Saturday, 28 May 2016

అంబు‘లెస్‌‌’లు

అప్పుడే పుట్టిన శిశువును అత్యవసర వైద్యం కోసం మరో చోటుకు తరలించాలంటే అంబులెన్స్‌ దొరకదు. ఛాతీ, మానసిక ఆస్పత్రుల్లో గుండెపోటు వచ్చిన రోగిని పెద్దాస్పత్రులకు తీసుకెళ్లాలంటే వాహనం గగనమే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేరుకు అంబులెన్స్‌లు ఉన్నాయి కానీ.. అవి రోగులకు ఏ మాత్రమూ ఉపయోగ పడడం లేదు. కొన్ని మూలనపడ్డాయి. ఒకటో, రెండో ఉన్నప్పటికీ అవి అధ్వాన స్థితికి చేరాయి.
  • లెక్కల్లోనే వాహనాలు
  • అత్యవసర సమయంలో రోగికి అవస్థలే
  • డిశ్చార్జి అయిన వారిని ఇంటికి చేరవేసే పరిస్థితి కరువు
  • ప్రసూతి ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు దొరకని అంబులెన్స్‌లు
  • కదల్లేని స్థితిలో డొక్కు వాహనాలు
  • తరచూ మరమ్మతులు
          ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌ అడ్రస్‌ ఉండదు.రోగి విలవిల్లాడుతున్న దారిదాపుల్లో ఒక్కటి కూడా కనిపించదు. అప్పుడే పుట్టిన శిశువుకు అత్యవసర వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే దొరకనే దొరకదు. రోగుల సహాయకులు ఆటో కోసం రోడ్డు మీదకు పరుగు పెట్టాల్సి వస్తోంది. ఛాతీ, మానసిక ఆస్పత్రుల్లో గుండెపోటు వచ్చిన రోగిని పెద్దాస్పత్రులకు తరలించాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలకు అత్యవసర వైద్యం కోసం మరో చోటకు తరలించలేని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేరుకు అంబులెన్స్‌ లుంటాయి. కానీ రోగులకు ఉపయోగ పడడం లేదు. పాతకాలం నాటివి పని చేయక మూలనపడ్డాయి. ఒకటో, రెండు ఉన్నా అధ్వానంగా ఉన్నాయి. అంబులెన్స్‌ లోపల కూర్చోవటానికి ఏమాత్రం అనువుగా లేదు.
 
       సీట్లు చిరిగిపోయి, డోరు పగిలి ఉంది. ఆపదలో ఉన్న రోగిని ఇలా ఉన్న వాటిలో మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఇబ్బందిగా ఉంటోంది. కొన్ని ఆస్పత్రుల్లో ఒకరికి దొరికితే మరొకరికి దొరకదు. అంబులెన్స్‌ దొరికినా ముందుకు కదిలే పరిస్థితి లేదు. కదిలినా కొద్ది దూరం వెళ్లి ఆగిపోవాల్సిందే. కొన్ని ఆస్పత్రులో తాతలకాలం నాటివి నేటికీ ఉపయోగిస్తున్నారు. అవి కొద్దికాలం పని చేయడం... తర్వాత షెడ్డులో పడేయటం.. రిపేర్‌ చేయించి మరలా కొద్దిరోజులు వినియోగించడం ఇలా దాదాపు అన్ని ఆస్పత్రులో ఈ పరిస్థితి ఉంది. కొన్ని ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు లేక రోగులు అవస్థ పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రోగులను వ్యాధి నిర్ధారణ కోసం ఇతర ఆస్పత్రులకు తరలించాలంటే కష్టమవుతోంది. ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
 
పేట్లబురుజులో ఎవరో ఒకరికే...
   పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఒకే ఒక అంబులెన్స్‌ ఉంది. పాతకాలం నాటి జీపు, జిప్సీ ఉన్నాయి. ఉన్న ఒక అంబులెన్స్‌ ఒకరిద్దరు రోగులకు మాత్రమే ఉపయోగ పడుతోంది. ఒకరికి దొరికితే మరొకరికి దొరకదు. సీరియస్‌ రోగులను జీపు, జిప్సీలో తరలించడం సాధ్యం కావడం లేదు. కొంచెం మంచిగా ఉన్న రోగుల కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. వారిని నిలోఫర్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలి. కానీ అంబులెన్స్‌ కొరతతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. ఆస్పత్రిలో రోజుకు 60 నుంచి 80 ప్రసవాలు ఉంటాయి. ఇందులో 20 నుంచి 30 మంది నవజాత శిశువులకు ఏదో ఒక సమస్య ఉంటోంది.
 
సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రిలో ఒకటే
   సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో మూడు అంబులెన్స్‌లున్నాయి. రెండు పాడైపోయాయి. నవజాత శిశువులను ఇతర ఆస్పత్రులకు తరలించడానికి ఒకటి ఉపయోగిస్తున్నారు. మరో రెండు జీపు లాంటివి చిన్నవి ఉండడంతో రోగులకు అనువుగా లేవు.
 
