Friday, 29 July 2016

హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌

కలుషిత నీళ్లు, ఆహారంతో ముప్పు 

  • హెప టైటిస్‌-బీ, సీ-ఇన్‌ఫెక్షన్లూ ముప్పే.. 
ఆదిలో గుర్తిస్తేనే నియంత్రణ హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌ హెపటైటిస్‌. ఆదిలో గుర్తించేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది సైలెంట్‌ కిల్లర్‌. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే చాలు..ఇక తన పని తాను చేసుకుంటూ పోతోంది. 5 రకాల ఇన్‌ఫెక్షన్లతో శరీరాన్ని నాశనం చేస్తోంది.
హెపటైటిస్-బీ, హెపటైటిస్ -సీ ఎక్కువగా జనంపై దాడిచేస్తున్నాయి.
 
హెపటైటిస్-బీతో 3.4 శాతం, హెపటైటిస్-సీతో 1శాతం ప్రజలు బాధపడుతున్నారు. నగరంలో గర్భిణిల్లో 1శాతం హెపటైటిస్తో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంలో హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందనే విషయం చాలామందికి తెలియదు. తెలిసే లోపే జరగరాని నష్టంజరిగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాదీ జూలై 28న హెపటైటిస్‌-బీ వైర్‌సను కొనుగొన్న ప్రొఫెసర్‌ బ్లంబెర్గ్‌ జయంతి సందర్భంగా వరల్డ్‌ హెపటైటిస్‌ డేను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో హెపటైటిస్‌పై మరింత అవగాహన పెంచడానికి ఈ ఏడాది ‘ప్రతి ఒక్కరూ హెపటైటిస్‌ నివారణకు’ కృషి చేయాలనే థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
 
పొంచి ఉన్న వైరస్‌ ముప్పు :-
అప్రమత్తంగా లేకుంటే ఈ హెపటైటిస్‌ వైరస్‌ దాడిచేయడానికి సిద్ధంగా ఉంటుందని వైద్యులు వివరించారు. హెపటైటిస్‌ ఏ, బీ, సీ, డీ, ఈ అనే అయిదు రకాల ఇన్‌ఫెక్షన్లు ప్రజలపై దాడిచేస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ల కారణంగా దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుందన్నారు. హెపటైటిస్‌- ఏ, హెపటైటిస్-ఈ వైర్‌సలు కామెర్లతో బాధపడే వారిలో కనిపిస్తాయని తెలిపారు. హెపటైటిస్-డీవైరస్‌ రక్త మార్పిడి సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ‘ఈ’ వైరస్‌ రక్తం మరకలపై వారం వరకు బతికే ఉంటుందని, ఈ సమయంలో ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఇన్‌ఫెక్షన్‌బ్లడ్‌, ఫ్లూయిడ్‌ ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదముందన్నారు. హెపటైటిస్‌ ‘ఈ’ వైరస్‌ అపరిశుభ్రత నీటి వల్ల కూడా వ్యాపిస్తోందని వైద్యులు వివరించారు.
 
బీ, సీ ఇన్‌ఫెక్షన్ల తో లివర్‌ సిర్రోసిస్‌ :-
హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌లను నిర్లక్ష్యం చేస్తే లివర్‌ సిర్రోసిస్‌కు దారితీసే ప్రమాదముందని వైద్యులు వివరించారు. లివర్‌ సిర్రోసిస్‌ వల్ల కాలేయం పూర్తిగా చెడిపోయి రక్తం కారుతోం దన్నారు. చివరకు కేన్సర్‌కు దారితీయొచ్చని, కొన్నిసార్లు కాలేయ పనితీరు ఆగిపోయే ప్రమాదముందని డాక్టర్లు తెలిపారు.
 
ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపించవు:-
హెపటైటిస్‌ జబ్బుకాదు. ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇది వ్యాపిస్తోంది. ఇన్‌ఫెక్షన్లతో ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాధి సోకిన నెలరోజుల వరకు కానీ లక్షణాలు బయటకు కనిపించవు. అప్పటికే ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవని తెలిసిన వెంటనే వైద్యుల సలహాప్రకారం చికిత్సలు తీసుకుంటూ పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే. కలుషిత నీటి వల్ల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 - డాక్టర్‌ కిరణ్‌పెద్ది, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, గ్లోబల్‌ ఆస్పత్రి
 
ముందు జాగ్రత్తతో నియంత్రణ :-
హెపటైటిస్ను ముందుజాగ్రత్తతో నియంత్రించొచ్చు. ప్రధానంగా మూడు రకాల జాగ్రత్తలతో ఇన్‌ఫెక్షన్లను అరికట్టే అవకాశముంది. ముందుగా హెపైటిస్‌ రాకుండా నివారించడం, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవడం, రోగి వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ తీసుకోవడం ప్రధానంగా చేయాలి. హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లను ఆదిలోనే గుర్తించి చికిత్సలు తీసుకో వొచ్చు. ఈ ఇన్‌పెక్షన్లను వ్యాక్సిన్లతో నియంత్రించే అవకాశాలున్నాయి. అన్నిరకాల హెపటైటిస్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్‌ కెఎస్‌.సోమశేఖర్‌రావు, గ్యాసో్ట్ర ఎంటరాలజిస్టు, అపోలో ఆస్పత్రి
 
హెపటైటీస్‌ ఇలా:-
  •  మలవ్యర్థాలు తాగునీటిలో కలవడం వల్ల హెపటైటిస్-ఏ వచ్చే అవకాశముంది. 
  • తల్లి నుంచి బిడ్డకు, ఒకరు వినియోగించిన ఇంజెక్షన్లు మరొకరు వాడడం, సెక్స్‌ద్వారా హెపటైటిస్-బీ, డీ వస్తుంది. 
  •  సరిగ్గా స్టెరిలైజ్‌ చేయకుండా వాడే వైద్య పరికారాలు, మరొకరు వాడిన ఇంజెక్షన్ల వల్ల హెపటైటిస్-సీ రావొచ్చు. 
  •  కలుషిత నీటివల్ల హెపటైటిస్- ఈ వస్తోంది. 
  •  పెరినటల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ (మాయ) ద్వారా ఈ వ్యాధి బిడ్డకు సంక్రమించే ప్రమాదముంది. 
  •  ఆస్పత్రుల్లో ప్రసవ సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదముంది. 
  •  ఆస్పత్రుల్లో సిబ్బంది గ్లౌజులను సక్రమంగా వినియోగించకపోవడం వల్ల కూడా రావొచ్చు. 
  •  పిల్లలు ఆడుకునే సమయంలో ఒకరి నుంచి మరొరికి ఈ వ్యాధి సంక్రమించొచ్చు. 
  • శరీరంపై గాట్లు ఉన్న వ్యక్తిని తగిలితే ఇతరులకు ఈ వ్యాధి రావొచ్చు. 
  •  వినియోగించిన డ్రగ్స్‌, నీడిల్స్‌, రక్షణ లేని ఇంజెక్షన్ల ద్వారా ఈ వైరస్‌ సోకొచ్చు. 
  • ఒకరు వినియోగించిన టూత్‌ బ్రెష్‌లు, బ్లేడ్‌లను మరొకరు వాడితే వైరస్‌ రావొచ్చు.
 

No comments:

Post a Comment