Sunday, 29 May 2016

తొలి పరిచయ ప‌రిమళాలు...

తొలి అనుభవాలెప్పుడూ మరపురాని జ్ఞాపకాలే. వాటిని ఎన్నిసార్లు నెమరువేసుకొన్నా మధురంగానే ఉంటాయి. కెమెరా ముందుకొచ్చిన తొలి క్షణాల్ని గుర్తుచేసుకొంటున్నప్పుడు కథానాయికలు కూడా... అలాంటి మధుర భావనకే గురయ్యారు. మేకప్‌ వేసుకొన్న తొలి రోజుల పేజీల్ని వెనక్కి తిప్పి ముగ్ధులైపోయారు. ‘మీ తొలి సినిమా అనుభవాలేంటి’ అని కాజల్‌, తమన్నా, సమంతను అడిగితే ఇలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ఆ పరిమళాలు మీరూ ఆస్వాదించండి.
ఆ సినిమా నమ్మకం కలిగించింది
‘‘చిన్నప్పుడు ఓసారి భారతీరాజాగారు నన్ను చూశారు. ‘సినిమాల్లోకి వస్తావా... నీకో పాత్ర ఇస్తా’ అన్నారు. నాకూ ఆసక్తి కలిగింది. కానీ నాన్నగారు అడ్డు చెప్పారు. ‘డిగ్రీ చేతికొచ్చాక నీ ఇష్టమొచ్చిన రంగం ఎంచుకో...’ అన్నారు. ఆ తరవాత పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టా. పదో తరగతిలో ‘క్యోం హో గయానా’లో ఓ చిన్న పాత్ర చేశా. కెమెరా ముందుకెళ్లడం అదే తొలిసారి. డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను చూసి కొంతమంది ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు. అవి చేతులు మారుతూ, మారుతూ తేజ గారి దగ్గరకు చేరాయి. అలా ‘లక్ష్మీ కళ్యాణం’లో అవకాశం వచ్చింది. తొలి సినిమాకే ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడు దొరకడం నా అదృష్టం. పైగా పాటలకు వచ్చి వెళ్లిపోయే రొటీన్‌ హీరోయిన్‌ పాత్ర కాదు. అన్నిరకాల భావోద్వేగాల్నీ తొలి సినిమాతోనే పలికించే అవకాశం వచ్చింది. దాంతో... ఎలాంటి పాత్రనైనా పోషిస్తానన్న నమ్మకం కలిగింది. ‘లక్ష్మీ కళ్యాణం’ సెట్లో భయంభయంగానే ఉండేది. ఎందుకంటే తేజగారికి కోపం ఎక్కువ. అది ఎప్పుడు ఏ రూపంలో చూడాల్సివస్తుందో అనుకొనేదాన్ని. కానీ అలాంటి క్రమశిక్షణ తొలిరోజుల్లోనే నాకు పరిచయమైనందుకు సంతోషపడుతుంటా’’
- కాజల్‌
పాకెట్‌ మనీ కోసం
‘‘ఓ బర్త్‌డే పార్టీ నా జీవితాన్ని మర్చింది. స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల్లో నన్నెవరో ఫొటోలు తీశారు. మరుసటి రోజు దినపత్రికలో ఆ ఫొటోలు వచ్చాయి. అవి చూసి చెన్నైలోని ఓ వ్యాపారవేత్త నన్ను కలిశారు. వాళ్లకో వస్త్రదుకాణం ఉంది. దానికి మోడలింగ్‌ చేయమన్నారు. అలా మోడల్‌ అయిపోయా. నిజానికి నాకు కెమెరా ముందుకు రావాలంటే చాలా భయంగా ఉండేది. కేవలం పాకెట్‌ మనీ కోసం మోడల్‌నయ్యా. ఆ తరవాత సినిమాటోగ్రాఫర్‌ రవివర్మన్‌ ద్వారా నాకు కథా నాయికగా తొలి అవకాశం వచ్చింది. దానికంటే ముందు విడుదలైన ‘ఏ మాయ చేసావె’తో నా లైఫ్‌ మారిపోయింది. కథానాయికల్ని అందంగా చూపిస్తారు గౌతమ్‌ మేనన్‌. తొలి సినిమానే ఆయనతో పనిచేయడం బాగా కలిసొచ్చింది. జెస్సీ పాత్రతో నాకు పేరు రావడం వెనుక నా ప్రత్యేకమైన కృషి ఏం లేదు. గౌతమ్‌ సార్‌ ఏం చెబితే అది చేశా. యూత్‌ఫుల్‌ స్టోరీ, రెహమన్‌ స్వరాలు, గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వ ప్రతిభ... ఇవన్నీ కలసి నా ఎంట్రీని సూపర్‌హిట్‌ చేశాయి’’
- సమంత
డైలాగులన్నీ అలా
‘‘చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రావడానికి కూడా అదే ప్రేరణ. నా తొలి చిత్రం ‘శ్రీ’. అయితే అంతకు ముందే ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర చేశా. మా స్కూలు వార్షికోత్సవంలో నేను స్టేజ్‌ షో చేశాను. అది చూసిన ఓ హిందీ నటుడి ద్వారా నాకు ఆ అవకాశం వచ్చింది. ఇక ‘శ్రీ’తో కథానాయికగా మారా. తొలి సినిమాకి నటన విషయంలో పెద్దగా కష్టపడలేదు గానీ... భాషతో మాత్రం చాలా సమస్య ఎదురైంది. తెలుగు భాష నాకు పూర్తిగా కొత్త. సెట్లో చాలా కంగారుగా ఉండేది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. అలాంటప్పుడు డైలాగులేం గుర్తుంటాయి? అందుకే నా డైలాగులన్నీ రికార్డు చేయించి ఇంటికి పట్టుకెళ్లిపోయేదాన్ని. వాటిని వింటూ ఇంగ్లీషులో రాసుకొంటూ బట్టీపట్టేసేదాన్ని. కొన్నాళ్ల పాటు మా ఇంట్లో కూడా తెలుగే మాట్లాడేదాన్ని. అలా... తెలుగు అలవాటైపోయింది. సెట్లో మనోజ్‌, దశరథ్‌ నన్ను చాలా బాగా చూసుకొనేవారు. ఇంటికి దూరంగా ఉన్నాననే భావనే ఉండేది కాదు’’
- తమన్నా

No comments:

Post a Comment