Thursday, 12 May 2016

పుట్టిన వెంటనే ఆధార్‌... గుంటూరులో ప్రారంభం

ధ్రువపత్రం ఇస్తున్న డీఎంహెచ్‌ఓ పద్మజారాణి, పక్కన అస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడు
        జన్మించిన వెంటనే పసిబిడ్డకు ఆధార్‌ కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని గుంటూరులో బుధవారం ప్రారంభించారు. భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఈ కార్యక్రమాన్ని మన దేశంలో తొలుత హరియాణా రాష్ట్రంలో ప్రారంభించగా విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. దీన్ని గుంటూరులోని సర్వజనాసుపత్రిలో ప్రారంభించారు. జనన ధ్రువపత్రం తయారు చేయడం కోసం వివరాలు నమోదు చేసే సమయంలోనే తల్లి లేదా తండ్రి ఆధార్‌ సంఖ్య, ఫోన్‌ నెంబరు వివరాలు జతచేశారు. ఆ వెంటనే ఆ బిడ్డకు కూడా 14 అంకెలతో కూడిన నమోదు సంఖ్య వచ్చింది. ఆ పసిబిడ్డ శాశ్వత ఆధార్‌ నంబరు మూడు రోజుల్లో సంక్షిప్త సమాచారం ద్వారా తెలియజేయనున్నారు. పేరు పెట్టాక ఆధార్‌ కార్డులో మార్పు చేసుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత పిల్లల బయోమెట్రిక్‌ తీసుకుంటారు. దీనివల్ల వివరాలు తప్పుగా కూడా నమోదు కావడానికి వీలుండదు. ప్రభుత్వం నుంచి పొందే అన్ని రకాల ప్రయోజనాలకు ఈ కార్డు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే జననాలకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం త్వరలో ప్రైవేటు వైద్యశాలలకు వర్తింపజేయనుందని జిల్లా జనన, మరణాల రిజిస్ట్రార్‌, డీఎంహెచ్‌ఓ పద్మజారాణి తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment