Thursday, 12 May 2016

         యూపీఎస్సీ సివిల్స్‌ విజయగాథల్లో అన్సర్‌ అహ్మద్‌ కథ ప్రత్యేకమైనది. అన్సర్‌ అహ్మద్‌ 21 ఏళ్లకే సివిల్స్‌ సాధించాడు. అదీ మొదటి ప్రయత్నంలోనే. ఐఏఎస్‌కు ఎంపికైన అతిచిన్న వయస్కుడుగా రికార్డు సృష్టించాడు. యూపీఎస్సీ సివిల్స్‌లో 361వ ర్యాంకు సాధించాడు. అయితే అతనేమి సంపన్నుల కుటుంబంలో పుట్టలేదు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా షెల్గావ్‌ అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఆటో డ్రైవర్‌, సోదరుడు ఓ గ్యారేజీలో పనిచేస్తుంటాడు.
         అన్సర్‌ చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాడు. షెల్గావ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 76 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత కళాశాల చదువుల్లోనూ మంచి మార్కులు సాధించాడు. 2015లో పూణెలోని ఫెర్గూసన్‌ కళాశాలలో 73 శాతం మార్కులతో బీఏ రాజనీతిశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందాడు. అదే సంవత్సరంలోనే యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యాడు.
       పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు అన్సర్‌ సమాధానాలు చెబుతూ.. సివిల్స్‌ పరీక్షల కోసం తాను రోజుకు 13 గంటలు కేటాయించే వాడినని చెప్పాడు. ఫెర్గూసన్‌ కళాశాలలో విద్యార్థిగా చేరేటప్పుడు, కళాశాలలో ఆహారం, వసతి పొందడానికి హస్సెల్స్‌ అనే తన ఇంటి పేరును ‘శుభమ్‌’ అని మార్చుకొని హిందువుగా మారాల్సి వచ్చిందని చెప్పాడు. సివిల్స్‌ విజయం వెనుక తన సోదరుడి సహకారం ఎంతో ఉందని తెలిపాడు. సమాజంలో మత పరమైన శాంతి సామరస్యాలు నెలకొల్పడం, రైతు ఆత్మహత్యలను అరికట్టడం లాంటి అంశాలపై తాను దృష్టిపెడతానని అన్సర్‌ తెలిపాడు.

No comments:

Post a Comment