Monday, 30 May 2016

హైదరాబాద్‌షా

ఐపీఎల్‌ ఛాంప్‌ సన్‌రైజర్స్‌
అదరగొట్టిన వార్నర్‌
కటింగ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు
గేల్‌ చెలరేగినా బెంగళూరుకు భంగపాటు
బెంగళూరు

ద్విశతక లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఏమీ.. గేల్‌ బాదేస్తుంటే.. ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తుంటే.. ఆశలు అడుగంటిపోతున్నాయన్న వేదన. సిక్సర్ల మోత మోగుతుంటే.. పరుగుల వరద పారుతుంటే.. కల చెదురుతున్న భావన. లక్ష్యం తరిగిపోతుంటే కప్పు చేజారినట్లేనన్న ఆందోళన. కానీ సన్‌రైజర్స్‌ పట్టుదలతో నిలిచింది. తన బౌలర్లపై కెప్టెన్‌ వార్నర్‌ పెట్టుకున్న నమ్మకం గెలిచింది. ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి అద్భుత పోరాటంతో పుంజుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. మూడోసారి ఫైనల్లో ఓడిన బెంగళూరు నిరాశతో నిష్క్రమించింది. వార్నర్‌ తన బ్యాటింగ్‌, కెప్టెన్సీతో హైదరాబాద్‌ అద్భుత విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌-9 విజేతగా నిలిచింది. కెప్టెన్‌ వార్నర్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు రాణించిన వేళ ఆదివారం రసవత్తరంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ 8 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును మట్టికరిపించింది. వార్నర్‌ (69; 38 బంతుల్లో 8×4, 3×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ కటింగ్‌ (39 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4, 4×6; 2/35), యువరాజ్‌ సింగ్‌ (38; 23 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట సన్‌రైజర్స్‌ 7 వికెట్లకు 208 పరుగులు సాధించింది. భువనేశ్వర్‌ (0/25), ముస్తాఫిజుర్‌ (1/37), కటింగ్‌ (2/35) రాణించడంతో ఛేదనలో బెంగళూరును 200 (7 వికెట్లకు) కట్టడి చేసింది. గేల్‌ (76; 38 బంతుల్లో 4×4, 8×6), కోహ్లి (54; 35 బంతుల్లో 5×4, 2×6) మెరుపులతో ఛేదనలో 10.2 ఓవర్లలో 114/0తో నిలవడంతో బెంగళూరు గెలుపు ఖాయమనుకున్నారంతా. కానీ సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆ జట్టును కట్టడి చేశారు. ‘బౌలింగే మా బలం’ అంటూ.. అంచనాలకు భిన్నంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ వార్నర్‌ నమ్మకాన్ని నిలబెట్టారు. గేలా.. సుడిగాలా!: అసలే భారీ లక్ష్యం. ఆపై టోర్నీలో అత్యంత విజయవంతమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌. బెంగళూరు ముందున్నది క్లిష్టమైన సవాలే. కానీ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన గేల్‌ విధ్వంసక విన్యాసాలతో బెంగళూరును వడివడిగా లక్ష్యంగా దిశగా నడిపించాడు. సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడిన గేల్‌.. కేవలం 25 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడు హెన్రిక్స్‌ వేసిన 9వ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడంతో బెంగళూరు స్కోరు 100కు చేరుకుంది. అప్పటిదాకా గేల్‌కు సహకరిస్తూ వచ్చిన కోహ్లి కూడా జోరందుకున్నాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. కటింగ్‌ ఓవర్లో గేల్‌ నిష్క్రమించడంతో 114 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడ్డా కోహ్లి చక్కగా ఆడడంతో బెంగళూరు 140/1 సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ సన్‌రైజర్స్‌.. 8 పరుగుల వ్యవధిలో ప్రమాదకర కోహ్లి, డివిలియర్స్‌ (5)లను ఔట్‌ చేసి పోటీలోకి వచ్చేసింది. కోహ్లిని శరణ్‌ బౌల్డ్‌ చేయగా.. బిపుల్‌ శర్మ బౌలింగ్‌లో ఏబీ.. హెన్రిక్స్‌కు దొరికిపోయాడు. రాహుల్‌ (11) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అతణ్ని కటింగ్‌ బౌల్డ్‌ చేశాడు. బెంగళూరు క్రమంగా ఒత్తిడిలోకి కూరుకుపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సాధించాల్సిన రన్‌రేట్‌ను పెంచుతూ సన్‌రైజర్స్‌ పట్టుబిగించింది. వార్నర్‌ చివరి నాలుగు ఓవర్లను తన ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్‌, ముస్తాఫిజుర్‌ల కోసం అట్టిపెట్టడంతో బెంగళూరు పని ఇంకా కష్టమైపోయింది. 17వ ఓవర్లో వాట్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా మ్యాచ్‌ను ముస్తాఫిజుర్‌ పూర్తిగా సన్‌రైజర్స్‌ వైపు తిప్పాడు. అతడితోపాటు భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌ను కొనసాగించడంతో కిందివరుస బ్యాట్స్‌మెన్‌కు సంచలనం సృష్టించే అవకాశం లేకపోయింది.
వార్నర్‌.. అదే జోరు: టోర్నీ ఆరంభం నుంచి సన్‌రైజర్స్‌ను ముందుండి నడిపించిన వార్నర్‌.. ఫైనల్లోనూ అలాగే ఆడాడు. మరో సూపర్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్‌తో కలిసి వార్నర్‌ చెలరేగిపోవడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికే సన్‌రైజర్స్‌ 59/0తో పటిష్టంగా నిలిచింది. ధావన్‌ (28; 25 బంతుల్లో 3×4, 1×6) కూడా చక్కని బౌండరీలు సాధించాడు. ఏడో ఓవర్లో ధావన్‌ ఔటైనా వార్నర్‌ జోరు కొనసాగించాడు. 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 97/2. హెన్రిక్స్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ కూడా కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. యువీ చకచకా నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల బాదడంతో 16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 147/4తో ఉంది. అప్పటికి అరవింద్‌ వేసిన వేరు వేరు ఓవర్లలో వార్నర్‌, హుడా ఔటయ్యారు.
వారెవ్వా కటింగ్‌: నిజానికి సన్‌రైజర్స్‌ 200 దాటడమనేది ఎవరి అంచనాలకు అందని విషయం. ఎందుకంటే జోరు మీదున్న యువరాజ్‌ 17వ ఓవర్లోనే వెనుదిరిగాడు. నమన్‌ ఓజా కూడా వెంటనే ఔటయ్యాడు. కానీ బెన్‌ కటింగ్‌ విధ్వంసక విన్యాసాలతో విరుచుకుపడ్డాడు. చివరి మూడు ఓవర్లలో ఆ జట్టు 52 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్లో కటింగ్‌ విశ్వరూపాన్నే చూపించాడు. ఏకంగా మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాదేశాడు. వాట్సన్‌ ఫుల్‌టాస్‌కు అతడు కొట్టిన ఓ భారీ సిక్సైతే 117 మీటర్లు ప్రయాణించి స్టేడియం దాటింది.

