Wednesday, 27 July 2016

తన కోర్కెలు తీర్చుకోవడానికి పిల్లల్ని బలిచేస్తోంది!


బెర్లిన్‌: తన చిన్నారి పాప ఏడిస్తేనే.. కన్నతల్లి గుండె విల విలలాడుతుంది. అలాంటిది జర్మనీకి చెందిన ఓ తల్లి తన కడుపున పుట్టిన ఎనిమది మంది పిల్లల్ని పురిట్లోనే అతి దారుణంగా చంపేసింది. పుట్టి కనీసం గంటలు కూడా గడవక ముందే వారిని హతమార్చి తన అపార్ట్‌మెంట్‌లోనే భద్రపరుస్తోంది. పది సంవత్సరాలుగా ఆమె ఎనిమిది మంది శిశువుల్ని హత్య చేసింది. ఎప్పుడూ గర్భవతిగానే కనబడే ఆ మహిళ పిల్లలు ఎప్పుడూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఆ కంప్లైంట్‌ ప్రకారం ఆ ఇంటికి వచ్చిన పోలీసులు ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఆ దంపతులు ద్వారా తెలుసుకున్నారు. ఆండ్రియా (45), జోహాన్‌ (54) దంపతులకు వివాహమైన మూడేళ్లలో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత పిల్లలు వద్దనుకున్నారు కానీ, కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఇద్దరికీ భయమే. కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వేసుకోవడం కూడా ఇష్టం లేదు. అయినా వారిద్దరూ తమ శారీరక వాంఛలను మాత్రం వదులుకోలేదు. ఫలితంగా ఆండ్రియా గర్భం ధరిస్తూ ఉండేది. గత పదేళ్లలో ఇలా ఎనిమిది సార్లు గర్భవతి అయింది. ప్రసవం అయిన వెంటనే ఆ పసిబిడ్డను హ్యాండ్‌టవల్‌లో వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసేది ఆండ్రియా. ఇలా ఎనిమిది మంది శిశువులను పురిట్లోనే కడతేర్చింది.
 
ఎప్పుడూ గర్భవతిగానే కనిపించే ఆండ్రియా పిల్లలు మాత్రం బయట కనపడకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో తల్లి ఆండ్రియాకు కనీసం 15 సంవత్సరాలు, తండ్రి జోహాన్‌కు కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

No comments:

Post a Comment