హైదరాబాద్
నగర పోలీసుల చర్యలు
మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో జైలుశిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాలంటే వారికి వీసా వచ్చే అవకాశాలు కష్టమే. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు అలాంటి వ్యక్తుల వివరాలను అమెరికన్, బ్రిటన్, ఇరాన్, ఇరాక్ కాన్సులేట్ కార్యాలయాలకు అందించనున్నారు. ఇతరత్రా విదేశాల తరఫున వీసా వ్యవహరాలు చూసే సంస్థలకూ జైలుశిక్ష అనుభవించిన వారి వివరాలను సమర్పించనున్నారు. ప్రతి కేసు వివరాలు, నిందితులతో కూడిన రికార్డులను వారికి ఇవ్వనున్నారు. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. తాగి వాహనాలు నడుపుతూ(డ్రంకెన్ డ్రైవ్) పట్టుబడి, జైలుకు వెళ్లిన వారి వివరాలన్నీ ప్రస్తుతం క్రోడీకరిస్తున్నామని, ప్రత్యేక విభాగం అధికారుల ద్వారా వారి పాస్‌పోర్టుల నంబర్లను సేకరిస్తున్నామని తెలిపారు. జైలుశిక్ష అనుభవించిన వారు ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో పట్టుబడ్డారు, ఎన్నిసార్లు శిక్ష అనుభించారన్న వివరాలన్నీ రికార్డుల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనలతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విదేశాల్లో కొలువులకు వెళ్లేవారు జైలుశిక్ష అనుభవించి ఉంటే వీసా అనుమతిపై ప్రభావం చూపుతుంది. ఇంతేకాదు.. ఎవరైనా విద్యార్థులు జైలుశిక్ష అనుభవించి ఉన్నత చదువులకు వెళ్లేందుకు యత్నించినా వీసా వచ్చే అవకాశాలు లేవు. తాము నివేదిక మాత్రమే ఇస్తామని, వీసా మంజూరుచేయడం, మానడం కాన్సులేట్ కార్యాలయాల అధికారులు నిర్ణయం తీసుకుంటారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వివరించారు.

No comments:
Post a Comment