Saturday, 7 May 2016

ఈ నెల 9న ఖగోళ అద్భుతం!

  • సూర్యుడిపై ‘నల్లచుక్క’లా బుధుడి పయనం
     
                 ఈ నెల 9న ఓ ఖగోళ అద్భుతం దర్శనమివ్వనుంది. దీన్ని మళ్లీ చూడాలంటే 2032 నవంబరు 13న మాత్రమే సాధ్యం. వందేళ్లలో 13-14సార్లు మే, నవంబరు నెలల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యం తిరిగి 2019 నవంబరు 11న సంభవించనుంది. సూర్యగోళపు ఒక చివరనుంచి మరో చివరకు తెల్లని కాంతిమీద బుధుడు ‘నల్లని చుక్క’లా పాకుతూ సాక్షాత్కరించడమే ఈ అద్భుతం. అయితే, ఒట్టి కళ్లతో ఈ దృశ్యాన్ని ఆస్వాదించాలని ప్రయత్నించవద్దంటూ కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇందుకోసం వెల్డింగ్‌ అద్దం(నం.14) వంటి ఫిల్టర్లను ఉపయోగించాలని సూచించింది. సూర్యుడు, భూమి, బుధుడు ఒకే వరుసలోకి వచ్చినపుడు సం భవించే ఈ ఖగోళ అద్భుతం చివరిసారిగా 2006 నవంబరు 6న చోటుచేసుకుంది.
     
                మళ్లీ 16 ఏళ్లకుగానీ ఈ దృశ్యాన్ని చూడలేంగనుక ఈ అవకాశాన్ని జారవిడుచుకోరాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం బుధుడి అపురూప పయనాన్ని సాయంత్రం 4:41 నుంచి చూడవచ్చు. ఢిల్లీలో 140 నిమిషాలు, కోల్‌కతాలో 86 నిమిషాలు, ముంబై లో 144 నిమిషాలు, చెన్నైలో 105 నిమిషాలపాటు ఇది దర్శనమిస్తుంది. బుధుడి ప్రయాణం నవంబరు నెలలో 7, 13 లేదా 33 ఏళ్లకొకసారి, మే నెలలో 13 లేదా 33 ఏళ్లకొకసారి పునరావృతం అవుతుంది.

No comments:

Post a Comment