Sunday, 15 May 2016

మెయిల్‌ అరవై వేల కోట్ల విలువ

    రదాగా సన్నిహితులకు మెయిల్స్‌ పెడుతుంటాం. ఆఫీసు అవసరాల కోసం వాటిని ఉపయోగిస్తుంటాం. కానీ ఒక మెయిల్‌కి ఖరీదు కట్టడం... అదీ అరవై వేల కోట్ల మొత్తానికి వెల కట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండకపోవచ్చు. కానీ అలాంటి ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది.
     పదేళ్ల క్రితం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్‌ పంపిన మెయిల్‌ ఒక లాసూట్‌లో కీలకంగా మారడంతో దాని విలువ అమాంతం పెరిగిపోయి, అరవై వేల కోట్లు దాటేసింది! విషయంలోకి వస్తే... టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఒరాకిల్‌ సంస్థల మధ్య 2010 నుంచి కాపీరైట్‌ ఉల్లంఘన వివాదం నడుస్తోంది. దాన్లో ఈ మెయిల్‌ అత్యంత కీలకంగా మారింది. దాని ఆధారంగానే కేసు గెలిచి గూగుల్‌ నుంచి నష్ట పరిహారంగా రూ. 60 వేల 300 కోట్లు రాబట్టేందుకు ఒరాకిల్‌ తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు.
      ప్రముఖ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ ‘జావా’ను సన్‌ మైక్రోసిస్టమ్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. 2009లో ఆ సంస్థను ఒరాకిల్‌ కొనుగోలు చేసింది. ఆ తరవాత కొన్నాళ్లకు గూగుల్‌పై ఒరాకిల్‌ కాపీరైట్‌ ఉల్లంఘన కింద కోర్టులో వ్యాజ్యం వేసింది. సన్‌ మైక్రోసిస్టమ్స్‌కు కాపీరైట్స్‌ ఉన్న 37 అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ)లను ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో గూగుల్‌ అనుమతి లేకుండా ఉపయోగించిందని ఆరోపించింది.
      అందుకు ఆధారాలను చూపించేందుకు ఒరాకిల్‌ తరఫు న్యాయవాదులు గత ఐదారేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి 2006లో ఆండ్రాయిడ్‌ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్‌ నుంచి వెళ్లిన ఓ ఈమెయిల్‌ వారికిఆధారంగా లభించింది. ఆండ్రాయిడ్‌లో వాడిన జావా ఏపీఐలపై సన్‌ మైక్రోసిస్ట్‌మ్స్‌కు కాపీరైట్స్‌ ఉన్నట్లు ఆ మెయిల్‌లో రూబిన్‌ పేర్కొన్నారట. దీంతో కాపీరైట్స్‌ ఉన్నట్లు తెలిసి కూడా.. గూగుల్‌ అక్రమంగావాటిని వాడుకుందని ఒరాకిల్‌ అంటోంది. కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడిన గూగుల్‌ 9 బిలియన్‌ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. గూగుల్‌ మాత్రం ఆ ఏపీఐలు ఉచితంగా వాడుకునేవేనని చెబుతోంది.
      నిజంగానే కాపీరైట్స్‌ ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే... గూగుల్‌ 9 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 60,300 కోట్లు) ఒరాకిల్‌కు చెల్లించడంతో పాటూ ఆండ్రాయిడ్‌లోనూ కొన్ని మార్పులు చేయాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
        ప్రస్తుతం ప్రతి ఓఎస్‌లోనూ ఏపీఐలు కీలకం. ప్రపంచంతో అనుసంధానం కావడానికి యాప్‌లూ.. వెబ్‌సైట్లలో ఈ ఏపీఐలు ఎంతో అవసరం. దీనికి సంబంధించిన వివాదం కాబట్టే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుకే ఆ మెయిల్‌కి అంత విలువ పెరిగింది.

No comments:

Post a Comment