Saturday, 23 July 2016

తాగి రోడ్డెక్కితే అంతే....

వరుస ప్రమాదాల నేపథ్యంలో మందు బాబులకు ముకుతాడు వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తప్పతాగి వాహనాలు నడుపుతూ పట్టుబడే ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. సదరు ఉద్యోగుల వివరాలను, సంబంధిత శాఖ ముఖ్య అధికారులకు పంపి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే పట్టుబడే ప్రైవేటు ఉద్యోగుల వివరాల్ని ఆయా కంపెనీలకు అందజేసి చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు.
విద్యార్థులు పట్టుబడితే కళాశాలల నుంచి బహిష్కరించమని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను కోరాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. చనిపోవడమో, గాయపడటమో నిత్య కృత్యమయ్యాయి. మైనర్లు తప్పతాగి రేసింగుల్లో పాల్గొంటున్న ఘటనలు పెరిగాయి. దీంతో
ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర సీపీ మహేందర్‌రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. మందుబాబులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులను సమాయత్తం చేశారు. అందుకు అనుగుణంగా వారం రోజుల్లో కీలక నిర్ణయాలను అమలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు రక్తంలో ఆల్కాహాల్ శాతం 30 మి.మీలు దాటితేనే నేరంగా పరిగణించి కేసు నమోదు చేస్తున్నారు.
తక్కువ ఉంటే జరిమానాతో సరిపెడుతున్నారు. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ మోతాదులో ఆల్కాహాల్ శాతం ఉన్నా జైలు శిక్ష విధించాలని ట్రాఫిక్ పోలీసులు జిల్లా జడ్జిను, ఇతర మెజిస్ట్రేట్లను కలిసి కోరినట్లు తెలిసింది. ఇక మైనర్లు తాగి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇక మీదట ఇప్పటికే కౌన్సిలింగ్‌కు వచ్చిన వారి పిల్లలు మళ్లీ పట్టుబడితే తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment