కొచ్చి/సూరత్: కొడుకు
భవిష్యత్ గురించి ఆలోచించని తండ్రి ఎవరూ ఉండరని అందరికీ తెలిసిన విషయమే.
సంపన్న కుటుంబాలలో పుట్టిన పిల్లల భవిష్యత్ గురించి తండ్రుల తాపత్రయం
గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని సినిమాలలో ఇలాంటివి
చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం సినిమా కథలా ఉండే
వాస్తవ కథనం.
సావ్‌జీ
ఢోలకియా గుజరాత్‌కి చెందిన వజ్రాల వ్యాపారి. ఆయన కుమారుడు ద్రావ్య(21)
అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు. కొడుకు ద్రావ్య సెలవులకు ఇంటికొచ్చాడు. ఏ
తండ్రైనా చాలా సుకుమారంగా చూసుకుంటాడు. సావ్‌జీ ఢోలకియా మాత్రం కొడుకుకి
కష్టం విలువ ఏంటో, సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేయాలనుకున్నాడు.
ఆలస్యం చేయకుండా కొడుకుకి పరీక్ష పెట్టేశాడు. అంతే నెల రోజులపాటు ఇంటికి
రాకుండా కష్టపడి బతకాలనేది ఆయన ఆలోచన. అంతటితో ఆగలేదు కష్టం విలువ తెలియడం
కోసం కొన్ని షరత్తులు కూడా విధించాడు.
మొదటి షరత్: మూడు జతల బట్టలు , రూ. 7 వేలు ఇచ్చి బయటకు వెళ్లమన్నాడు.
రెండవ షరత్: తండ్రి ఇచ్చిన డబ్బుని అత్యవసర పరిస్థితులలో మాత్రమే వాడాలని సూచించాడు.
మూడవ షరత్: ఫోన్ వినియోగించరాదని సూచించాడు.
నాలుగవ షరత్: తండ్రి పేరుని ఎక్కడా వాడకూడదని తెలిపాడు.
ఇన్ని షరత్‌ల మధ్య నెల రోజుల కొత్త జీవితాన్ని ప్రారంభించి ద్రావ్య
కొచ్చి చేరుకున్నాడు. మొదటిరోజు బేకరీలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్,
చెప్పుల దుకాణం, మెక్‌డోనాల్డ్ అవుట్ లెట్‌లలో పని చేశాడు. నెల రోజులుపాటు
కష్టపడి పనిచేసి రూ.4 వేలు సంపాదించాడు.
ద్రావ్య
పడిన కష్టాలేంటో మీరు కూడా అతని మాటల్లో చదవండి.‘ మొదటి రోజు ఎంత తిరిగినా
ఉద్యోగం దొరకలేదు. దాదాపు 60 చోట్లకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అప్పుడు
అర్థమైంది ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమోనని. డబ్బు గురించి ఆలోచించలేదు.
నేను సంపాదించిన దాంట్లో రూ. 40 భోజనం చేసేవాడిని, లాడ్డికి రోజుకి రూ.250
ఖర్చుచేసేవాడిని’ అని వివరించాడు.
కొడుకుకి
కష్టంపై తండ్రి ఈ విధంగా స్పందించాడు. జీవితం నేర్పేకష్టాలు
యూనివర్సిటీలలో నేర్పరని, సామాన్యుల కష్టాల గురించి నా కుమారుడు
తెలుసుకోవాలని ఇదంతా చేశానని చెప్పారు. అనుభవానికి మించిన పాఠం మరోకటి
లేదని సావ్‌జీ ఢొలకియా అభిప్రాయపడ్డారు. హరేకృష్ట డైమండ్ ఎక్స్‌పోర్ట్స్
పేరుతో సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. తమ
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి గతేడాది దీపావళీకి ఖరీదైన బహుమతులు ఇచ్చి
వార్తల్లో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.6000 కోట్లు ఉంటుందని
అంచనా.

No comments:
Post a Comment