ప్రైజ్‌మనీ: విజేతకు రూ.15 కోట్లు
రన్నరప్‌కు రూ.10 కోట్లు
ఫెయిర్‌ప్లే అవార్డు - సన్‌రైజర్స్‌
వర్థమాన ఆటగాడు - ముస్తాఫిజుర్‌
ఉత్తమ ఫీల్డర్‌ - డివిలియర్స్‌ (19 క్యాచ్‌లు)
ఉత్తమ క్యాచ్‌ - రైనా
విలువైన ఆటగాడు - కోహ్లి
అత్యధిక సిక్సర్లు - కోహ్లి (38)

హైదరాబాద్‌కు రెండో కప్పు
పీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఐతే హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఇది రెండో కప్పు. 2009లో గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలో డెక్కన్‌ ఛార్జర్స్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. 2009లో కూడా హైదరాబాద్‌ జట్టు.. బెంగళూరుపైనే గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్‌ జట్టు కప్పు సొంతం చేసుకుంది.

అయ్యో బెంగళూరు
ఫైనల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఇది మూడో ఓటమి. 2009, 2011లో కూడా ఆ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐతే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయింది.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇక్బాల్‌ అబ్దుల్లా (బి) అరవింద్‌ 69; ధావన్‌ (సి) జోర్డాన్‌ (బి) చాహల్‌ 28; హెన్రిక్స్‌ (సి) చాహల్‌ (బి) జోర్డాన్‌ 4; యువరాజ్‌ (సి) వాట్సన్‌ (బి) జోర్డాన్‌ 38; హుడా (సి) కోహ్లి (బి) అరవింద్‌ 3; కటింగ్‌ నాటౌట్‌ 39; నమన్‌ ఓజా రనౌట్‌ 7; బిపుల్‌ శర్మ (సి) చాహల్‌ (బి) జోర్డాన్‌ 5; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208;
వికెట్ల పతనం: 1-63, 2-97, 3-125, 4-147, 5-148, 6-158, 7-174; బౌలింగ్‌: అరవింద్‌ 4-0-30-2; గేల్‌ 3-0-24-0; వాట్సన్‌ 4-0-61-0; చాహల్‌ 4-0-35-1; ఇక్బాల్‌ అబ్దుల్లా 1-0-10-0; జోర్డాన్‌ 4-0-45-3 బెంగళూరు ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) బిపుల్‌శర్మ (బి) కటింగ్‌ 76; కోహ్లి (బి) శరణ్‌ 54; డివిలియర్స్‌ (సి) హెన్రిక్స్‌ (బి) బిపుల్‌శర్మ 5; కేఎల్‌ రాహుల్‌ (బి) కటింగ్‌ 11; వాట్సన్‌ (సి) హెన్రిక్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 11; సచిన్‌ బేబి నాటౌట్‌ 18; బిన్నీ రనౌట్‌ 9; జోర్డాన్‌ రనౌట్‌ 3; ఇక్బాల్‌ అబ్దుల్లా నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200;

వికెట్ల పతనం: 1-114, 2-140, 3-148, 4-160, 5-164, 6-180, 7-194; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0; శరణ్‌ 3-0-41-1; కటింగ్‌ 4-0-35-2; ముస్తాఫిజుర్‌ 4-0-37-1; హెన్రిక్స్‌ 3-0-40-0; బిపుల్‌ 2-0-17-1

No comments:

Post a Comment