Saturday, 7 May 2016

భరోసాకు ఏదీ మార్గం..?


ఉద్యోగ భవిష్య నిధి.. అటు పదవీ విరమణ తర్వాత భరోసా కోసం.. ఇటు పన్ను ఆదా పథకంగానూ ఎంతో పేరు పొందింది. దాదాపు 60ఏళ్లుగా ఎంతోమంది తమ భవిష్యత్తు కోసం నమ్మకమైన మదుపు పథకంగా దీన్ని భావించారు. ప్రస్తుతం దాదాపు 4కోట్లకు మంది పైగానే ఇందులో సభ్యులు ఉన్నారు. మలి జీవితం కోసం మదుపు చేయాలని భావించే వారు దీనితోపాటు జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)ను కూడా పరిశీలించడం ప్రారంభించారు. మరి ఈ రెండింటిలో ఏమిటి తేడా? ఏది ఎవరికి ఉపయోగపడుతుంది? తెలుసుకుందామా!
గత కొన్ని రోజుల నుంచీ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చుట్టూ ఎన్నో వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులు ప్రజాందోళనల నేపథ్యంలో బుట్టదాఖలయ్యాయి. ఈ ప్రతిపాదనల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన మరో పథకం ఎన్‌పీఎస్‌. దీన్ని కొత్తగా చేరిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004లో తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2009 నుంచి సాధారణ ప్రజలకూ అందుబాటులోకి తెచ్చారు. అయిఏత, ఎన్‌పీఎస్‌కు ఇప్పటికీ అనుకున్నంత ఆదరణ లభించలేదు.
* ఈపీఎఫ్‌.. ఎన్‌పీఎస్‌ల మధ్య ప్రధాన తేడాలు కొన్ని ఉన్నాయి. ఈపీఎఫ్‌ కనీస వార్షిక వడ్డీ హామీతో, ఎలాంటి పన్నూ లేని ఆదాయాన్ని అందిస్తుంది. అదే ఎన్‌పీఎస్‌ మార్కెట్‌ ఆధారిత రాబడులను అందిస్తుంది. ఎన్‌పీఎస్‌లో గరిష్ఠంగా 50శాతం వరకూ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లోకి మళ్లిస్తారు. అందువల్ల ఈపీఎఫ్‌తో పోలిస్తే.. ఎన్‌పీఎస్‌లో కాస్త అధిక రాబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, కనీసం 10ఏళ్లకు మించి మదుపు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి రాబడి సాధ్యం అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
* నిర్వహణ విషయానికి వస్తే.. ఈపీఎఫ్‌ గురించి ప్రతి రోజూ పట్టించుకోనక్కర్లేదు. ఈ పథకం ఖాతాదారులందరికీ సమాన వడ్డీ వస్తుంది. పెట్టుబడి మొత్తం, ఖాతాదారుడి వయసుతో సంబంధం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదిలో ఎంత వడ్డీ జమ అయ్యిందనేది తెలుసుకోవడం సులభం. ఎన్‌పీఎస్‌ విషయంలో రాబడిని అంచనా వేయడం అంత తేలిక కాదు. ఫండ్‌ మేనేజర్ల పనితీరు, పెట్టుబడిని ఈక్విటీలు, డెట్‌లకు కేటాయించిన నిష్పత్తి ఆధారంగా వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది. ఖాతాదారులు తమ పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకుంటున్నారా? ‘డిఫాల్ట్‌ ఆప్షన్‌’ ఎంచుకున్నారా అనేదీ రాబడిలో కీలక పాత్ర పోషిస్తుంది.
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ మేరకు ఈపీఎఫ్‌లో జమ చేసిన మొత్తానికి గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో జమ చేసినప్పుడు మొదట సెక్షన్‌ 80సీ పరిమితి, ఆ తర్వాత జమ చేసిన మొత్తానికి గరిష్ఠంగా రూ.50వేల వరకూ సెక్షన్‌ 80సీసీడీ (1బీ) ప్రకారం అదనపు మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో మదుపు చేయడం ద్వారా పొందే అదనపు మినహాయింపులో ఇదొకటి.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయం కాదు. రెండింటికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రెండూ కూడా పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగేందుకు ఉద్దేశించనవే. కాబట్టి, ఒక వ్యక్తి పెట్టుబడుల జాబితాలో రెండూ ఉండటం వల్ల లాభమే కానీ, ఎలాంటి నష్టం ఉండదని చెప్పొచ్చు.
అర్హులెవరు?
ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వర్తిస్తుంది. నిర్ణీత సంఖ్యకు మించి ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా తప్పనిసరిగా తమ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ సౌకర్యాన్ని కల్పించాల్సిందే. ఏప్రిల్‌ 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ ఎన్‌పీఎస్‌ వర్తిస్తుంది. అయితే, 2009 నుంచి ఇది సాధారన ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారూ, గృహిణిలూ, సంఘటిత/అసంఘటిత రంగంలో పనిచేసే వారెవరైనా సరే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. ఈపీఎఫ్‌ సౌకర్యం ఉన్న వారు కూడా ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవచ్చు. అంటే, ప్రైవేటు ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రణాళిక కోసం.. ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌ రెండింటిలోనూ మదుపు చేయవచ్చన్నమాట. అదే వ్యాపారం, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ పదవీ విరమణ పెట్టుబడి కోసం ఎన్‌పీఎస్‌ను మాత్రమే ఎంచుకోవచ్చు. దీంతోపాటు వీలైతే ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)ను పరిశీలించవచ్చు.
మదుపు ఎలా?
ఈపీఎఫ్‌ వర్తించే ఉద్యోగులందరికీ.. వారి మూల వేతనంలో నుంచి 12శాతాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. అదే శాతంలో యాజమాన్యమూ జమ చేస్తుంది. ఇది క్రమశిక్షణతో కూడిన పొదుపుగా పేర్కొనవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఖాతాదారుడు తన ఇష్టానుసారం మదుపు చేసేందుకు వీలుంది.
కనీస పెట్టుబడి?
ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఎస్‌లో కనీస పెట్టుబడి రూ.6వేలు. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఈపీఎఫ్‌లో మూల వేతనంలో గరిష్ఠంగా 12శాతం వరకూ మాత్రమే అనుమతిస్తారు. దీనికి అదనంగా పొదుపు చేసుకోవాలనుకుంటే స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్‌)ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, దీన్ని కూడా కొంత పరిమితి మేరకే అనుమతిస్తారు.
రాబడి మాటేమిటి?
ఈపీఎఫ్‌ నుంచి అందే రాబడి ఖాతాదారులందరికీ సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 8.8శాతం వడ్డీ అందుతోంది. అయితే, భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశాలు లేకపోలేదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడుల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, దీర్ఘకాలంలో అంటే.. 10ఏళ్లకు మించి మదుపు చేసినప్పుడు ఈపీఎఫ్‌కన్నా 2 -3% అధికంగానే రాబడి అందేందుకు వీలుంది. అయితే, మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులు కాబట్టి, రాబడికి ఎలాంటి హామీ ఉండదనేది గుర్తుంచుకోవాలి.
పన్ను లాభం?
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేసే మొత్తానికి సెక్షన్‌ 80సీ పరిమితికి లోబడి రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. అయితే, ఈ సెక్షన్లో పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమా పాలసీలు, ట్యూషన్‌ ఫీజులు, ఐదేళ్ల బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితరాలు కూడా ఉంటాయి. అదే ఎన్‌పీఎస్‌లో మదుపు చేసేవారికి సెక్షన్‌ 80సీతోపాటు, సెక్షన్‌ 80సీసీడీ (1బీ) ప్రకారం కూడా మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.2లక్షల రూపాయలను ఎన్‌పీఎస్‌లో జమ చేశాడనుకుందాం. అప్పుడు అతనికి సెక్షన్‌ 80సీ ప్రకారం రూ.1,50,000; సెక్షన్‌ 80సీసీడీ ప్రకారం రూ.50వేల మినహాయింపు లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. కేవలం ఎన్‌పీఎస్‌లో రూ.1,50,000కు మించి జమ చేసినప్పుడు మాత్రమే సెక్షన్‌ 80సీసీడీ ప్రయోజనాన్ని పొందగలం.
వ్యవధి ముగిసిన తర్వాత ఈపీఎఫ్‌ నుంచి ఎలాంటి పన్ను కోతలు లేకుండా మొత్తం సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. గతంలో మొత్తం రాబడిపై పన్ను విధించేవారు. తాజా బడ్జెట్‌లో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చారు. ఎన్‌పీఎస్‌ ఖాతాలో జమ అయిన మొత్తంలో 40శాతానికి ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 60శాతాన్ని ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో 100శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కనీసం 40శాతమైనా యాన్యుటీ పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మొత్తం సొమ్ముతో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాలనుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
పదవీ విరమణ ప్రణాళిక ఒక వ్యక్తి వయసు, ఆర్థిక స్తోమత, లక్ష్యాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏ పథకంలో మదుపు చేయాలని అనేది నిర్ణయించుకునేముందు మీకు నప్పే పథకం ఏమిటన్నది గుర్తించాలి. అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు పాటించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే మలి జీవితం ప్రశాంతంగా సాగుతుందని మర్చిపోకూడదు.

