Friday, 13 May 2016

‘వాట్సన్‌’తో హ్యాకర్లు పరార్‌!  
‘వాట్సన్‌’.. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం అభివృద్ధి చేసిన కంప్యూటర్‌ మెదడు. కృత్రిమ మేధస్సు(ఏఐ)తో రూపొందించిన ఆ ప్రోగ్రాం.. వంట చేయడంతో పాటు క్యాన్సర్‌కు వైద్యం కూడా చేయగలదు! అయితే.. ఇప్పుడు మరో సరికొత్త సవాల్‌ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న హ్యాకర్ల ఆట కట్టించేందుకు ‘వాట్సన్‌’కు ఐబీఎం శిక్షణ ఇస్తోంది.
ప్రస్తుతం సైబర్‌ దాడులు.. హ్యాకర్లు అనుసరించే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన పరిశోధనా పత్రాలు వెలువడుతున్నాయి. అయితే.. వాటన్నింటినీ మనుషులు చదివి అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతోంది. అందుకే.. సైబర్‌ సెక్యూరిటీపై బ్లాగులు.. డాక్యుమెంట్లల్లో అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ స్వయంగా అర్థం చేసుకునేలా ‘వాట్సన్‌’కు శిక్షణ ఇస్తున్నట్లు ఐబీఎం వెల్లడించింది.
దీంతో సైబర్‌ దాడులకు సంబంధించి సెక్యూరిటీ బ్లాగుల్లో కొత్తగా సమాచారం వస్తే.. ‘వాట్సన్‌’ దాన్ని చదివేసి అందుకు తగ్గట్లుగా అప్రమత్తం చేస్తుందట. అందుకోసం దాదాపు 60వేల బ్లాగులు.. పరిశోధనా పత్రికలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉంటుందట. అలాగే.. ఐబీఎం ‘ఎక్స్‌-ఫోర్స్‌ రీసెర్చ్‌’ లైబ్రరీలోని దాదాపు 20 ఏళ్ల పరిశోధనా పత్రాలను కూడా ‘వాట్సన్‌’ అర్థం చేసుకుంటుందని వివరించారు.
 
8 ప్రముఖ విశ్వవిద్యాలయాలతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందని ఐబీఎం చెబుతోంది. ఈ కృత్రిమ మెదడు అందరికీ అందుబాటులోకి వస్తే.. సెక్యూరిటీ పర్యవేక్షణ ఖర్చులను చాలావరకు తగ్గించుకునే వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment