సమాజాన్ని మార్చే మామిడిచెట్టు కథ!
పిల్లలు
తప్పటడుగులు వేస్తుంటే... వారిని గమనించి సరైన దారి చూపేవారు
తల్లిదండ్రులు. ప్రస్తుత సమాజంలో కొంతమంది పిల్లలు.. పేరెంట్స్ మాటలు
వినకుండా చెడుదారుల్లో పయనిస్తూ... దేశం దృష్టిలో దోషులవుతున్నారు.
తల్లిదండ్రుల మాటలు విన్న పిల్లలు, సరైన లక్ష్యలు ఎంచుకున్న పిల్లలు మాత్రం
సమాజం మెచ్చుకునేలా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ప్రవర్తన,
తల్లిదండ్రుల పెంపకం గురించి సోషల్‌మీడియాలో ఓ చిన్న కథ వైరల్ అవుతోంది.
మీరు కూడా ఓ సారి చదివేయండి...
సమయం
రాత్రి 10 గంటలు! ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస
పెట్టమని, ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు. ‘‘చిన్నప్పటి
నుంచి చూస్తున్నాను... నాకు మీరు అస్సలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఎంత సేపు
చదువు.. చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు. నేను మిత్రులతో గడపకూడదా?
సినిమాలకి, షికార్లకి వెళ్లకూడదా? అందరు పిల్లలు వెళ్ళడం లేదా? మొబైల్‌లో
ఒక గంట సేపు మాట్లాడితే తప్పా? ఫేస్‌బుక్‌లో చాటింగ్ తప్పా?’’ అని
నిలదీసాడు కొడుకు. ‘‘సరే నీకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తాను. ఒక్కసారి నా మాట
వింటావా? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము. అక్కడ
రెండు రోజులు ఉందాము. తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం’’ అని తండ్రి
బదులిచ్చాడు. అందుకు కొడుకు సరే అన్నాడు. అనుకున్నట్టుగానే సొంత ఊరికి బయలు
దేరారు.
కొడుకును తండ్రి వాళ్ల
మామిడి తోటకు తీసుకెళ్ళి ‘‘నేను ఇక్కడే కుర్చుంటాను. ఈ తోటలో నువ్వు ఒక గంట
సేపు తిరిగి రా’’ అని చెప్పాడు. కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు. తోటలో
నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. అన్ని చెట్లు పెద్దగా బాగానే
ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా
ఉంది. ఆరోగ్యంగా లేదు. మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దానికి కారణం
ఏమిటి? అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ.. తండ్రి ఇలా అన్నాడు... ‘‘మామిడి
చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను,
కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు. లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య
రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే
అవకాశం కూడా ఎక్కువ. అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ
ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుకి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా
స్వేచ్ఛగా పెరగనిద్దాము అని వదిలేశాం’’. అని అన్నాడు. కొడుకుకి విషయం
అర్ధమయ్యింది
. ‘అనవసరంగా పెరిగే కొమ్మలు
ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో.. అదే విధంగా చదువుకునే వయసులో చేసే
అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం
కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు. చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని.
అంతే కానీ స్వేచ్ఛని అడ్డుకోవాలని కాదు’ అని భుజం మీద చెయ్యి వేసి తన
కుమారుడిని ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే
ప్రతి తల్లిదండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని
ఆశిస్తూ.............

No comments:
Post a Comment