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉండాలి. అలా ఉంటేనే ప్లాంటేషన్‌ లేదా ఫ్యాక్టరీ మేనేజర్లుగా మనగలగుతారు.
  • టీ మార్కెట్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. దానికి సంబంధించిన విషయాల పట్ల పరిజ్ఞానం ఉండాలి. అలాగే ఒత్తిడితో కూడిన పనిని చేపట్టేందుకు వెనుకడుగు వేయకూడదు.
టీ టేస్టర్‌ కోర్సులు అందిస్తున్న ఇనిస్టిట్యూట్‌లు:
  • అస్సాం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలోని టీ హజ్బెండరీ అండ్‌ టెక్నాలజీ విభాగం.
  • కోల్‌కతాలోని డిప్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌
  • డార్జిలింగ్‌లోని డార్జిలింగ్‌ టీ రీసెర్చి అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌
  • డార్జిలింగ్‌లోని నార్త్‌ బెంగాల్‌ యూనివర్సిటీ
  • కోల్‌కతాలోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ స్టడీస్‌ (బిఐఎమ్‌ఎఫ్‌ఎస్‌)
  • బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌
సంప్రదాయ డిగ్రీతో పనిలేదు
         టీ టేస్టర్‌ అయ్యేందుకు సంప్రదాయ డిగ్రీ అక్కర్లేదు. టీ టెస్టింగ్‌ టెక్నిక్స్‌ను, శాస్ర్తీయ పరిజ్ఞానాన్ని పెంపొందించే సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి మూడు నెలలు. అదే డిప్లొమా అయితే ఏడాది కాల వ్యవధి ఉంటుంది. టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తే కనుక ఆ అనుభవం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఫుడ్‌ సైన్సెస్‌, హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌, బాటనీ సబ్జెక్టుల్లో డిగ్రీ ఉంటే దీని గురించి చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు.
అంతర్జాతీయంగా కెరీర్‌
         ప్లాంటేషన్‌, టీ ట్రేడ్‌లలో అంతర్జాతీయంగా మంచి కెరీర్‌ ఉంటుంది. చాలా వరకు కంపెనీలు తాము తయారుచేసే టీపొడి నాణ్యతా విలువల్ని తెలుసుకునేందుకు, బ్లెండ్స్‌ కోసం టీ టేస్టర్ల మీదే ఆధారపడతాయి. టీ టేస్టింగ్‌ అనేది ఉద్యోగం చేస్తూ నేర్చుకునే పని. మానుఫాక్చరింగ్‌ కంపెనీలు, బ్రోకర్లు, బయ్యర్లు టీ టేస్టర్లకు ఉద్యోగావకాశాలు ఇస్తున్నారు.

  • మానుఫాక్చరింగ్‌ కంపెనీలో పనిచేసే టేస్టర్లు తేయాకుల ప్రొడక్షన్‌ ప్రాసె్‌సలో లోపాలను అంచనా వేస్తారు. తేయాకుల రంగు, సైజ్‌ చూసి అవి ఫర్మెంటెడ్‌వా లేక మంట మీద ఎండపెట్టారా అనేది గమనిస్తారు. అవసరమనుకుంటే వాటిని తిరిగి ఫ్యాక్టరీకి పంపించి సమస్యను పరిష్కరిస్తారు.
  • టీ టేస్టర్లు గార్డెన్లతో సమన్వయం చేస్తుండాలి. ఎగుమతి, దిగుమతులను చూసుకోవాలి. పరిశోధకులకు రుచి, ఆర్థిక వెసులుబాటు వంటి అంశాల్లో సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. బ్రోకర్‌ ఆఫీసుల్లో పనిచేసే టేస్టర్లు సలహాదారుల పాత్ర పోషిస్తారు. అలాగే మార్కెట్‌ ట్రెండ్స్‌ గురించి మానుఫాక్చర్‌లకు సమాచారం అందిస్తుంటారు.
  • కొనుగోలు సంస్థల్లో పనిచేసే టేస్టర్లు నాణ్యత విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఏం జరుగుతుందో తెలుసుకుని చెప్తుంటారు. యువతలో ఎక్కువమంది టేస్టర్లుగా కెరీర్‌ను ఎంపికచేసుకోవడానికి కారణం రొటీన్‌గా కాకుండా ఉండే ఉద్యోగం కావడం ఒక కారణం అయితే అధిక వేతనం పొందడం మరోటి.
  • అనుభవజ్ఞులైన టీ టేస్టర్లు సొంతంగా కన్సల్టెన్సీ సర్వీసులు కూడా నిర్వహిస్తుంటారు. వాటి ద్వారా ఎలాంటి రకాల తేయాకు మొక్కలు నాటాలి, కొత్త వెరైటీలు, అవి లభించే ప్రదేశాల వంటి వివరాలు అందిస్తుంటారు. దాంతోపాటు కంపెనీలకు ఉద్యోగులను చేర్చడం, శిక్షణ ఇవ్వడం వంటివి కూడా చేస్తుంటారు. తోటల్లో పనిచేసేవాళ్లకి అందే కాంపన్సేషన్‌, బెనిఫిట్స్‌, ఇన్‌సెంటివ్స్‌ వంటి అంశాలను కూడా పరిశీలిస్తుంటారు.
వేతనం ఆకర్షణీయం
           మంచి వేతనం, ఆకర్షణీయమైన పర్క్స్‌ ఉంటాయి. వాటితో పాటు జీవన విధానం కూడా చాలా బాగుంటుంది. బంగ్లా, కారు వంటి సౌకర్యాలు ఉంటాయి. ట్రైనీ టేస్టర్లకు మంచి వేతనం ఉంటుంది. సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ అయితే నెలకు పాతికవేల వరకు, అదే స్పెషలైజ్డ్‌ ప్రొఫెషనల్స్‌ అయితే నెలకి నలభై వేల నుంచి యాభైవేల రూపాయల వేతనం ఉంటుంది.
  • పొగతాగడం, మద్యపాన సేవనం, ఘాటైన మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను తినే అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
  • టీ శాంపిల్స్‌ని సరిగా అంచనా వేసేందుకు టీ టేస్టర్ల రుచిమొగ్గలు చురుకుగా పనిచేయాలి. అదెంతగా అంటే టీకి రుచినిచ్చే ఆల్కలాయిడ్స్‌ని అలా రుచి చూడగానే ఇలా పట్టేట్టుగా. ఘ్రాణనాడులు చురుకుగా ఉంటేనే టీ వాసన సరిగా చెప్పగలుగుతారు.

No comments:

Post a Comment