Thursday, 19 May 2016

కేరళలో లెఫ్ట్‌.. రైట్‌ రైట్‌


     దేశంలో రాజకీయచైతన్యానికి పేరు పొందిన కేరళలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షకూటమి (ఎల్డీఎఫ్‌) ఘనవిజయం సాధించింది.మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్‌ 91 సాధించగా అధికార యూడీఎఫ్‌ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా భాజపా విజయాన్ని సాధించింది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. యో-యో రాజకీయాలు అంటే ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పొందడం.ఇందులో భాగంగా తాజాగా ఎల్డీఎఫ్‌ గెలుపొందింది. 1977 నుంచి కేరళలో ఒకసారి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, మరో సారి ఎల్డీఎఫ్‌ అధికారాన్ని అందుకోవడం గమనార్హం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు వూమెన్‌చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. బార్‌ లైసెన్స్‌లు, సోలార్‌ కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపివేశాయి. బార్‌ లైసెన్స్‌ల కుంభకోణంలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎం మణి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చాందీ అనేక ప్రజాకర్షక పథకాలు చేపట్టినా అవినీతి ఆరోపణల పర్వంలో అవి కొట్టుకుపోయాయి.
సోలార్‌ కుంభకోణం సోలార్‌ ప్యానల్స్‌ను విక్రయిస్తామని బిజూ, సరితా నాయర్‌ దంపతులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెల్లడి కావడంతో రాష్ట్రం నిర్ఘాంతపోయింది. ఏకంగా సీఎం చాందీపైనే సరితా నాయర్‌ లైంగిక ఆరోపణలు చేయడంతో చాందీ ప్రతిష్ట మసకబారింది. సీఎం సహాయకుడు ఈ కుంభకోణంలో కీలకపాత్ర వహించారన్న వార్తలు వెలువడటంతో యూడీఎఫ్‌కు నష్టం కలిగించింది.
లెఫ్ట్‌..పోరాట పటిమ యూడీఎఫ్‌ తీరుపై వామపక్షకూటమి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేపట్టింది. అసెంబ్లీ దిగ్బంధం, హర్తాళ్‌, సమ్మె... తదితర చర్యలతో ప్రజా వ్యతిరేకచర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.
స్చచ్ఛతకు నిలువుటద్దం.. అచ్యుతానందన్‌ కేరళ సీపీఎంలో కురువృద్ధుడిగా పేరుపొందిన వెళికకాత్తు శంకరన్‌ అచ్యుతానందన్‌ 90 ఏళ్లు పైబడినా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు సచ్ఛీలుడిగా పేరుంది. గత 2011 ఎన్నికల్లోనూ మెజార్టీకి రెండుసీట్ల దూరంలో ఎల్డీఎఫ్‌ ఆగిపోయింది. పార్టీలో పినరాయి విజయన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు. కానీ వీఎస్‌కు వున్న జనాకర్షణ వేరు. దీంతో సీపీఎం కూడా వీఎస్‌ పైనే ప్రచార బాధ్యతలను పెట్టింది.
భాజపా ప్రభావం
రాష్ట్రంలో గణనీయశక్తిగా ఎదిగేందుకు భాజపా కొన్ని సంవత్సరాలుగా యత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో వెనుకబడిన వర్గమైన ఈళవల ప్రాబల్యమున్న భారత ధర్మజనసేనతో పొత్తుపెట్టుకుంది. దీంతోపాటు మెజార్టీ హిందూ వర్గమైన నాయర్ల సామాజికవర్గంలోనూ మద్దతు సాధించింది. నాయర్లు సహజంగా యూడీఎఫ్‌కు గట్టి మద్దతుదారులు. వీరిలో కొంత ఓట్లు భాజపాకు వెళ్లిపోవడంతో ఎల్డీఎఫ్‌కు అనుకూలించింది.

No comments:

Post a Comment