Thursday, 28 July 2016

డెంగీ గురించి అపోహలు.. అనుమానాలు..

డెంగీ గురించి గమనించవలసిన క్రింది లక్షణాలు :
దోమకాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.
హఠాత్తుగా తీవ్ర జ్వరం..
తీవ్రమైన తలనొప్పి..
కంటి గుడ్లలో నొప్పి..
ఒళ్ళు, కీళ్ళ నొప్పులు..
ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా ఒకసారి వైద్యుని సంప్రదించి డెంగీ జ్వరమో కాదో తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. అంతే కాని మామూలు జ్వరం అని సొంత వైద్యం పనికిరాదు.


జ్వరంలో కాదు తగ్గేప్పుడు జాగ్రత్త :
డెంగీ వస్తే జ్వరం చాలా తీవ్రంగా 105 డిగ్రీల వరకు ఉండి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు. అయినా డెంగీలో ఇదేమంత ప్రమాదకర దశ కాదు. కాని జ్వరం రెండు మూడు రోజులలో తగ్గుతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద మచ్చలు రావటం, ప్లేటులేట్లు తగ్గిపోవటం, బి.పి. తగ్గటం వంటివి ఆరంభమయ్యేది ఇప్పడే, డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ . కాబట్టి జ్వరంలో ఉన్నప్పుడు కాదు జ్వరం తగ్గినప్పుడే మరింత శ్రద్ధగా అప్రమత్తంగా ఉండాలి.
ప్లేటులేట్ల కంటే ”ప్లాస్మా” ముఖ్యం :
డెంగీజ్వరం అనగానే ప్లేటులేట్లు పడిపోతాయని భయపడు తుంటారు. కాని దీని కంటే ప్రమాదకరమైనది రక్తనాళాల్లో నుంచి ప్లాస్మాలీక్‌ అవుతుండటం. మన రక్తంలో ఎర్ర కణాలు, ప్లేటులేట్లు అన్ని కలిపి 45 శాతమే ఉంటాయి. మిగిలిన 55 శాతం ద్రవ పదార్థం ప్లాస్మానే. రక్త నాళాల్లోంచి ప్లాస్మా కడుపు, ఊపిరితిత్తులు, కణ జాలాల్లోకి లీక్‌ అయిపోయి, దీంతో రక్తం చిక్కబడిపోయి రక్తం పరిమాణం తగ్గి బి.పి. పడిపోతుంది. ఈ స్థితిలో శరీరభాగాలకు తగినంత రక్తం, ఆక్సీజన్‌ అందక అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. డెంగీ జ్వరంతో ఎక్కువగా రోగులు చనిపోయేది ఈ స్థితిలోనే కాబట్టి ప్లేటులేట్లు పట్టించుకోవటం కాకుండా, వీరికి ”హిమా టో క్రిట్ ” (HCT) పరీక్ష చేసి రక్తం చిక్కబడుతుందా? బిపి తగ్గిపోతుందా? అన్నది ముఖ్యం.
20 వేల వరకు తగ్గినా:
డెంగీ జ్వరం వచ్చినపుడు రక్తంలో ప్లేటులేటు కణాలు కొంత తగ్గటం సహజం. అయతే ఈ కొద్దిపాటి తగ్గుదలకే ప్రమాద సంకేతంగా భావిస్తూ ప్లేటులేట్లు ఎక్కించాల్సిన పనిలేదు. సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్లేటులేట్లు 1.5 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య 1 లక్షకంటే తక్కువగా పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఈ స్థితిలో వైద్యుల పర్యవేక్షణ అవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేటులేట్ల సంఖ్య 20వేల కన్నా తక్కువ ఉండి రక్తస్రావం లక్షణాలు కనబడుతుంటే వెంటనే ప్లేటులేట్లు ఎక్కించాలి. లేదా ఎలాంటి రక్తస్రావం లక్షణాలు లేకున్నా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోతే ప్లేటులేట్లు ఎక్కించాలి. కాబట్టి లక్ష కంటే తగ్గగానే ప్లేటులేట్లు తగ్గుతున్నాయంటూ ఆందోళనలో వైద్యులపై ఒత్తిడి పెంచాల్సిన పనిలేదని గుర్తించాలి.
నొప్పలు తగ్గించే మందులు వాడవద్దు:
సాధారణంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పి లాంటి బాధలు తగ్గేందుకు ఐబూప్రోఫెన్‌ వంటి మందులు వాడు తుంటారు . కాని డెంగీజ్వరంలో వీటిని వాడకుండా ఈ సీజన్లో జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్పించి క్రింది మందులు వాడకూడదు.
ఉదా: ఆస్ప్రిన్‌, ఐబూప్రోఫెన్‌, నిముస్‌లైడ్‌, డైక్లోఫినాక్‌, అసైక్లోఫినాక్‌,
పరీక్షలు అనవసరం అనుకోవద్దు:
డెంగీ జ్వరమైతే డాక్టర్ల పర్యవేక్షణలో సమస్యను నిర్ధారించి రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ సాధారణ చికిత్స చేస్తే తగ్గిపోతుంది. డెంగీ జ్వరంలో ఒకరకమైన డెంగీ హేమరేజిక్‌ జ్వరంలోనే ప్రమాదకరమైన సమస్యలు మొదలవుతాయి. మొది మూడు రోజుల్లో సాధారణ డెంగీకి ఈ ప్రమాదకరమైన రకానికి తేడా కనిపెట్టడం కష్టం. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే వైద్యులకు చూపించుకొని వారి సలహా ప్రకారం రక్త పరీక్షలు చేయించుకొని రోగి పరిస్థితిని ప్రతి రోజు వైద్యులకు తెలుపుతుండాలి. దీని పరిస్థితి తెలుసుకోవటం కోసం రక్త పరీక్ష పలుమార్లు చేసే అవసరం ఉందని గమనించాలి.
ప్రమాద సంకేతాలు కీలకం :
డెంగీ జ్వర పీడితులు సమస్యల్లోకి వెళుతున్నపుడు దాన్ని ఖచ్చితంగా నిర్ధారించి, దీనికోసం రక్తపరీక్షలు కచ్చితంగా చేస్తుండాలి. సాధారణంగా ప్లాస్మా లీకేజి ఎక్కువై ఉంటే ఫ్యాక్ట్‌సెల్‌ వాల్యూమ్‌ ఉండాల్సిన దానికంటే 20% పెరిగినా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా ఏదైనా అవయవం దెబ్బతిన్నా దాన్ని ”డెంగీ హెమిరేజిక్‌ ఫీవర్‌” అంారు. ఇది డెంగీలో చాలా తీవ్రమైన స్థితి జ్వరం. జ్వరం వచ్చిన 3,4 రోజుల్లో హిమోగ్లోబిన్‌ శాతం అసాధారణంగా పెరిగితే వెంటనే వేగంగా సెలైన్‌ ఎక్కించాలి. అందుకే డెంగీ జ్వరంలో ప్లేటులేట్ల సంఖ్య చూడడం కంటే కూడా హెమో టో క్రిట్, ఫ్యాక్ట్‌ సెల్‌ వాల్యూమ్‌ ప్రధానమైనదని గుర్తించాలి. రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం ఎంత ఉందో చెప్పే చిన్న రక్త పరీక్ష చేసుకోక శ్రద్ధ పెట్టకపోటం వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి.

No comments:

Post a Comment