   ఇక్కడి నుంచి నిత్యం ఐదుగురు నవజాత శిశువులు, మూడు నుంచి ఐదుగురు గర్భిణులను వివిధ పరీక్షల నిమిత్తం ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటోంది. రోగుల అవసరాల మేరకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉండడం లేదు.
   ఈ ఆస్పత్రి నుంచి ఎక్కువగా నిలోఫర్‌, ఉస్మానియాకు రోగులను తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని వెళుతున్నారు. వారు అవసరాన్నిబట్టి ఎక్కువ చార్జీ డిమాండ్‌ చేస్తున్నారు పేదరోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయాల్లో ఆటోలను ఆశ్రయించి తీసుకెళు తున్నారు. కొంతమంది గర్భిణిలు ఆర్టీసీ బస్సుల్లో వెళుతున్నారు.
 
చెస్ట్‌ ఆస్పత్రిలో అదేతీరు
   చెస్ట్‌ ఆస్పత్రిలో నాలుగు అంబులెన్స్‌ లున్నాయి. ఇందులో రెండు 15 సంవత్సరాల నాటివి. అవి ఉపయోగపడటం లేదు. ఉన్న రెండు రోగుల అవసరాలకు అందుబాటులో ఉండవు. ఆ రెండింటిని ఎవరికి, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ ఆస్పత్రి నుంచి హార్ట్‌, న్యూరాలజీ, కిడ్నీ, ఆర్థో, కంటి పరీక్షలకు రోగులను ఉస్మానియా, నిలోఫర్‌, గాంధీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్కానింగ్‌, ఎమ్మారై లేకపోవడంతో వాటి కోసం రోగులను ఉస్మానియా, గాంధీకి తీసుకెళ్లాలి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆటోలు, బస్సుల్లో వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తున్నారు.
 
మానసిక ఆస్పత్రిలో...
  మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తరచూ గుండె, బ్రెయిన్‌ సో్ట్రక్‌ సమస్యలు వస్తాయి. ఇతర చికిత్సల కోసం రోగులను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. మానసిక రోగులను ఇతర వాహనాల్లో తరలించే పరిస్థితి లేదు. వీరికి అత్యవసర వైద్యం అందించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. 108 సర్వీస్‌లకు ఫోన్‌ చేస్తే మీకు అంబులెన్స్‌లున్నాయి కదా.. మేము పంపిం చలేమని సమాధానం చెబుతున్నారు.
 
డ్రైవర్ల కొరత
  కొన్ని ఆస్పత్రుల్లో డ్రైవర్ల కొరత ఉంది. అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ డ్రైవర్లు ఆ రోజు డ్యూటీకి రాకపోతే నడిపించే వారు ఉండరు. అదనపు డ్రైవర్లను నియమించడం లేదు. అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది. వీటి నిర్వహణకు కేటాయించే బడ్జెట్‌ సకాలంలో విడుదల కావడం లేదు. డీజిల్‌ లేని సమయంలో కొన్నిసార్లు పక్కన పెట్టేస్తున్నారు. దశల వారీగా విడుదల కావాల్సిన డీజిల్‌ బడ్జెట్‌ త్వరగా రావడం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
 
ఉస్మానియాలో రెండు... పార్కింగ్‌ యార్డుకే పరిమితం
   ఉస్మానియా ఆస్పత్రిలో ఆరు అంబులెన్స్‌లున్నాయి. అవి తాతాల కాలం నాటివి కావడంతో కొన్ని పాడైపోగా... కొన్ని మోరాయిస్తున్నాయి. ఆరు అంబులెన్స్‌లో రెండింటిని మాత్రమే రోగుల అవసరాలకు వినియోగిస్తున్నారు. రెండు పాడైపోవడంతో పార్కింగ్‌ యార్డుకే పరిమితయ్యాయి. ఒకటి మందుల తరలింపు, మరొకటి ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. రోగులకు రెండు అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
   పేషెంట్‌ ఒకచోట... వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరోచోట ఉండడంతో రోగులను ఈ భవనం నుంచి ఆ భవనానికి అంబులెన్స్‌లో తరలించాలి. అవి లేకపోవడంతో వీల్‌చైర్‌లో తీసుకెళ్లాల్సి రావడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. 1980 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉస్మానియా ఆస్పత్రికి తెలుగు సంజీవిని శకటం పేరిట రెండు అంబులెన్స్‌లను మంజూరు చేశారు.
 
   1994లో జపాన్‌ దేశ ఆర్థిక సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి జైకా కంపెనీకి చెందిన రెండు అంబులెన్స్‌లను కేటాయిం చారు. 2007లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రెండేసి అంబులెన్స్‌లను కేటాయించింది. ఇప్పటి వరకు నూతన అంబులెన్సులను ఉస్మానియా ఆస్పత్రికి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. పాతవాటితోనే పాలకవర్గం నెట్టుకొస్తోంది. పాతవాటికి మరమ్మతులు చేయించి వాడుతున్నారు.
 

No comments:

Post a Comment