 కేటాయింపులు ఎలా?
ద్యోగ భవిష్య నిధి పూర్తిగా సురక్షిత పథకం అనుకోవచ్చు. ఇందులో జమ అయిన మొత్తాన్ని 100 శాతం మేరకు డెట్‌ పథకాలకే కేటాయిస్తారు. ఇటీవల చేసిన కొన్ని మార్పుల్లో భాగంగా.. గరిష్ఠంగా 15శాతం వరకూ ఈక్విటీ మార్కెట్లకు మళ్లించేందుకు ప్రతిపాదించారు. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అవకాశాలుంటాయి. ఈక్విటీ, డెట్‌ పథకాలకు సొంతంగా పెట్టుబడులను కేటాయించడం, లేదా ఢిపాల్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం. డిఫాల్ట్‌ ఆప్షన్‌ ఎంచుకున్నప్పుడు ఏడాదికేడాది ఈక్విటీ పెట్టుబడుల శాతాన్ని తగ్గించుకుంటూ వస్తారు. మరో ఆప్షన్లో 50శాతానికి మించి ఈక్విటీ పెట్టుబడులకు అనుమతించరు. పింఛను పథకాన్ని నిర్వహించే ఆరుగురు ఫండ్‌ మేనేజర్లలో మీ పెట్టుబడుల నిర్వహణ కోసం ఎంచుకోవచ్చు.

No comments:

Post a Comment