Friday, 27 May 2016

ఎవరితో ఎవరు..?

  ఫలానా కథానాయకుడితో ఫలానా దర్శకుడి సినిమా అని ఖరారైన వెంటనే హీరోయిన్‌ గురించి చర్చ మొదలవుతుంది. అభిమానులు తమ కథానాయకుడి సరసన రోజుకొక హీరోయిన్‌ని వూహించుకొంటూ కలల్లో విహరిస్తుంటారు. పరిశ్రమ వర్గాలు కూడా ఏ జోడీ బాగుందనిపిస్తే ఆ జోడీని ప్రచారంలోకి తీసుకొస్తుంటాయి. దర్శకనిర్మాతలు మాత్రం అంత సులభంగా కథానాయికల్ని ఖరారు చేయలేరు. కాల్షీట్లు ఖాళీగా ఉన్నాయా లేవా? పారితోషికాల విషయంలో ఎవరేంటి? ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ లెక్కలన్నీ తేలడంతో పాటు, కథ నచ్చాకే కథానాయికలు ఓకే అవుతుంటారు. అవి తేలాలంటే చాలా సమయమే పడుతుంది మరి! అందుకే దర్శకనిర్మాతలు ముందు తీయాల్సిన సన్నివేశాలేవో తీసేద్దాం, ఆలోపు కథానాయికని ఓకే చేద్దాం అంటూ రంగంలోకి దిగుతుంటారు. మరోపక్క అభిమానులు మాత్రం హీరోయిన్‌ విషయంలో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా ముగ్గురు అగ్ర కథానాయకుల సినిమాల్లోని హీరోయిన్ల గురించి అలాంటి ఆసక్తే వ్యక్తమవుతోంది.
 
చిరు కోసం నలుగురు
చిరంజీవి 150వ సినిమాకి కొబ్బరికాయ కొట్టి చాలా కాలమైంది. తమిళంలో విజయవంతమైన ‘కత్తి’కి రీమేక్‌గా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా తుది దశకు చేరుకొన్నాయని సమాచారం. సంగీత చర్చలు కూడా పూర్తి కావొచ్చాయట. రేపోమాపో సెట్స్‌పైకి వెళతారని ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటిదాకా కథానాయిక ఎంపికే పూర్తవ్వలేదు. రోజుకొక భామ పేరు వినిపిస్తోంది. మొదట నయనతార పేరు తెరపైకొచ్చింది. కానీ ఆమె తమిళంలో వూపిరి సలపలేనంత బిజీగా ఉంది. నిర్మాతగా కూడా ఓ సినిమా చేస్తోందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తెలుగు సినిమాలకి కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో బంతి అనుష్క కోర్టులోకి వెళ్లింది. ఆమె చేతిలోనూ బోలెడన్ని సినిమాలున్నాయి. కానీ అనుష్క తలచుకొంటే చిరు సినిమాకి కాల్షీట్లు కేటాయించేంత వెసులుబాటు ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దాదాపుగా అనుష్కనే ఖరారు కావొచ్చని చెప్పుకొంటున్నారు. మరోపక్క సినిమాలో ఐటెమ్‌ పాటల్లోనూ, అతిథి పాత్రల్లోనూ నటించే కథానాయికలంటూ అంజలి, రెజీనా, కేథరిన్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాలో నటించేది ఎవరన్నది పక్కాగా తెలిసేది మాత్రం చిత్రబృందం అధికారికంగా ప్రకటించినప్పుడే.

శాతకర్ణి కోసం...
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కోసం కథానాయిక ఎంపిక చేయాల్సి వుంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తొలి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ కూడా మొదలుపెడతారు. కానీ కథానాయికపై మాత్రం ఇంకా చిత్రబృందం ఒక నిర్ణయానికి రాలేదు. అయితే బాలయ్య సరసన నటించే భామలంటూ పలువురి కథానాయికలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులోనూ నయనతార, అనుష్కల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కాజల్‌, శ్రుతిహాసన్‌ పేర్లు కూడా తెరపైకొచ్చాయి. మరి బాలకృష్ణ, క్రిష్‌ మనసుల్లో ఎవరున్నారో తెలియదు. మరి కొన్ని రోజుల్లోనే చిత్రబృందం కథానాయికని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

నాగ్‌తో ముగ్గురా?
అక్కినేని నాగార్జునకీ కథానాయికలు కావాలిప్పుడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు నాగ్‌. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు తుదిదశకు చేరినట్టు సమాచారం. రేపోమాపో కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే దర్శకుడు కె.రాఘవేంద్రరావు కథానాయికని ఎంపిక చేసే పనిపై దృష్టిపెట్టారు. నాగార్జున అభీష్టం మేరకు అనుష్కని ఎంపిక చేసినట్టు సమాచారం. నాగ్‌కీ, అనుష్కకీ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. పైగా నాగ్‌కి అనుష్క లక్కీ హీరోయిన్‌. దాంతో ఆమె ఎంపిక దాదాపుగా ఖరారైనట్టే అని తెలుస్తోంది. అయితే అనుష్కతో పాటు ప్రగ్యా జైశ్వాల్‌, విమలారామన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ ఇద్దరికీ కూడా అవకాశముందా లేదంటే అనుష్క ఒక్కరే నటిస్తారా? అనే విషయం తేలాల్సి వుంది. రాఘవేంద్రరావు సినిమా అంటే అందులో తప్పనిసరిగా ఇద్దరు ముగ్గురు కథా నాయికలుంటారు కాబట్టి నాగ్‌ సినిమాలో ఆ ముగ్గురూ కనిపించొచ్చని ప్రచారం సాగుతోంది.

ఇలా అగ్ర కథానాయకులంతా కథానాయికల కోసం వేట కొనసాగిస్తుండడం చూస్తే మన చిత్రసీమలో అందాల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్‌ హీరోలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు కానీ, చిన్న హీరోలు మాత్రం ఆ గొడవే లేకుండా ముందుగానే కథానాయికల్ని ఎంపిక చేసుకొంటున్నారు. యేడాదికి ఒకరిద్దరు స్టార్‌ హీరోయిన్లుగా ప్రమోషన్‌ అందుకొంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరికేలా కనిపించడం లేదు.

No comments:

Post a Comment