Thursday, 19 May 2016

ఓడిన ప్రముఖులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొందరు ప్రముఖులు ఓటమి చవిచూశారు. ప్రచార సమయంలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసిన అనుభవజ్ఞులైన నేతలు, సినీతారలు, క్రీడాకారులు సైతం ప్రజల మనసు గెలుచుకోలేకపోయారు. ఓడిన కొందరు ప్రముఖుల వివరాలు..
డీఎండీకే చీఫ్‌ కెప్టెన్‌ విజయ్‌కాంత్‌
డీఎండీకే సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రచారం చేసుకున్న విజయ్‌కాంత్‌ ఉలుందూర్‌పెట్టై నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థి కుమారగురు చేతిలో ఓడిపోయారు. ఇక్కడ అన్నాడీఎంకే తర్వాత డీఎంకేకు ఎక్కువ ఓట్లు రాగా, కెప్టెన్‌ మూడోస్థానంలో ఉన్నారు.
చంద్రకుమార్‌ బోస్‌
పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై పోటీ చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ ఓటమి చవిచూశారు. భవానీపూర్‌ నియోజకవర్గంలో మమతకు పోటీగా భాజపా తరఫున నిలబడిన చంద్రకుమార్‌ గెలుపొందలేకపోయారు.
మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌
తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా నుంచి పోటీ చేసిన శ్రీశాంత్‌ ఓటమిపాలయ్యారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ శివకుమార్‌ చేతిలో శ్రీశాంత్‌ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి శివకుమార్‌ గెలుపొందారు.
బెంగాలీ నటి రూపా గంగూలీ
హౌరా ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రూపాగంగూలీ ఓటమి చవిచూశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ లక్ష్మీరతన్‌ శుక్లా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
మాజీ ఎంపీ దీప దాస్‌మున్షి
పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై భవానీపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి దీప దాస్‌మున్షి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
ప్రముఖ క్రీడాకారుడు భైచుంగ్‌ భూటియా
ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భైచుంగ్‌ భూటియా పశ్చిమ్‌బంగలోని సిలిగురి నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ సీపీఎం అభ్యర్థి అశోక్‌ భట్టాచార్య గెలుపొందారు.
ఏఐడీయూఎఫ్‌ చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌
అసోంలో ఏఐయూడీఎఫ్‌ చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ ఓడిపోయారు. సల్మారా సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి వాజెద్‌ అలీ చౌదరి చేతిలో ఓటమి చవిచూశారు.

No comments:

Post a Comment